– దళితుల పుట్టుకని అవమానించింది ఒకరు.. దళితుల భూములు కొట్టేసింది మరొకరు..
– బాబు హయాంలో దళితులపై ఘోరాలు,నేరాలు జరిగితే మీ కలం ఏమైంది?
– దళితులపై దాడులకు, అఘాయిత్యాలకు పేటెంట్ చంద్రబాబే..
– బాబు హయాంలో దళితులపై దాడుల్లో ఏపీ నంబర్ వన్…
– ముక్కు నేలకు రాసినా బాబును దళితులు క్షమించరు
– రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
దళితుల జీవన శైలిలో ఎంతో మార్పు
రామోజీరావు దినపత్రిక ఈనాడులో ఈరోజు ఎస్సీ ఎస్టీలపై హత్యలు, దాడులు జరుగుతున్నట్లు కథనం రాసుకున్నారు. ఈ కళ్లులేని కబోధి రామోజీరావుకు ఇన్నాళ్లకు ఎస్సీఎస్టీలు గుర్తుకొచ్చారన్న మాట. అసలు, దళితద్రోహి అంటే ముందుగా చెప్పుకునేది చంద్రబాబు గురించే అని పాపం ఆయనకు తెలియదేమో.. లేదంటే, తెలిసి తెలియనట్లు నటించే రకంగా రామోజీరావు గురించి చెప్పుకోవచ్చు.
నిజానికి, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా దళితులపై అమానుషాలు, దాడులు జరిగితే ముందుగా ఖండించేది మేమైతే.. ఆయా ఘటనలపై తక్షణమే సీరియస్ యాక్షన్ చేపట్టేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమని మేం ఘంటాపథంగా చెబుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలంతా వారి జీవనశైలిలో మార్పును చూస్తూ సంతోషంగా బతుకుతున్నారంటే, దళితులకు జగన్ గారు అండగా ఉండబట్టేనని మేం గర్వంగా గుర్తు చేస్తున్నాం.
బాబు, రామోజీలపై అట్రాసిటీ కేసులు పెట్టాలి
రాష్ట్ర రాజకీయాల్లో ఆదినుంచి ఎస్సీ, ఎస్టీ కులాలను అపహాస్యం చేస్తూ, సందర్భానుసారంగా తీవ్రంగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు. ఈ విషయం రాష్ట్రంలో ప్రతీ ఒక్క దళిత సోదరునికీ తెలుసు. వాస్తవానికి, ఈ రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలనుకుంటే.. ముందుగా చంద్రబాబు మీద, రామోజీరావుపైనే ఈ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది.
‘దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా..?’ అని మమ్మల్ని అవమానించినప్పుడే చంద్రబాబు మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి కదా..? అదేవిధంగా దళితుల భూముల్ని రామోజీఫిల్మ్ సిటీ కోసం దౌర్జన్యంగా లాక్కున్న రామోజీరావుపై కూడా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును ఖచ్చితంగా నమోదు చేయవచ్చనే విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను.
బాబు హయాంలో దళితులపై దాడుల్లో నంబర్ వన్…
ఇక, రాష్ట్రంలో దళితులపై దాడులు ఎవరి హయాంలో అధికంగా చోటుచేసుకున్నాయో.. అందరికీ తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులకు సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) సంస్థ ఒక నివేదికను ఇచ్చింది. దేశంలోనే అత్యధికంగా ఎస్సీఎస్టీలపై దాడులు జరిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు పాలనపై ఎన్‌సీఆర్‌బీ నివేదిక ఇస్తే.. ఇది ఈనాడు రామోజీరావుకు కనిపించలేదు.
ఆయన అప్పుడు కళ్లులేని కబోధి పాత్ర పోషిస్తున్నాడేమో.. లేదంటే, నోరులేని మూగవాడిగా నటించాడేమో.. తన ఈనాడు పత్రికలో చంద్రబాబు హయాంలో మా దళితులపై జరిగిన అమానుషమైన ఘటనలపై ఒక్కసారైనా నోరెందుకు తెరవలేకపోయవని రామోజీరావును నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. సమాధానమిస్తాడా..? అని అడుగుతున్నాను. అలాంటి నీచమైన పక్షపాతంగా వ్యవహరించే నీకు ఈరోజు ఎస్సీఎస్టీలు గుర్తుకొచ్చారా..? అని నిలదీస్తున్నాను.
దళితులపై దాడులు, అఘాయిత్యాలకు పేటెంట్ బాబే..
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఇప్పటికీ అంటరానితనం ఉందికదా..? మరి, రామోజీ గానీ, బాబు గానీ ఎందుకు మాట్లాడరు..? ఒకటారెండా..? బాబు హయాంలో దళితులపై జరిగిన దాడులు అన్నీఇన్నీ కావు. అసలు, దళితులపై దాడులు, అఘాయిత్యాలకు పేటెంట్ చంద్రబాబేనని చెప్పాలి. ఈ సంగతిని రామోజీరావు ఈనాడులో పెద్ద అక్షరాలతో రాసుకోవాలి.
– చంద్రబాబు తన 14 ఏళ్ల ముఖ్యమంత్రి హయాంలో దళితులపై జరిగిన దాడులు అన్నీఇన్నీ కావు. ఎస్సీ, ఎస్టీలను చాలా హీనంగా చూసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే, అది చంద్రబాబేనని చెప్పుకోవాలి. అప్పట్లో ఆయన చేయించిన దాడులు, ప్రత్యక్షంగా టీడీపీ నేతలే పాల్పడిన దాడుల గురించి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు ఎలా మరిచిపోతారు..? శ్రీకాకుళం జిల్లాలో కళ్యాణి అనే మహిళపై టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఒక అంబోతు నాయకుడైన ఎర్రన్నాయుడు బూటుకాలితో తన్నినప్పుడు రామోజీరావు ఎందుకు మాట్లాడలేదు..?
– విజయనగరం జిల్లా ఎస్.కోటలో మా వాళ్ల భూముల్ని లాక్కున్నప్పుడు ఈనాడు పత్రికలో కథనాలు ఎందుకు రాయలేదు..? అప్పట్లో కేసులు ఎందుకు పెట్టలేదు..? అప్పట్లో మేం యుద్ధాలు చేయాల్నా..? జెర్రిపోతుల పాలెంలో దళిత యువతిని వివస్త్రను చేసినప్పుడు మేం అప్పుడు పోలీసుస్టేషన్‌పై ధర్నాకు దిగినప్పుడు జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదిచ్చినప్పుడు రామోజీరావు పెన్ను ఏమైపోయింది..?
– తూర్పుగోదావరి జిల్లాలో ఆవు చర్మం కోస్తున్నారని దళితుల్ని చెట్టుకు కట్టేసినప్పుడు ఏ ఒక్కరు మాట్లాడకపోతే.. మా నాయకులు శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి స్వయంగా అమలాపురం వచ్చి నా దళిత సోదరులకు అండగా ఉన్న సంగతిని నీ పత్రికలో ఎందుకు రాయవు రామోజీ.? అని అడుగుతున్నాను. అదేవిధంగా గరగపర్రులో అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నారంటూ 400 మంది దళిత కుటుంబాల్ని వెలివేసినప్పుడు నీ కళ్లు ఎక్కడ పెట్టుకున్నావు రామోజీ..? అప్పటి టీడీపీ ప్రభుత్వం కబోధిలా ఉంటే.. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్‌గారు స్వయంగా అక్కడ వచ్చి మా సోదరులకు వెన్నంటి ఉండి అన్ని కులాల్ని ఐక్యం చేసిన సంగతిని ప్రజలు మరిచిపోతారా..?
– కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో పోలీసుస్టేషన్ వద్ద బహిరంగంగా మా దళిత సోదరులపై దాడులు చేసినప్పుడు ఇప్పుడు అడ్డగోలు కథనాలు రాస్తున్న మీరు అప్పుడేమయ్యారు..? గుంటూరు జిల్లాలో రవికుమార్ అనే దళితసోదరుడు ఆత్మహత్య కేసు, నెల్లూరు జిల్లా రాపూర్‌లో దళిత కుటుంబాలపై దాడులు, కడప జిల్లాలో బహిరంగంగా చంపి చెట్టుకు ఉరితీయించిన ఘటనల్లాంటి ఇంకా ఎన్నో ఘటనలున్నాయి. మరి, ఇన్ని సంఘటనలు జరిగినా అప్పటి ప్రభుత్వాలపై ఎందుకు కథనాలు రాయరు..? ఇదేనా ఈనాడు రామోజీరావుకు దళితులపై ప్రేమ..? అని అడుగుతున్నాను.
ఈనాడు రాతలన్నీ తప్పులతడకలు
ఈరాష్ట్రంలో దళిత కుటుంబాలన్నీ తమను ఆదరించే నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారి రూపంలో వచ్చారని సంతోషిస్తుంటే.. చంద్రబాబుకు, రామోజీరావుకు కన్ను కుట్టిపోతుందా..? దళితులపై ఎక్కడైనా వ్యక్తిగత గొడవలు, చిన్నపాటి ఘర్షణలు జరిగి ఉండొచ్చు. అయితే, ఘటన చిన్నదా పెద్దదా అని చూడకుండా తక్షణమే సీరియస్‌గా స్పందించే ప్రభుత్వ చర్యల్ని ఈనాడు రామోజీరావుతో పాటు పచ్చమీడియా ఎందుకు పరిగణలోకి తీసుకోవడంలేదని అడుగుతున్నాను.
ఈరోజు ఈనాడు పత్రిక కథనంలో రాసిన దళిత దాడుల లెక్కలన్నీ తప్పుల తడకలని స్పష్టంచేస్తున్నాను. ఎక్కడైనా దళితులపై దాడులు జరగ్గానే ఈ ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తుందని.. అనేక ఘటనల్లో బాధితులకు మేం అండగా ఉన్నామని గుర్తుచేస్తున్నాను. పలు కేసుల్లో పోలీసుల్ని సైతం బాధ్యులుగా గుర్తించి అరెస్టులు చేసిన విషయంపై ఇదే ఈనాడు పత్రిక ఎందుకు రాయదని నిలదీస్తున్నాను.
ఎన్నికల వేళ బాబు బుద్ధి బయటపడుతుంది
బాబు హయాంలో ఎస్సీఎస్టీలపై జరిగిన దాడులు, అరాచక ఘటనల్ని రామోజీరావు ఎందుకు దాచిపెడుతున్నాడు..? ఎన్నికల వేళ రాగానే.. మా జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాల్లో భాగాంగా ఈనాడులో లేనిపోని కథనాలు ఎందుకు రాయిస్తున్నారు..? బాబు బతుకుంతా కుట్రలు, కుతంత్రాలతో ఎస్సీఎస్టీలపై దాడులు జరిపి అమానుషంగా తరిమేయాలని చూశాడు. మాల మాదిగల మధ్య గొడవలకు ఉసిగొల్పి మమ్మల్ని విడగొట్టాలని చేసిన బాబు కుట్రలెన్నో ఉన్నాయి.
– రాష్ట్రంలో 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలిస్తున్నప్పుడు అందులో మెజార్టీగా దళితులు ఉంటే, వాళ్లకు ఇళ్లు ఇవ్వకూడదంటూ రకరకాలుగా అడ్డంపడ్డాడు. రాజధాని అమరావతిలో పేద దళితులకు 50వేలకు పైగా ఇళ్లు ఇస్తుంటే.. పెత్తందార్లకు మద్ధతుగా నిలిచిన బాబు సుప్రీంకోర్టు దాకా వెళ్లాడు. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంటూ మోకాలడ్డినా మొత్తానికి సుప్రీంకోర్టు మొట్టికాయలేసిన సంగతిని ప్రజలు గమనించారు కదా..? ఈ విషయాన్ని రామోజీరావు ఎందుకు రాయరు..? ఇంత పచ్చకామెర్ల బాగోతాన్ని పెట్టుకుని దళిత చట్టాలను ఎత్తిచూపుతూ.. ఇప్పుడేదో జరిగిపోతుందని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ఎవరూ నమ్మరుగాక నమ్మరని రామోజీరావు తెలుసుకోవాలి.
ముక్కు నేలకు రాసినా బాబును క్షమించరు
దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా..? అని మమ్మల్ని తీవ్రంగా అవమానించిన రోజునే చంద్రబాబు దురాలోచనను ఎస్సీఎస్టీ బిడ్డలంతా గమనించారు. అప్పట్లో ఏం చేయలేక.. కేసు పెట్టే సాహసం చేయలేని స్థితిలో దళితులున్నారు. కానీ, ఇప్పటి పరిస్థితి పూర్తిగా మారింది. ‘నేను ఆరోజు దళితుల్ని తూలనాడింది నిజమే.. నన్ను క్షమించడయ్యా..’ అంటూ చంద్రబాబు ముక్కును నేలకురాసినా ఏ ఒక్కరూ ఆయన మొర వినరు గాక వినరు. సుదీర్ఘకాలం బాబు అవమానాలు భరించి.. భరించి 2019 ఎన్నికలతో ఆయన్ను దళితులు పూర్తిగా దూరంపెట్టారు. భవిష్యత్తులో బాబు ఊసే దళిత కుటుంబాల్లో వినిపించదని ఖరాకండీగా చెబుతున్నాను.
దళితలంతా జగన్ వెంటే..
రాష్ట్రంలో దళిత కుటుంబాలన్నీ విద్యవైద్యం, ఆదాయపరంగా అభివృద్ధి దిశగా మారుతున్న జీవనశైలితో ఆనందంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వాతావరణం నచ్చని చంద్రబాబు, ఆయన్ను భుజాలపై మోసే పచ్చమీడియా కళ్లు పేలిపోతున్నాయేమో.. ఆకాశంపై ఉమ్మెస్తే మీ మీదనే పడుతుందనేది చంద్రబాబు, రామోజీరావు తెలుసుకోవాలి. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ దళిత కుటుంబాల్లోని వారంతా తన సోదరులు, మేనల్లుళ్లు అంటూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రేమగా చూసుకుంటున్నారు.
– ఆనాటి మహానేత వైఎస్‌ఆర్ వెంట నడిచినట్టే.. ఈరోజుకు కూడా దళితజాతి బిడ్డలంతా జగన్ వెంట నడుస్తున్నారు. అంబేద్కర్, బాబూజగ్జీవన్‌రాం లాంటి మహనీయుల ఆదర్శాలను పుణికిపుచ్చుకున్న నాయకునిగా జగన్‌ని దళితసోదరులంతా గుండెల్లో పెట్టుకుని ఉన్నారని.. ఈ ప్రభుత్వంపై, జగన్‌పై ఎవరెన్ని కుట్రలు పన్నినా.. బురదజల్లాలని ప్రయత్నించినా ఏమీ ఒనగూరదని మరోమారు గుర్తుచేస్తున్నాను. దళితసోదరుల సైన్యంతో ఈసారి 2024 ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీనే కైవసం చేసుకుంటుందని దీమాగా చెబుతున్నాను.