– క్రికెట్ బాక్స్, యాప్ ఆధారిత లైటింగ్ సిస్టం
– మరో రెండు థీమ్ పార్క్ లు సిద్ధం చేస్తున్నాం
– వైసీపీ హయాంలో చీకట్లు .. కూటమి ప్రభుత్వంలో వెలుగులు
– జనం ఉన్నచోటకే అభివృద్ధిని తీసుకెళ్తున్నాం
– గత పాలకుల మాదిరిగా -ఆర్భాటం చేయడం లేదు
– ఎస్ బి ఐ కాలనీ పార్క్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు
రాజమహేంద్రవరం: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా స్థానిక ఎస్ బి ఐ కాలనీలో స్మార్ట్ ఫీచర్ పార్క్ ఏర్పాటుచేశామని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. క్రికెట్ బాక్స్ తో కూడిన ఈ పార్క్ లో వెలుగులు యాప్ ఆధారితంగా ఏర్పాటుచేశామని తెలిపారు. బుధవారం ఉదయం ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి స్మార్ట్ ఫీచర్ పార్క్ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడారు. స్థానికులు దీని నిర్వహణ చూసుకోడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో ఒక పార్క్ అభివృద్ధి చేసి, దాన్ని చూడ్డానికి అక్కడకు రండి అని జనాలకు చెప్పేవారని, కూటమి అధికారంలోకి వచ్చాక జనం ఉన్నచోటకే అభివృద్ధి తీసుకెళ్తున్నామని చాల గర్వంగా చెబుతున్నా మని ఎమ్మెల్యే వాసు అన్నారు. అన్ని ప్రాంతాల వారికి ఆహ్లాదం కల్గిస్తున్నామన్నారు. చెప్పినట్టే చేయడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. వైసిపి వాళ్ళలా కంబాల చెర్వు పార్క్ ఒకటే అభివృద్ధి చేసి, అలా చేసాం ఇలా చేసాం అని చెప్పకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక ఫేజ్ వన్ లో ఏడు పార్కులు అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే వాసు చెప్పారు.
రాజమండ్రిలో బాక్స్ క్రికెట్ లో నెంబర్ వన్ ఆ పార్కులో ఉందన్నారు. ఇదేదో ప్రయివేటు సైట్స్ లో ప్రయివేటు ఏజన్సీ నడిపేది కాదన్నారు. కార్పొరేషన్ వాళ్ళు అభివృద్ధి చేసిన పార్క్ లో బాక్స్ క్రికెట్ ఉందన్న విషయం అందరూ గమనించాలన్నారు.
అలాగే షటిల్ కోర్టు, చిల్డ్రన్స్ ప్లే , అవుట్ డోర్ జిమ్ , చుట్టూ లైటింగ్, వాకింగ్ ట్రాక్ అండ్ గ్రీనరీ, ఆటోమేటిక్ యాప్ కంట్రోల్ లైటింగ్ వంటివన్నీ ఈ పార్కులో ఉన్నాయని ఎమ్మెల్యే వాసు వివరించారు. గతంలో వైసిపి వాళ్ళు చీకట్లో ఉంచారని, ఇప్పుడు కూటమి వెలుగులు నింపిందని ఆయన ఎద్దేవా చేశారు. యాప్ ద్వారా లైటింగ్ ఆపడం, వెలిగించడం చేసి చూపించారు.
క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్టాట్యూ మాదిరిగా ఒక బొమ్మ తయారుచేసి కూర్చున్నట్లు ఉందని, ఇది కూడా సెల్ఫీ పాయింట్ అవుతుందని ఎమ్మెల్యే వాసు అన్నారు. అన్ని పార్కులు అభివృద్ధి చేస్తామని, అతి దగ్గరలో థీమ్ బేస్డ్ పార్కులు రెండు ప్రారంభించుకో బోతున్నామని ఆయన అన్నారు. నిర్వహణ కూడా స్థానిక ప్రజలు బాధ్యతగా తీసుకుంటే ఇంకా బాగుంటుందని అన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసున్నా సరే, వైసీపీ నేతల్లా లైట్స్ కింద ఫోటో, బటన్ నొక్కినట్లు ఒక ఫోటో పెట్టుకోవడం లేదని అన్నారు.
అభినందనీయం: సోము వీర్రాజు
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత స్కీమ్ లో నగరాల సుందరీకరణ చేయాలన్నది లక్ష్యమన్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే వాసు 30 పార్కులను డిజైన్ చేసి అభివృద్ధి చేసి, అన్ని ప్రాంతాల వారికి ఆహ్లాదకర వాతావరణం అందించాలని భావించడం అభినందనీయమని అన్నారు.
పార్కులు అభివృద్ధి చేయడమే కాకుండా స్థానిక పెద్దల సహకారంతో నిర్వహణ చేపట్టడం ఆనందించదగ్గ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు