-కులం కార్డు వాడటం తెలియని బోళా శంకరుడు
-మళ్లీ టికెట్ రాదన్న సంకేతాలే సాయన్నను కుంగదీసిందా?
-మంచితనం మిగిల్చి వెళ్లిపోయిన స్నేహజీవి సాయన్న
( మార్తి సుబ్రహ్మణ్యం)
జ్ఞాని సాయన్న. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే. అజాత శత్రువు. నాకు ఆయనతో మూడు దశాబ్దాల అనుబంధం. కార్పొరేటర్‌గా పోటీ చేసినప్పటి నుంచి అనుబంధం. ఇప్పటి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాయన్న కలసి ఒక స్కూటర్ మీద తిరిగే రోజుల నుంచి నాకు ఆయనతో పరిచయం. ఎస్సీ కార్డును రాజకీయాల్లో ఎలా వాడుకోవాలో తెలియని రాజకీయ నాయకులు ఎవరు? అని పోటీ పెడితే.. సాయన్నకు కచ్చితంగా జీరో మార్కులొస్తాయి. చాలా బోళా మనిషి. ఎవరితో కొట్లాడే రకం కాదు. ఆ ధైర్యం కూడా చేయలేరు. అలాంటి సాయన్న ఇక లేరని తలచుకుంటేనే మనసు వికలమవుతోంది. స్నేహానికి మరో రూపు సాయన్న.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆయన ఐదుసార్లు గెలిచారు. ఆ నియోజకవర్గంలో అదొక చరిత్ర. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారంటే, ప్రజాభిమానంలో ఆయనకు ఎన్నిమార్కులు వస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 90వ దశకంలో నేను ఆంధ్రభూమిలో హైదరాబాద్ టీడీపీ బీట్ చూసే వాడిని.
ఆంధ్రజ్యోతి ఆంజనేయులు, ఆంధ్రప్రభ శ్రీనివాస్ (అంతకంటే ముందు హరిప్రసాద్, రమణ పనిచేసేవాళ్లు), వార్త వెంకటేష్, ఈనాడు దత్తాత్రేయ, ఇప్పుడు టీవీ9లో కోఆర్డినేటర్‌గా చేస్తున్న సిటీ కేబుల్ హరిప్రసాద్ .. హైదరాబాద్ టీడీపీ బీట్‌లో సహచరులుగా పనిచేసినట్లు గుర్తు. వీరిలో రమణ, హరిప్రసాద్ మినహాయిస్తే, రాష్ట్ర విభజన ముందు వర కూ టీడీపీ బీట్‌లోనే పనిచేసేవాళ్లం.
సాయన్న మంచి భోజన ప్రియుడు. నాన్ వెజ్ అమితంగా ఇష్టపడేవారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మధ్యాహ్నం మాకు ఫోన్లు చేసి, రవీంద్రభారతి పక్కన ఉన్న ఇందు హోటల్‌కు భోజనానికి రమ్మని పిలిచేవారు. బేగంపేట ఎయిర్‌పోర్టు పక్కన గల్లీలో ఉన్న ఊర్వశి రెస్టారెంట్‌లో మేమంతా తరచూ కలిసేవాళ్లం. ఈ రెండు కాకపోతే హిమాయత్‌నగర్‌లోని నాన్‌కింగ్ రెస్టారెంట్ మా అడ్డాగా ఉండేది. అప్పట్లో ఎంపీ అల్లాడి రాజ్‌కుమార్ శిష్యగణంలో సాయన్న, ముఠా గోపాల్, నందకుమార్ వ్యాస్, పుస్తె బాబురావు, నోముల ప్రకాష్ ప్రముఖులు.
అల్లాడి రాజ్‌కుమార్‌కు రెండోసారి ఎంపీగా అవకాశం వచ్చినప్పుడు, మేమంతా కలసి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి వెళ్లిన జ్ఞాపకం మర్చిపోలేను. ఢిల్లీకి అప్పుడే కొత్తగా వెళ్లిన మమ్మల్ని, నందకిశోర్‌వ్యాస్ సిటీ చూపించిన జ్ఞాపకం. అప్పుడు సుష్మా స్వరాజ్ ఢిల్లీ సీఎంగా ఉన్నట్లు గుర్తు. అక్కడ అల్లాడి రాజ్‌కమార్ గారి క్వార్టర్‌లో సుబ్బయ్య చేతి వంట మర్చిపోలేం. సాయన్నకు మంత్రి పదవి కోసం అల్లాడి కృషి చేసినా, అది తలసాని శ్రీనివాసయాదవ్ ను వరించింది. అప్పటి నుంచే సాయన్నకు తలసానిపై కొంత అసంతృప్తి ఉండేది.
ఓ సందర్భంలో గడ్డపాయన నాకెందుకు మంత్రి పదవి ఇవ్వడు? అని అప్పటి సీఎం చంద్రబాబునుద్దేశించి సాయన్న ఆవేదనతో అడిగేవారు.శ్రీనివాసయాదవ్ కంటే నేను సీనియర్. అయినా నాకెందుకు మంత్రి పదవి ఇవ్వడు అని అమాయకంగా ప్రశ్నించేవారు. ‘తలసానికి ఉన్న ధైర్యం, తెగింపు మీకు లేదు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అది మీలో లేదు. తలసానిలో అవి ఉన్నాయి. ఆయన ఎవరికీ భయపడడు. అందుకే చంద్రబాబు ఆయనకు భయపడతాడు. అందుకే మీకు మంత్రి పదవి రావడం లేద’ని వివరంగా చెప్పేవాడిని. అందుకు సాయన్న కూడా ‘అవును.. అది కూడా నిజమే. ఆపని మనం చేయలేం’ అని నిజాయితీగా అంగీకరించేవారు.
నిజానికి ఎస్సీ కార్డు ఉన్నా, దానిని రాజకీయంగా ఎలా సద్వినియోగం చేసుకోవాలో సాయన్నకు తెలిసేది కాదు. ఒకవేళ తెలిసినా దానిని వాడేందుకు సాహసించేవారు కాదు. కానీ సాయన్న మిత్రుడైన నాటి టీడీపీ నగర అధ్యక్షుడు, ప్రస్తుత ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఒక్కడే అప్పట్లో తలసాని హవాను తట్టుకుని మనుగడ సాగించారు. దానికి కారణం అల్లాడి రాజ్‌కుమార్ ఆశీస్సులు, గోపాల్ కష్టపడే మనస్తత్వమే.
పరిటాల రవి హత్య జరిగిన సమయం అది. అప్పుడు సాయన్న నగర టీడీపీ అధ్యక్షుడు. పార్టీ ఆఫీసు హిమాయత్‌నగర్‌లో ఉండేది. సాయన్న న్యాయవాది. అయినప్పటికీ, మంచి లాయర్లను ఎట్టుకోవాలని అన్నప్పుడు.. మీరే లాయరు కదా? అని నేను గుర్తు చేస్తే, నవ్విన జ్ఞాపకం నేను మర్చిపోను. అప్పట్లో ఇప్పటి బీఆర్‌ఎస్ నేత బీఎన్‌రెడ్డి, అడ్డా శ్రీనివాస్ సహా, నలుగురైదురు నేతలు న్యాయవాదులే. అప్పట్లో అదో జోకుగా ఉండేది.
అప్పట్లో యువనేత సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మమ్మల్ని సమన్వయం చేసేవాడు. తలసాని, సాయన్న, తీగల కృష్ణారెడ్డి నగర అధ్యక్షులుగా ఉన్నప్పుడు, వారికి ఏ సమస్య వచ్చినా సింగిరెడ్డి మమ్మల్ని వారి వద్దకు తీసుకువెళ్లేవాడు. అందరికీ తలలో నాలుకగా ఉండే సింగిరెడ్డి ఆకస్మిక మరణం, వ్యక్తిగతంగా మాకందరికీ తీరనిలోటు. అంతకుముందు టీడీపీ నుంచి, తొలిరోజుల్లో టీఆర్‌ఎస్ సిటీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సుదర్శన్‌రావు మృతి కూడా బాధించింది.
ఇప్పటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్, ముఠా గోపాల్, అప్పటి కార్పొరేషన్ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా, బండారి మోహన్‌రెడ్డి, డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, కొమ్మినేని వికాస్, సింగిరెడ్డి, దర్శన్, వీరరాఘవరెడ్డి, ఖుద్దూస్,అరవిందకుమార్ గౌడ్, చిన్న శ్రీశైలం యాదవ్, మల్లికార్జున్‌గౌడ్, దేవరి మల్లప్ప, సుధాకర్ గౌడ్, ఎమ్మెన్ శ్రీనివాసరావు, మేకల సారంగపాణి, కార్పొరేటర్ శేఖర్‌రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత నర్రా రవికుమార్ వంటి నేతలంతా తరచూ కలిసేవాళ్లం.
చంద్రబాబు సీఎం అయిన తర్వాత సాయన్న మంత్రి పదవి ఆశించారు. కానీ ఒకసారి తలసాని, మరోసారి కృష్ణయాదవ్‌కు ఆ అవకాశం లభించింది. ఆ సందర్భంలో కొందరు జర్నలిస్టు మిత్రులు.. మీరు రాజీనామా చేస్తానని చంద్రబాబుకు ఝలక్ ఇవ్వమని సలహా ఇచ్చారు. కానీ స్వతహాగా భయస్తుడైన సాయన్న అందుకు అంగీకరించలేదు. అయితే తనకు కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వనందుకు చాలా కుమిలిపోయేవారు.
ఒకసారి ఆయన సీఎం వైఎస్ వద్దకు వెళ్లారు. సెక్రటేరియేట్ లోపలికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. నేను వెళ్లి కలిశా. సీఎం దగ్గరకు వెళుతున్నా. బయటకు వచ్చిన తర్వాత కలుద్దాం అన్నారు. వైఎస్‌ను కలసి బయటకు వచ్చిన తర్వాత క్యాంటిన్ బయట టీ తాగాం.
‘ సుబ్బూ. మన గడ్డపాయనకు- వైఎస్‌కూ చాలా ఫరాక్ ఉంది. నన్ను చూడగనే వైఎస్ లేచి, వాట్సార్ ఏం కావాలి అని అడిగారు. సీఎం రిలీఫ్‌ఫండ్ కోసం వచ్చా సార్ అని చెప్పా. ఎంతకావాలి అని అడిగారు. నేను చెప్పా. వె ంటనే వైఎస్ 70 వేలకు సంతకం చేశారు. గడ్డపాయన (చంద్రబాబు) 25 వేలకు మించి ఎప్పుడూ ఇవ్వలేదు. వైఎస్‌ను తారిఫ్ చేయాల్సిందే సుబ్బూ’ అని ఉబ్బితబ్బిబ్బయిపోయి చెప్పారు. ఎందుకంటే.. అంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, అప్పట్లో ఎవరికీ 25 వేల రూపాయలు మించి సీఎంరిలీఫ్ ఫండ్ ఇచ్చిన సందర్భాలు లేవు కాబట్టి! అంత బోళాశంకరుడు సాయన్న!!
హైదరాబాద్ సిటీలో ఎవరు ఎమ్మెల్యేలున్నా కింగ్‌మేకర్ తలసాని మాత్రమే. ఆయన మంత్రి పదవిలో ఉన్నా, లేకపోయినా సొంత ఇమేజ్‌తోనే రాజకీయాల్లో రాణించారు. తలసాని ఆమోదం లేనిదే ఎవరికీ పదవులు వచ్చేవి కాని రోజులవి. ప్రధానంగా సిటీ ప్రెసిడెంట్ ఎంపిక సమయంలో ఎమ్మెల్వే క్వార్టర్స్‌లో మా మధ్య ఓ చర్చ జరిగింది. చాలామంది సాయన్న పేరు సిఫార్సు చేశారు.
‘సాయన్న సాఫ్ట్. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆయనకు చాలా బాధ్యతలున్నాయి. సిటీలో ఫాస్ట్‌గా ఉండాలి. పబ్లిక్ ఇమేజ్ ను చూస్తారు. అందువల్ల తీగల కృష్ణారెడ్డి సిటీ ప్రెసిడెంట్‌కు బెటర్. కృష్ణారెడ్డి హుడా చైర్మన్‌గా ఉన్నారు’ అని తలసాని వివరించారు. చివరకు టీడీపీ సిటీ ప్రెసిడెంట్ పదవి తలసాని చెప్పినట్లు తీగల కృష్ణారెడ్డినే వరించింది. అప్పట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తలసాని రూము మా అందరికీ అడ్డాగా ఉండేది. అక్కడే హైదరాబాద్ పార్టీకి సంబంధించిన నిర్ణయాలు జరిగేవి.
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఆయనకు టీటీడీ మెంబరుగా అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంలో ఆయన- నేను విజయవాడ డివి మేనర్ హోటల్‌లో చాలాసార్లు కలిశాం. అప్పట్లో ఆంధ్ర భూమిలో ఉన్న నన్ను.. హైదరాబాద్ నుంచి విజయవాడకు బ్యూరోచీఫ్‌గా బదిలీ చేశారు. టీటీడీ మెంబరుగా ఉన్న సాయన్న, టీటీడీ లెటర్లపై సంతకం చేసి, ఆ వివరాలను ఆయనే రాసుకోవడం బాగా గుర్తు. ఎమ్మెల్యే కంటే టీటీడీ మెంబర్‌గానే సంతృప్తి ఎక్కువగా ఉందని చెప్పేవారు.
టీఆర్‌ఎస్‌లో చేరేముందు నాకు రెండుసార్లు ఫోన్ చేశారు. ఆ పార్టీలో చేరక ముందు-చేరిన తర్వాత తన కు ఇచ్చిన గౌరవం గురించి చెప్పేవారు.ఒక ఏడాది నుంచి సాయన్న అభ ద్రతో కనిపించేవారు. ‘క్రిశాంక్‌కు టికెట్ ఇచ్చేందుకు కేటీఆర్ ఆసక్తిగా ఉన్నాడు. సార్ (కేసీఆర్) సిట్టింగులకు సీట్లు ఇస్తామంటాడు. కేటీఆర్ మాత్రం క్రిశాంక్ వైపున్నాడు. ఏమీ అర్ధం కావడం లేద’ని నాతో వాపోయేవారు. అయితే ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ పోస్టింగుల్లో నేను ఇచ్చిన లెటర్లను కేటీఆర్ గౌరవిస్తున్నారని సాయన్న తృప్తి పడేవారు.
కానీ ఆయనకున్న సుగర్ వ్యాధికి, టికెట్ రాదన్న మానసిక ఆందోళన తోడయింది. సుగర్ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పటికీ, ప్రజలతో నిరంతరం మమేకం అయ్యేవారు. సుగర్ మోతుదు మించడంతో ఆయన కాలు తొలగించిన విషాదం. ఆయన కుమార్తె అన్నీ దగ్గరుండి చూసుకునేది. కార్యకర్తల కష్టసుఖాలు కూడా ఆమెనే ఆరా తీసేది. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే, కుమార్తెకు సీటు ఇవ్వాలన్నది ఆయన కోరిక. కుమార్తెను ఎమ్మెల్యేగా చూడాలన్న కోరికతోపాటు, ఒక్కసారి మంత్రి కావాలన్న కోరిక తీరకుండానే సాయన్న తనువు చాలించారు. అది ఓ విషాదం. తనకు తిరిగి టికెట్ ఇవ్వరన్న మానసిక వేదనే ఆయనను మృత్యువుకు దగ్గర చేసిందన్నది సాయన్న అనుచరుల అభిప్రాయం.
పదవులు వస్తాయి. పోతాయి. పదవులు శాశ్వతం కాదు. కానీ పదవి ఉన్నా.. లేకపోయినా.. అన్ని వేళలా ఒకే విధంగా వ్యవహరించే వారు బహు అరుదు. అలాంటి వారిలో సాయన్న, గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఇప్పటి మంత్రి తలసాని, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నాటి మేయర్ తీగల కృష్ణారెడ్డి, అప్పటి మంత్రి జానారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కన్నా లక్ష్మీనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దాడి వీరభద్రరావు, శిద్దా రాఘవరావు, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్ద్‌న్, దివంగత సీఎల్పీ నేత పీజేఆర్, కోడెల శివప్రసాదరావు లాంటి వారు కొందరే నా అనుభవంలో తారసపడ్డారు. స్నేహజీవి సాయన్న గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.
సాయన్న యాదిలో..