సంస్కరణల సంసారం

ఆమె..
పోరాట యోధుడు పూలేకి అర్ధనారీశ్వరి
మాత్రమే కాదు..
తానుగా పోరాడే మాహేశ్వరి..
ఉద్యమాల ఝరి..
అక్షరాల సిరి..
స్వచ్చ కావేరి..!

సావిత్రీ భాయి పూలే..
ఈ పేరు సంస్కరణకు…
తిరస్కరణకు మారుపేరు..
ఎక్కడ దుస్సంప్రదాయం ఉంటే అక్కడ తను..
పెను తుపాను..
వితంతు శిరోముండనం..
ఆమెకు నచ్చని తంతు..
ఎదిరించి..ఎదురు నిలిచి..
క్షురకులను
ఒక త్రాటిపై నిలిపి..
రాసింది సరికొత్త లిపి..
పతితో చేయి కలిపి..!

బాల్యంలోనే వివాహం..
భర్తతోనే అహరహం..
ఆయన ఆరాటమే
తన పోరాటమై..
ప్రాణాలతో చెలగాటమై..
అధికులను త్రోసిరాజన్న
పధికురాలై..
ఎందరి జీవితాల్లోనే
తానే తొలిపొద్దుగా..
రాజీ వద్దంటే వద్దుగా..!

విద్యలో తొలిగురువు
భర్త జ్యోతి..
ఆయన ప్రయాణంలో
తను జీవనజ్యోతి..
పోరాటాలతో
అఖండ ఖ్యాతి..
ఎన్ని అవాంతరాలు ఎదురైనా చెక్కు చెదరని సేవానిరతి..
మెచ్చింది అఖండభారతి..!

రోజూ రెండువేల మందికి అన్నం పెట్టిన అమ్మ..
అక్షరం నేర్పిన టీచరమ్మ..
వితంతులకు
పెళ్లి చేసిన పెద్దమ్మ..
పురోహితురాలిగా
తానే సూత్రధారిగా..
సూత్రం కట్టించిన పేరమ్మ..
అబ్బో ఎంత..పేరమ్మా..!

తను నేర్చుకున్న చదువు
పెంచుకున్న పరువు..
తనతోనే ఆగిపోరాదని
భర్త ఆశయం వీగిపోరాదని
పోరాటమే పథమై..
సంస్కరణ శపథమై..
ధైర్యమే ఆయుధమై..
సాగిన ధీరవనిత..
జాతి మెచ్చిన
ఆదర్శ నెలత..!
ఎందరి జీవితాల్లోనో
ఆవరించిన చీకట్లను పారద్రోలిన తటిల్లత..
సిసలైన విజేత..!!
సావిత్రీబాయి పూలే వర్ధంతి సందర్భంగా ప్రమాణాలతో..

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply