– రూ.7000 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్: అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్ మరియు 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది.
ఈ ప్రాజెక్టుపై రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దాదాపు 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. స్థానికంగా మరింత మందికి ఉపాధి లభిస్తుంది.దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల సమక్షంలో అక్షత్ గ్రీన్‌టెక్ తో (మైత్రా గ్రూప్) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీ తరఫున డైరెక్టర్ గిరీష్ గెల్లి ఈ సమావేశానికి ప్రాతినిధ్యం వహించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా పునరుత్పాదక ఇంధన వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యం దిశగా ఈ ఒప్పందం మరో మైలు రాయిగా నిలుస్తుంది.