– ఎంఐఎం–కాంగ్రెస్–బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయం
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
– జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం లో బీజేపీ మహా పాదయాత్ర
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం కోసం భారతీయ జనతా పార్టీ మహా పాదయాత్రను నిర్వహించింది. ఈ పాదయాత్రను బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రహ్మత్‌నగర్ డివిజన్లోని పార్టీ కార్యాలయం వద్ద నుండి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.
పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ, “జై బిజెపి” నినాదాలతో మారుమ్రోగించారు. అడుగడుగునా ప్రజల ఉత్సాహం రెట్టింపు అయింది. గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ రాంచందర్ రావు గారు పాదయాత్ర కొనసాగించారు. ప్రతి బస్తీలో, కాలనీల్లో బిజెపి రథసారధికి ఆత్మీయ స్వాగతం పలికారు.
జూబ్లీహిల్స్ ప్రజలతో బిజెపి నాయకులు నేరుగా మమేకమవుతూ, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పాలనల్లో జరిగిన అన్యాయాలను, ప్రజలతో చేసిన మోసాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, అసమర్థత వల్ల పలు బస్తీల్లో చోటుచేసుకున్న సమస్యలను, వెనుకబాటును వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఈ కార్యక్రమం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిజెపి విజయం సాధించేందుకు ఉత్సాహాన్ని, నమ్మకాన్ని మరింత పెంచింది.
పాదయాత్ర సందర్భంగా రహ్మత్‌నగర్ నుంచి శ్రీరాంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి అక్రమ పార్కింగ్‌లతో నిండిపోయి ఉందని, ఒకవైపు డ్రైనేజీ దుర్వాసనతో పాటు డస్ట్బిన్లు నిండిపోవడంతో చెత్త రోడ్డు మీద పేరుకుపోయి పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు రాంచందర్ రావు కి తెలిపారు.
పలు బస్తీల్లో డ్రైనేజీలు నిండిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. 420 హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసింది. రెండేళ్ల పాలనలో ఒక్కరికి కూడా మంచి జరగలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూలగొట్టుడు అనేలా భయపెడుతున్నారని ప్రజలు రాంచందర్ రావు కి విన్నవించారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఇస్తామన్నారు, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రియల్ ఎస్టేట్ బందైంది, ఆటో కార్మికుల కారోబార్లు దెబ్బతిన్నాయి, పరిశ్రమలు పారిపోతున్నాయంటూ ప్రజలు తమ సమస్యలను రాంచందర్ రావు కి వివరించారు. ఇదే సమయంలో ఎంఐఎం నాయకుల అండదండలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, కత్తులతో దాడులు చేస్తున్నారని భయాందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. “బిజెపి వస్తే భద్రత లభిస్తుంది. ఎంఐఎం–కాంగ్రెస్–బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇక ముగింపు పలికే సమయం వచ్చింది. అభివృద్ధి, భద్రత, పారదర్శకతను తీసుకొచ్చే బిజెపికి ఓటు వేయండి అని ప్రజలను కోరారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు, బిజెపి నాయకులతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాదయాత్ర నిర్వహించారు. ఎటు చూసినా జనం, దారిపొడవునా అశేష అభిమానం.. చిరునవ్వుతో అడుగులు వేస్తూ, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ, ప్రజల్లో ఆశలు చిగురింపజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాంచందర్ రావు పాదయాత్ర కొనసాగించారు. అభిమానులతో ఫొటోలు దిగుతూ, ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.
రహమత్ నగర్ లో పాదయాత్రలో రాoచందర్ రావు మాట్లాడుతూ
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జూబ్లిహిల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా మహా పాదయాత్ర నిర్వహించామన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు కమలం గుర్తు చూపించినప్పుడు ఓటు వేస్తామంటూ చెబుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
జూబ్లిహిల్స్ ఎన్నికల్లో బిజెపి తప్పకుండా గెలుస్తుందని నేను నమ్ముతున్నానంటూ ఆశాభావం వ్యక్తం చేసారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓటమి భయం వెన్నాడుతోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి భయపడతున్నందునే ఎన్నికల ముందు మైనారిటీని మంత్రిని చేసి గంపగుత్తగా ఓ వర్గం ఓట్ల కోసం ఆరాట పడుతున్నాడని దుయ్యబట్టారు.
చట్టపరంగా కరెక్ట్ అయినా ఓట్ల సమయంలో ఇలా చేయడం నైతికంగా తప్పని స్పష్టం చేశారు. బెదిరించి ఓట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్ చూస్తుండగా.. డబ్బులు వెదజల్లి ఓట్లు రాబట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు.ఈ రెండు పార్టీలు ఒకటే.. రెండు పార్టీలు కలిసి బిజెపిని ఓడించాలని పన్నాగాలు చేస్తున్నారని ఆరోపించారరు. కాంగ్రెస్ పార్టీ జూబ్లిహిల్స్ ప్రజలను అంధకారంలో ఉంచుతోందని బిజెపి పాదయాత్ర సందర్భంగా మీడియాల లైట్లే మాకు వెలుగునివ్వడం గుర్తించాలని జూబ్లిహిల్స్ ప్రజలు మోసాన్ని అర్థం చేసుకునిబిజెపిని గెలిపిస్తారని రాంచందర్ రావు తెలిపారు.
జూబ్లీహిల్స్ ప్రజల విశ్వాసం, ప్రేమ, ఉత్సాహం – ఈ మహా పాదయాత్రను విజయవంతం చేశాయి. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ ఈ ఉపఎన్నికలో విజయం సాధిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు.