సుప్రీమ్ కోర్టా? స్టేట్ బ్యాంకా?

ఎలొక్టరల్ బాండ్స్ పేరిట రాజకీయ పార్టీలకు “పార్టీ ఫండ్” అందచేసే విధానాన్ని సుప్రీం కోర్టు మొన్న ఫిబ్రవరి 15 న కొట్టేసింది. దీనిని 2018 లొ మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తేల్చి చెప్పింది. ఎందుకంటె, ఈ బాండ్స్ ద్వారా పార్టీలకు ఎలక్షన్ ఫండ్ ఇచ్చే వారు ఎవరు, ఎంత ఇస్తున్నారు అనే వివరాలు రహస్యం. ఇచ్చిన వారికి, పుచ్చుకున్న వారికి తప్ప మూడో కంటికి తెలియనివ్వరు.

2018 నుంచి జరుగుతున్న ఈ బాగోతం లో ఎవరెవరు ఏ పార్టీ కి ఎంతెంత సమర్పించుకున్నారో లెక్కలు చెప్పాలని, ఈ యవ్వారాలను చూస్తున్న స్టేట్ బ్యాంకు ను సుప్రీం ఆదేశించింది.
అది కూడా….; ఈ నెల ఆరో తేదీ లోగా ఎన్నికల సంఘానికి వివరాల జాబితా ఇస్తే, దానిని ఎన్నికల సంఘం తన వెబ్సైటు లో పెట్టాలని సుప్రీం ఆదేశించింది.

సహజం గా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం గా తీర్పులు ఇవ్వాల్సిన సందర్భాలలో… సుప్రీం కోర్టు, కర్ర విరగకుండా… పాము చావకుండా…. నీళ్లు నమిలీ నమలకుండా నములుతూ వ్యవహరిస్తుంటుందనే విమర్శలకు దేశం లో కొదువ లేదు.

కానీ, ఈ ఎలక్టరల్ బాండ్స్ రద్దు విషయం లో మాత్రం సుప్రీం కోర్టు ఒక్కసారిగా విరుచుకు పడి పోయింది. ఇది రాజ్యాంగ విరుద్దం అన్నది. పౌరుల హక్కు కు భంగకరం అన్నది. తక్షణమే ఈ వెసులుబాటు ను రద్దు చేసింది.

అక్కడితో, సుప్రీం కోర్టు ఆగివుంటే, ” రద్దు చేస్తే చేసిందిలే…. దక్కినంత వరకు బొక్కేశాము… ఓకే ” అనుకుంటూ అధికార రాజకీయ పక్షం కొంతలో కొంత తృప్తి పడి ఉండేదేమో!

కానీ, ఈ విధానాన్ని రద్దు చేయడం తో సుప్రీం కోర్టు సంతృప్తి చెందలేదు. ఈ చట్టం అమలు లోకి వచ్చిన గత ఆరేళ్ళల్లో ఎవరెవరు ఎంతెంత సొమ్ము బాండ్స్ రూపం లో రాజకీయపార్టీలకు దోచి పెట్టారో మొత్తం జాబితాను మొన్న ఆరో తేదీ లోపు బయట పెట్టమని, ఈ ” రాజ్యాంగ వ్యతిరేక ” బాగోతానికి మంత్రసానితరం నిర్వహించిన స్టేట్ బ్యాంక్ ను సుప్రీం ఆదేశించింది. ఈ బాండ్స్ ను దాతలకు స్టేట్ బ్యాంకే జారీ చేస్తుంది.

దీనితో, బీజేపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఎందుకంటె, మరో రెండు నెలల్లో దేశ సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. 405 స్థానాలు సంపాదించి ఒక రికార్డు నెలకొల్పాలని బీజేపీ ప్రధాన ప్రచారక్ నరేంద్ర మోడీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి పక్షాల వారిని అవినీతి పరులుగా చిత్రిస్తున్నారు.

ఈ ఎన్నికల బాండ్స్ ద్వారా దాదాపు 16 వేల కోట్ల రూపాయలకు పైబడి కార్పొరేట్ కంపెనీలు సమర్పించుకుంటే ; ఇందులో పది వేల కోట్ల రూపాయలకు పైబడి బీజేపీ ఖజానాలోకి వెళ్లాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు, బీజేపీ కి ఎవరెవరు ఎంత సమర్పించుకున్నారో బహిర్గతమైతే, బీజేపీ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉండడం తో, ఎస్ బీ ఐ మొండికేసింది.

ఈ వివరాలు ఇప్పటికిప్పుడు ఇవ్వలేమని, జూన్ 30 వరకు గడువు కావాలని మొన్న మార్చ్ 5 న ఒక పిటిషన్ ను సుప్రీం కోర్టు లో దాఖలు చేసింది. అంటే, వివరాలు వెల్లడించాల్సిన గడువు కు ఒక్క రోజు ముందు అన్న మాట. తీర్పు వచ్చి 26 రోజులు అయింది. దానితో, సుప్రీం కోర్టు కు కాలింది.

మేము ఫిబ్రవరి 15 న ఆదేశాలు ఇస్తే, మార్చి 5 వ తేదీ వరకు – అంటే 26 రోజులు ఏంచేస్తున్నారు అంటూ బ్యాంక్ ను చీవాట్లు పెట్టి, ఈ రోజు ( మార్చ్ 12) సాయంత్రం లోగా మొత్తం వివరాలు ఎన్నికల సంఘం కు ఇవ్వక పోతే, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోడానికి వెనుకాడం అని కళ్లెర్ర చేసింది.

మరి, స్టేట్ బ్యాంక్ ఈ రోజు సాయంత్రానికి ఇవ్వదు…. అని అనుకుందాం. (ఇస్తే బీజేపీ డామేజ్ అవుతుంది ). అప్పుడు సుప్రీం కోర్టు ఏం చేస్తుంది?
స్టేట్ బ్యాంక్ కు నోటీసులు ఇస్తుందా? పాలకవర్గాన్ని కోర్టు కు పిలుస్తుందా? వారికి జరిమానా విధిస్తుందా?, జైలు శిక్ష కూడా విధిస్తుందా? ఈ నోటీసులు, కౌంటర్లు, వాద ప్రతి వాదాలు, తీర్పు వంటి మొత్తం తతంగం ఎప్పటికి ముగుస్తుంది?

ఈ లోపు ఎన్నికల కోడ్ రేపో… మాపో వచ్చి, ఇప్పుడు వివరాలు వెల్లడి కుదరదని స్టేట్ బ్యాంక్ అడ్డం తిరుగుతుందా? ఈ లోపు ఎన్నికలు అయిపోయాక, వివరాలు వస్తే ఏమిటి? రాకపోతే ఏమిటీ అనే పరిస్థితి ఎదురవుతుందా? సుప్రీకోర్టు ఏం చేస్తుంది?
చూడాలి, ఏం జరుగుతుందో!

– భోగాది వేంకట రాయుడు

Leave a Reply