– పైలట్ ప్రాజెక్టుగా అమలుకు యంత్రాంగం సర్వసన్నద్ధం
అమరావతి: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్టుకు మంగళగిరి నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు. స్కిల్ సెన్సస్ కోసం 100 గ్రామ సచివాలయాల పరిధిలో సెన్సెక్స్ సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి 675 మంది ఎన్యుమరేటర్లు స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్ సిద్ధంచేశారు.
ఎన్యుమరేటర్ల శిక్షణ కూడా పూర్తయింది. ఫీల్డ్ టీమ్స్ కు సహాయం చేసేందుకు టెక్నికల్ టీమ్ లను కూడా ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు, కుటుంబాలకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయింది. గ్రామ సచివాలయాలు, స్కిల్ డెవల్ మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్ మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభిస్తారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడం స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.