Suryaa.co.in

National

250 సార్లు పాము కాటు తిన్న స్నేక్ మ్యాన్ సురేష్‌

– పాము కాటు నుండి కోలుకుని..
– చూపుడు వేలు, కుడి మణికట్టులో కదలికలను కూడా కోల్పోయి..
– పాముల్ని పట్టుకునేందుకే తన జీవితం అంకితం

కొట్టాయం : ప్రముఖ స్నేక్‌ క్యాచర్‌ , వన్య ప్రాణి సంరక్షకుడు వావా సురేష్‌.. ఎట్టకేలకు నాగుపాము కాటు నుంచి కోలుకున్నారు. అతనికి ప్రాణాపాయం లేదని కొట్టయం మెడికల్‌ సూపరింటెండెంట్‌ టికె జయకుమార్‌ తెలిపారు. సురేష్‌ ఒకసారో.. రెండుసార్లో కాదు.. ఏకంగా 250 సార్లు పాముకాటుకు గురయ్యాడు. వామ్మో ఇన్నిసార్లా? అని ఆశ్చర్యపోకండి.

వివరాల్లోకి వెళితే.. సురేష్‌ ఇప్పటివరకు 50,000లకు పైగా పాములను, 190కి పైగా కింగో కోబ్రాలకు రక్షించాడు. అందుకే సురేష్‌ని ముద్దుగా ‘స్నేక్‌ మ్యాన్‌ ఆఫ్‌ కేరళ’గా పిలుస్తారు. ఇటీవల జనవరి 31న కొట్టాయంలో నివాస స్థలంలో 10 అడుగల పామును పట్టుకొని గోనె సంచిలో వేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. పాము కాటు వేసినప్పటికీ దాన్ని సురక్షితంగా గోనె సంచిలో ఉంచే ప్రయత్నం చేశాడని స్థానికులు తెలిపారు.

అయితే పాము కాటు వేసిన కొద్ది నిమిషాల తర్వాత సురేష్‌ అపస్మారక స్థితికి చేరుకోవడంతో… స్థానికులు వెంటనే కొట్టాయం ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య బృందాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందిన సురేష్‌ శ్వాస తీసుకోవడం ప్రారంభించాడని.. అతని ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించిందని వైద్యులు వెల్లడించారు.

కాగా, దాదాపు 250సార్లు పాము కాటుకు గురవ్వడంతో చూపుడు వేలు, కుడి మణికట్టులో కదలికలను కూడా కోల్పోయినట్లు సురేష్‌ తెలిపారు. వేల పాముల్ని సురేష్‌ రక్షించడంతో.. కేరళ అటవీ శాఖ అతనికి ఉద్యోగం కూడా ఇచ్చిందట. అయితే కేవలం పాముల్ని పట్టుకునేందుకే తన జీవితం అంకితం అని చెప్పి ఆ ఉద్యోగాన్ని నిరాకరించాడు.

LEAVE A RESPONSE