Suryaa.co.in

Andhra Pradesh

లిక్కర్ స్కామ్ లో కొన్ని రాష్ట్రాల నేతలు

-త్వరలోనే వెలుగులోకి పెద్ద తలకాయలు
-ఎంపీ రఘురామకృష్ణం రాజు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కొన్ని రాష్ట్రాల నేతల ప్రమేయం ఉందనే అనుమానాన్ని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. త్వరలోనే పెద్ద తలకాయల పేర్లు వెలుగులోకి రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు. మనం ఊహించిన దాని కంటే ముందే వారి పేర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలను ఎదుర్కొంటున్న నిందితుడు శరత్ చంద్రారెడ్డి ని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలవడం పై రఘురామకృష్ణం రాజు స్పందిస్తూ శరత్ చంద్రారెడ్డి చెవి లో ఏమి చెప్పవద్దని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పి ఉంటాడని అన్నారు. మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీ చూసి చూడనట్టు ఉంటున్నారన్నా అపోహ పడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన గొప్ప నాయకుడని, ఆలస్యం జరుగుతుందే తప్ప… ఎవర్ని ఉపేక్షించరని హెచ్చరించారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన మద్యం డిస్టలరీ కంపెనీ పరోక్ష యజమాని, రాష్ట్రంలో ఎస్ ఈ జడ్, పోర్టు నిర్మాణ భాగస్వామి అయిన శరత్ చంద్రారెడ్డిని మద్యం కుంభకోణంలో అదుపులోకి తీసుకున్నారని, మిగతా వారి వంతు త్వరలోనే వస్తుందన్నారు. రాష్ట్రంలో జాకీ వంటి సంస్థ వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పిన ఆ కంపెనీని పారిపోయే విధంగా చేశారన్నారు. కానీ శరత్ చంద్రారెడ్డి వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారంటే నాకింత, నీకింత అనే విధానం తోనే తున్నారనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ నిజాలు అన్నీ త్వరలోనే బయటికి వస్తాయని రఘురామ కృష్ణం రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

హవ్వ…ఇతరులపై అసత్య ఆరోపణలా?
ఇతర పార్టీల వారిని మనమే బూతులు తిడుతూ… రాష్ట్రంలో దారుణమైన రౌడీయిజం మనమే చేస్తూ, ఇతర పార్టీలపై అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. నాలుగు మంచి మాటలు చెప్పినందుకు సొంత పార్టీ ఎంపీ నని కూడా చూడకుండా పోలీసు కస్టడీలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారన్నారు. మనల్ని పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తుంటే చిత్రీకరించిన వీడియోను తిలకించి పైశాచిక ఆనందాన్ని పొందారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని తెలుగు బూతు పార్టీ అని జగన్మోహన్ రెడ్డి అభివర్ణించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జనసేనను రౌడీ సేన అని ముఖ్యమంత్రి పేర్కొనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒకవేళ టిడిపి నేతలు, కార్యకర్తలు ఎవరైనా పొరపాటున మనసులో కూడా బూతు అనుకుంటే సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో జనసేన రౌడీయిజం చేసిన దాఖలాలే లేవని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ఓర్పుతో కొనియాడారు. తాను చిటిక వేస్తే ఎంతవరకైనా వెళ్లే కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా ఆయన సమయమునముతో వ్యవహరిస్తున్నారని కితాబునిచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో బూతులు మాట్లాడుతున్నది ఎవరో… రౌడీయిజం చేస్తున్నది ఎవరో రఘురామకృష్ణంరాజు వీడియో దృశ్య రూపకంగా మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. అసెంబ్లీలో మంత్రి జోగి రమేష్, మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, మహిళా మంత్రి రోజా తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు బూతులు మాట్లాడిన వీడియో క్లిప్పింగులను చూపించారు. ఇక టిడిపి కార్యాలయం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడి, పల్నాడు లో టిడిపి నాయకుల కారు అద్దాల ను ద్వంసం చేసి హత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటనలకు సంబంధించిన వీడియోను మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులపై, పార్టీ కార్యాలయం పై దాడి చేసింది తమ పార్టీ నాయకులేనని గుర్తు చేశారు. జన సైనికులు ఎవరిపైన అయినా దాడి చేశారా అంటూ ప్రశ్నించారు. జనసేనని ఎవరిపైనైనా దాడి చేయమని అన్నారా? అంటూ నిలదీశారు. తనకు అవమానం జరిగితే మాత్రం చెప్పు చూపించారన్నారు. రాష్ట్రంలో బూతులు మాట్లాడుతున్నది ఎవరో?, ఇతర పార్టీల నాయకులపై, కార్యాలయాల పై దాడులు చేసి విధ్వంసాన్ని సృష్టించింది ఎవరో విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. బూతులు మాట్లాడడం, రౌడీయిజం చేయడం ప్రజలిచ్చిన మాండేట్ తో తమ పేటెంట్ హక్కు అన్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు వ్యవహరిస్తున్నారన్నారు.

రాజకీయాలలో నైతిక విలువలు పాటించాలి
రాజకీయాలలో ఉన్నవారు కనీస నైతిక విలువలు పాటించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యక్షుడిగా, ప్యానల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఉన్నత విద్యావంతుడైన విజయసాయి రెడ్డి నోటి విరోచనాలతో దుర్గంధం వెదజల్లే ట్విట్ల తో తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయసాయిరెడ్డి ట్విట్లు చేస్తే నీకేంటని కొంతమంది లఫంగి గాళ్లు అనవచ్చునని, కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు కనీస విలువలు పాటించాలన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పై, పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తిపై నోటికొచ్చినట్లు మాట్లాడడం తగునా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యులు అంటే లోక్ సభ సభ్యుల కంటే రవ్వంత ఎక్కువగానే గౌరవం ఉంటుందని అన్నారు. రాజ్యసభ సభ్యులందరి పరువు తీసేలా విజయసాయిరెడ్డి వ్యవహార శైలి ఉన్నదని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఉపరాష్ట్రపతి ని కలిసి వివరించినట్లు తెలిపారు. తనకు ఉపరాష్ట్రపతి 25 నిమిషాల పాటు సమయాన్ని కేటాయించి, తాను చెప్పిందంతా సావధానంగా విన్నారన్నారు. ఉపరాష్ట్రపతి చర్యలు తీసుకోకపోయినా, బహిరంగ సభలో బూతులు మాట్లాడుతున్నారని బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి అయినా A2 వై చర్యలు తీసుకుంటే పార్టీకి మంచిదని సూచించారు.

13 కోట్ల పనులు మినహా… అంతా మోసమే
నరసాపురం నియోజకవర్గ పరిధిలో 3300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయడం ప్రజలను మభ్యపెట్టడానికి రఘురామకృష్ణం రాజు విమర్శించారు. 13 కోట్ల రూపాయలతో ఆసుపత్రి, రెండు నుంచి మూడు కోట్ల రూపాయలతో బస్టాండ్ తాత్కాలిక పునరుద్ధరణ పనులు మినహా మిగిలినదంతా మోసమేనని వ్యాఖ్యానించారు. భీమవరం పక్కనే ఉన్న కోపల్లె వంతెన నిర్మాణానికి గతంలోనే పది నుంచి 12 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందన్నారు. వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించగా, కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదని తెలిపారు. దీంతో అత్యంత కీలకమైన ఈ వంతెన నిర్మాణానికి స్థానిక ప్రజా ప్రతినిధులు రాజకీయాలకతీతంగా డబ్బులు పోగేసుకుని నాలుగు కోట్ల రూపాయలను కాంట్రాక్టర్ కు అడ్వాన్స్ గా చెల్లించారని తెలిపారు. కాంట్రాక్టు నిర్మాణ పనుల బిల్లులు వచ్చిన తర్వాత తమ డబ్బులు తమకు చెల్లించాలని, ముందైతే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారన్నారు.

రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే… నరసాపురంలో 3300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు . టిడిపి ప్రభుత్వ హయాంలోనే 1200 కోట్ల రూపాయల అంచనా తో కూడిన వాటర్ స్కీం మంజూరు అయిందని తెలిపారు. అలాగే నరసాపురంలో 60 కోట్ల నిర్మాణంతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారని, ప్రస్తుతం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. పాలకొల్లులో ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. దగ్గలూరు వద్ద 40 ఎకరాలలో భూసేకరణ చేసినప్పటికీ, ఇప్పటివరకు సగం మంది భూ నిర్వాసితులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని తెలిపారు.

ఆ స్థలంలో పిచ్చి మొక్కలు పెరగగా, నర్సాపురం సభలోని పాలకొల్లులో ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని ముఖ్యమంత్రి వచ్చి అబద్ధాలు చెప్పడం చూస్తే… మా గోదావరి జిల్లా యాసలో ” వీడు మామూలోడు కాదు రా బాబాయ్ ” అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాన్ని ప్రజలు నమ్మకపోయినా నమ్మినట్టుగానే నటించారని తెలిపారు. నరసాపురం సభలో పోలీసుల దౌర్జన్యాలు దాష్టికాలు కనిపించాయన్నారు. ఆక్వా రైతులను , డ్వాక్రా మహిళలను కూడా బలవంతంగా సభకు తరలించారన్నారు. సభకు హాజరైన డ్వాక్రా మహిళలు సభా ప్రాంగణం నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా, వెళ్లడానికి వీలు లేదంటూ పోలీసులు దౌర్జన్యానికి దిగడం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రజలని రాష్ట్ర ప్రభుత్వ పాలకులు కట్టేసిన పశువుల్లాగా చూస్తున్నారని మండిపడ్డారు. ఇక మరొక అమాననీయ ఘటన నర్సాపురం సభా ప్రాంగణంలో చోటు చేసుకుందని వెల్లడించారు. పంజాబీ డ్రెస్సులు వేసుకుని యువతులు, స్త్రీలు చున్నీలను వేసుకోవడం సర్వసాధారణమని తెలిపారు. నల్ల రంగు చున్నీలను వేసుకున్న వారిని, చున్నీలను తీసి సభా ప్రాంగణానికి వెళ్లాలని పోలీసులు ఆదేశించడం విస్మయాన్ని కలిగించిందన్నారు. నల్ల రంగు చున్నీ లు వేసుకున్న వారు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే, గాలిలోకి తిప్పుతూ నిరసనను తెలుపుతారన్న అనుమానంతోనే చున్నీలను తొలగించి వెళ్లాలని పోలీసులు ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాజరైన సభలకు పెయిడ్ ఆర్టిస్టులను పంపి మనం నిరసన తెలియజేయవచ్చు కానీ, మన సభలలో ఎవరు నిరసనలు తెలియజేయవద్దని కోరుకోవడం సమంజసమేనా అని ప్రశ్నించారు. మనం తప్పు చేశాం కాబట్టే నిరసన తెలియజేస్తారన్న భయం వెంటాడుతోందన్నారు. ప్రజలు నిరసన తెలియజేస్తారని భయం ఉన్నప్పుడు, ప్రజల్లోకి వెళ్లడం ఎందుకన్నారు. మహిళలను, యువతులను అగౌరవపరిచే విధంగా పోలీసులు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు.

గాన గంధర్వుడు
బాల మురళీకృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయనకు రఘురామకృష్ణం రాజుగారు నివాళులు అర్పించారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా బాల మురళి కృష్ణ గారు కొనసాగారని పేర్కొన్న ఆయన, ఒక చిత్రంలో అశ్లీల గీతాన్ని ఆలపించిన గాయని మంగ్లీ ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్ వి బి సి డైరెక్టర్ గా నియమించడం పట్ల ఒకవైపు మంగ్లీని అభినందిస్తూనే, మరొకవైపు తన అభ్యంతరాన్ని తెలియజేశారు.

LEAVE A RESPONSE