శబరిమల ఆలయ ఆదాయం రూ.204 కోట్లు

-32లక్షలకు చేరువలో భక్తులు
-దర్శనం చేసుకోకుండానే వెనక్కి

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్లో రూ.204 కోట్లు దాటిందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. మండల పూజ కోసం ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటి నుంచి డిసెంబర్ 25 వరకు(39 రోజుల్లో) రూ.204.30 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. కాగా, డిసెంబర్ 27(బుధవారం)తో వార్షిక మండల పూజ సీజన్ ముగియనుంది. మిగిలిన రెండు రోజుల్లో వచ్చే కానుకలను కూడా కలిపితే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు సభ్యులు తెలిపారు.

‘శబరిమల యాత్రకు వచ్చే భక్తులు సమర్పించిన రూ.204.30 కోట్ల ఆదాయంలో రూ.63.89 కోట్లు భక్తులు నగదు రూపంలో హుండీలో సమర్పించారు. రూ.96.32 కోట్లు మహాప్రసాదం ‘అరవణ ప్రసాదం’ విక్రయాల ద్వారా వచ్చినవి. అలాగే భక్తులకు విక్రయించే ఇంకో తీపి ప్రసాదం ‘ అప్పం’ అమ్మకాల ద్వారా మరో రూ.12.38 కోట్లు సమకూరాయి’ అని అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు.

మరోవైపు, వార్షిక తీర్థయాత్ర (మండల పూజ) సీజన్‌ను పురస్కరించుకొని డిసెంబర్ 25 వరకు 31,43,163 మంది భక్తులు శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు రద్దీని ప్రస్తావిస్తూ వివరించారు బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్. ‘ అన్నదాన మండలం’ కార్యక్రమం ద్వారా డిసెంబర్ 25 వరకు 7,25,049 మందికి ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేసినట్లు చెప్పారు. మండల పూజ సీజన్ చివరిరోజైన బుధవారం(డిసెంబర్ 27న) రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసేస్తామని టీడీబీ తెలిపింది. మకరవిళక్కు ఉత్సవం సందర్భంగా తిరిగి డిసెంబర్ 30న తిరిగి ఆలయాన్ని తెరుస్తామని బోర్డు చెప్పింది. ఇక జనవరి 15న మకరజ్యోతి దర్శనం ఉంటుందని ప్రశాంత్ అన్నారు.

శబరిమలలో ఈసారి జరుగుతున్న మండల పూజలకు భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో రద్దీని అరికట్టడంలో భద్రతా దళాలు విఫలమయ్యాయి. ఆలయానికి వెళ్లే రహదారులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ఫలితంగా ఇతర రాష్ట్రాల నుంచి శబరిమలకు వచ్చిన అయ్యప్ప భక్తులు సన్నిధానానికి చేరుకోకుండానే పందళం వలియకోయికల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరిగారు

Leave a Reply