Suryaa.co.in

Andhra Pradesh

వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితా

– జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై తర్వలోనే ప్రజాప్రతినిధులతో వర్క్ షాప్
– జూనియర్ కాలేజీ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం
– జీవో నెం.42 ద్వారా ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు జగన్ రెడ్డి కుట్ర
– పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై సమీక్షలో నారా లోకేష్

అమరావతిః ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై తర్వలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న డీఎస్సీ నిర్వహణ సన్నద్ధతపైనా సమావేశంలో కూలంకుషంగా చర్చించారు.

జూనియర్ కాలేజీ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం

జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాలు పెంచాలనే డిమాండ్ పై సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నూతన సిలబస్ ను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జూనియర్ లెక్చరర్ల బదిలీలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈ నెల 20వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు.

జీవో 42 ద్వారా 80 కాలేజీలు మూతపడ్డాయి

జీవో 42 ద్వారా జరిగిన విధ్వంసంపై సమావేశంలో చర్చించారు. జగన్ రెడ్డి అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో 42 ద్వారా 80 ఎయిడెడ్ కాలేజీలు మూతపడ్డాయి. జీవో జారీకి ముందు 137 కాలేజీలు ఉండగా.. అనంతరం 57కి తగ్గాయి. దీనివల్ల విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరిగింది. ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని జీవో 42 ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని, అలాగే ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి ఆదేశించారు.

నైపుణ్య గణనకు నిపుణుల సలహాలు స్వీకరించండి

నైపుణ్య గణన కార్యక్రమంపైనా సమావేశంలో చర్చించారు. నిపుణుల సలహాలతో నైపుణ్య గణన కార్యక్రమాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని మంత్రి ఆదేశించారు. స్కిల్ సెన్సెస్ ను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసంధానించాలని సూచించారు.

యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా స్థాయిలో జిల్లా ఉపాధి కల్పనా అధికారి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, సీడ్ యాప్ పరిధిలో ఉన్న జిల్లా మేనేజర్ విధులను సమగ్రంగా పరిశీలించి ఏకీకృత వ్యవస్థ తీసుకురావాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE