Suryaa.co.in

Andhra Pradesh

రేపటి నుండి రెండో దశ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’

-వైద్య ఆరోగ్య శాఖ సర్వ సన్నద్ధం
-ఆర్నెల్లలో 13,459 ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు
-ప్రతి ఇంటినీ రెండుసార్లు సందర్శించనున్న వాలంటీర్లు

అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని చేరువ చేసేందుకు గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం రెండో దశను జనవరి 2వ తేదీ నుండి నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సర్వ సన్నద్ధమయ్యింది. ఆర్నెల్లపాటు నిర్వహించే రెండోదశ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది.

తొలిదశలో నిర్వహించిన కార్యక్రమంలో 12,423 ఆరోగ్య శిబిరాలల్ని నిర్వహించడం ద్వారా 1,64,982 మంది పేషెంట్లను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు తరలించి వారికి ఉచిత వైద్య సేవల్ని అందించారు. వైద్య ఆరోగ్యసేవల్ని అందించే విషయంలో ఏ ఒక్క గ్రామాన్నీ వదిలి పెట్టరాదన్న లక్ష్యాన్ని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష రెండోదశ కార్యక్రమానికి ఆరు నెలల వ్యవధిని నిర్దేశించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు తొలిదశలో 50 రోజులకు పైగా నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 60 లక్షల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందారు.

తొలిదశ కార్యక్రమంలో సిహెచ్వోలు/ఎఎన్ఎంలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలలో 1,45,35,705 ఇళ్ళను సందర్శించి రోగుల ఇంటి ముంగిటిలోనే 6,45,06,018 వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తొలిదశ కార్యక్రమంలో నిర్వహించిన 12,423 ఆరోగ్య శిబిరాలలో 60,27,843 మంది ప్రజలు ఓపి సేవలు అందుకోగా, 1,64,982 మంది పేషెంట్లను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి ఉచిత వైద్య చికిత్సను అందించారు. పేషెంట్లందరినీ ఆరోగ్య శిబిరాలనుండి సిహెచ్వోలు/ఎఎన్ఎంలు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులలోని ఆరోగ్యమిత్రల ద్వారా నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది.

దీంతో పాటు ఈ ప్రక్రియనంతా యాప్ ద్వారా పరిశీలించి పేషెంట్ల రవాణా, ఇతర ఖర్చుల నిమిత్తం రు.500 వైద్య ఆరోగ్య శాఖ అందజేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష తొలిదశ కార్యక్రమం పూర్తి విజయవంతం కావటంతో రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణ ప్రాంతాలలో విస్తరించి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెండో దశ కార్యక్రమాన్ని ఆర్నెల్లపాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. రెండోదశ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఇళ్లల్లో ఉన్న దీర్ఘకాలిక రోగులు, గర్భవతులు, బాలింతలతో పాటు ప్రసవానంతర శిశు సంరక్షణ సేవలు, అన్ని వయస్సుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవల్ని అందించనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి ముంగిటిలోనే పరిష్కారాన్ని, వైద్య సేవల్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అవసరమైన సందర్భాలలో నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఈ బాధ్యతను పూర్తిగా ఫ్యామిలీ డాక్టర్, సిహెచ్వోలు/ఎఎన్ఎంలకు అప్పగించారు. వారు చికిత్సానంతరం పేషెంట్లకు అవసరమైన కన్సల్టేషన్ సేవలతో పాటు అవసరమైన మందుల్ని కూడా వారి ముంగిట్లోనే అందజఘస్తారు. రెండోదశ కార్యక్రమాన్ని మూడు దశల్లో నిర్వహిస్తామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

మొదటి దశలో వైద్య శిబిరాల వివరాలను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి తెలియజేస్తామని, రెండో దశలో ఆరోగ్యశిబిరాల నిర్వహణ, మూడో దశలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన కేసుల ఫాలోఅప్ సేవల్ని అందచజేస్తారని వివరించింది. ఈ కార్యక్రమం మొదటి దశలో వాలంటీర్లతో పాటు ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటినీ సందర్శించి రెండోదశ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల వివరాల్ని తెలియ చేస్తారని పేర్కొంది.

ఆరోగ్య శిబిరం నిర్వహణా తేదీని ముందు ప్రతి వాలంటీరూ రెండుసార్లు ప్రతి ఇంటికి తిరిగి వివరాలను తెలియజేయాల్సి వుంటుంది. మొదటి సారి వైద్య శిబిర నిర్వహణకు 15 రోజుల ముందు, రెండోసారి శిబిర నిర్వహణ తేదీని గుర్తు చేసేందుకు మూడు రోజుల ముందు వాలంటీర్లు ఇళ్ళను సందర్శిస్తారు.

జగనన్న ఆరోగ్య సురక్ష
వైద్య శిబరాల్ని విలేజ్ హెల్త్ క్లినిక్ లు, పట్టణ వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తారు. మొత్తం మండలాలను సమానంగా విభజించి మంగళవారం తొలి అర్ధభాగంలోనూ, శుక్రవార మిగిలిన ప్రాంతాలలోనూ శిబిరాల్ని నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాలలో వార్డు సచివాలయాలలో ప్రతి బుధవారం ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. ఆర్నెల్ల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణాలలోని గ్రామ, వార్డు సచివాలయాలలో వైద్య సేవలందచేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రతి ఆరోగ్య శిబిరంలో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లతో కలిపి కనీసం ముగ్గురు డాక్టర్లు, ఒక పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఆర్నెల్ల వ్యవధిలో 13,495 ఆరోగ్య శిబిరాల్ని నిర్వహిస్తారు. ఇందులో 10,032 శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లో, 3,922 శిబిరాలు పట్టణ ప్రాంతాలలో నిర్వహిస్తారు. జనవరి నెలలోనే 3,583 శిబిరాలను నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది.

జగనన్న ఆరోగ్య సురక్ష రెండోదశ కార్యక్రమంలో వైద్య సేవలందించేందుకు జనరల్ మెడిసిన్ 543, గైనకాలజిస్ట్ లు645, జనరల్ సర్జన్లు 349, ఆర్థోపెడిషియన్లు 345 మంది, ఇతర స్పెషలిస్టులు 378 మందిని సిద్ధం చేశామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరితో పాటు 2,545 మంది స్పెషలిస్టు డాక్టర్లు, 2743 మంది ఎంబిబిఎస్ డాక్టర్లు కూడా ఈ శిబిరాలలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. అలాగే కంటి పరీక్షల కోసం మొత్తం 562 మంది పారా మెడికల్ ఆప్తాలమిక్ అసిస్టెంట్లను కూడా సిద్ధం చేశామని తెలిపారు.

రెండో దశ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలలో గ్రామీణ ప్రాంతాల కోసం 92 రకాల మందులు, పట్టణ ప్రాంతాల కోసం 152 రకాల మందులను సిద్ధం చేశామని నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. వీటితో పాటు అత్యవసర వినియోగం కోసం మరో 14 రకాల మందుల్ని, వైద్య పరీక్షల నిర్వహణ కోసం 7 రకాల కిట్లను కూడా సిద్ధంగా ఉంచామని వివరించారు. మూడో దశలో చేపట్టే ఫాలో అప్ సేవలలో ఫ్యామిలీ డాక్టర్, సిహెచ్ఓ, ఎఎన్ఎంలు భాగస్వాములవుతారని తెలిపారు. వీరికి అవసరమైన మందుల్ని నేరుగా విలేజ్ క్లినిక్ లకు పంపుతామని అక్కడ ఎఎన్ఎం, సిహెచ్ఓలు రోగులకు వారి ఇళ్ల వద్ద అందజేసి ఎలా వాడాలన్నది చెప్తారని పేర్కొన్నారు

జెఎఎస్ రెండో దశ కార్యక్రమాలు…
జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమ ప్రచారం 02.01.2024తేదీన ప్రారంభం
వైద్య శిబిర నిర్వహణకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు రెండోసారి వాలంటీర్లు ఇళ్లను సందర్శించి వివరాలను తెలియజేస్తారు
గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాలు 02.01.2024వ తేదీన ప్రారంభమవుతాయి
పట్టణ ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాలు 03.01.2024వ తేదీన ప్రారంభమవుతాయి

LEAVE A RESPONSE