కొడుకా?.. కూతురా?.. విజయమ్మ ఎటువైపు?

– షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం
– ఏపీలో అన్న జగన్‌కు వ్యతిరేకంగా యుద్ధభేరి
– కాంగ్రెస్‌కు ఆంధ్రా ఆశాకిరణం ఇక ఆమెనే
– ఇప్పటికే వైసీపీలో ‘అ’లుకలుకలు
– చాలాకాలం నుంచీ కూతరు షర్మిల దగ్గరే విజయమ్మ
– తాజాగా ఇడుపులపాయలో కొడుకు జగన్‌కు అమ్మ ఆశీర్వాదం
– మరి షర్మిల కాంగ్రెస్‌లో చేరితే విజయమ్మ ఎటు వైపు?
– కొడుకు జగన్‌ వైపా? కూతురు షర్మిల వైపా?
– కూతురు ఉన్న భర్త పార్టీ వైపా? కొడుకు పార్టీ వైపా?
– విజయమ్మ నిర్ణయంపై ఉత్కంఠ
( మార్తి సుబ్రహ్మణ్యం)

తల్లా? పెళ్లామా?.. ఇది కొత్తగా పెళ్లయిన ప్రతి సగటు పురుషుడికి ఎదురయ్యే సమస్య. ఆ పితలాటంలో పడి ఆ మానవుడు చాలాకాలం నలిగిపోతుంటాడు. చివరాఖరకు బోధిచెట్టు కింద కూర్చుని, ఒక నిర్ణయానికి వచ్చి.. అటో-ఇటో , ఎవరో ఒకరి వైపు ఉండాలని డిసైడయిపోతాడు. ఇది శతాబ్దాల నుంచి చూస్తున్న కుటుంబ కథా చిత్రమే.

ఇప్పుడు వైసీపీ రాజమాతకు దీనికి పూర్తి భిన్నమైన సంకటం ఎదురుకానుంది. ప్రస్తుత సంక్లిష్ట రాజకీయ పరిస్థితిలో, రాజమాత ఎవరి వైపు ఉంటుంది? చెట్టంత ఎదిగి, లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకుని, రాష్ర్టానికి ఏలికగా ఉన్న కొడుకు వైపా? కొడుకు జైల్లో ఉంటే అన్న బాధ్యతను మోసి, తన పాదయాత్రతో పార్టీకి మనోస్థైర్యం కల్పించి కుటుంబానికి దన్నుగా నిలిచిన కూతురు వైపా? పైగా కూతురంటే అందరికీ వల్లమాలిన అభిమానం, ప్రేమ. వాళ్లిద్దరిలో ఎవరి వైపు నిలవాలి? ఎవరికి మనోధైర్యం ఇవ్వాలి? ఇదీ వైసీపీ రాజమాత విజయమ్మ సంకటం!

దివంగత మహానేత వైఎస్‌ గారాలపట్టి షర్మిల, చివరివరకూ తన తండ్రి ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలన్నదే తన లక్ష్యమని, వైఎస్‌ ఎన్నోసార్లు మనసులోమాట వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీలో మహామహులను ఢీకొన్నప్పటికీ, ఇందిరా కుటుంబానికి విధేయుడిగానే ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపి, ముఖ్యమంత్రి పదవులన్నీ కాంగ్రెస్‌ పెట్టిన భిక్షనే అని ఆయన, పలు సందర్భాల్లో సవినయంగా స్పష్టం చేశారు. ఆవిధంగా ఆయన హెలికాప్టర్‌ దుర్ఘటనలో కనుమూసేవరకూ, కాంగ్రెస్‌ వీర విధేయుడిగానే కొనసాగారు.

ఆ తర్వాత సీఎం పదవి కావాలని కోరిన తనయుడు జగన్‌ కోరికను కాంగ్రెస్‌ మన్నించలేదు. కేంద్రమంత్రి పదవి ఇస్తామని చెప్పినా వినని జగన్‌.. వైఎస్సార్‌సీపీ పార్టీ పెట్టారు. నిజానికి అది శివశంకర్‌ అనే నాయకుడు రిజిస్టర్‌ చేసుకున్న రాజకీయ పార్టీ. దానిని జగన్‌ టేకోవర్‌ చేసుకున్నారు. శివశంకర్‌కు టీటీడీ మెంబర్‌ పదవి ఇచ్చారు. పదవీకాలం ముగిసిన తర్వాత ఆ శివశంకర్‌ ఎక్కడున్నారో తెలియదు. గోరక్షణ పేరుతో యుగతులసి కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు. అది వేరే విషయం.

కాంగ్రెస్‌తో విబేధించిన సమయంలో జగన్‌కు, యావత్‌ కుటుంబం మొత్తం దన్నుగా నిలబడింది. జగన్‌ విజయప్రస్థానంలో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలదే కీలకపాత్ర. జగన్‌ జైల్లో ఉన్న సమయంలో ఆయన నిలిపివేసిన పాదయాత్రను, షర్మిల కొనసాగించారు. ఆవిధంగా అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మహిళగా రికార్డును సొంతం చేసుకుంది. ‘నేను షర్మిలను. జగనన్న విడిచిన బాణాన్ని’ అని దిక్కులు పెక్కటిల్లేలా మాట్లాడిన షర్మిల, తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు.

ఎన్నికల సమయంలో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ప్రచారం సానుభూతి ఓట్లుగా మారి వైసీపీకి తిరుగులేని విజయాన్ని తెచ్చాయన్నది నిష్ఠుర నిజం. అసలు జగన్‌ జైలులో ఉన్న సమయంలో తల్లి-చెల్లి రంగంలోకి దిగకపోతే, పార్టీ ఉనికి ఉండేదికాదన్నది వైసీపేయుల అభిప్రాయం.

అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దికాలం జగన్‌తో సజావుగా సాగిన షర్మిల-విజయమ్మ సంబంధాలు, తర్వాత బెడిసికొట్టాయి. విజయమ్మ తాడేపల్లికి వెళ్లడం మానేశారు. వైఎస్‌ వర్ధంతి-జయంతి కార్యక్రమాల్లో కలసి కనిపించే ఆ ముగ్గురూ, తర్వాతి కాలంలో ఎవరికివారయ్యారు. అన్న-చెల్లి వేర్వేరుగా తండ్రికి నివాళులర్పించేవారు. అమ్మ విజయమ్మ మాత్రం కొడుకు దగ్గరకు తీసుకుని, ముద్దాడి ఆశీర్విందించే ఫొటోలు కనిపించేవి.

అయితే అంతర్గతంగా కుటుంబంలో ఏం జరిగిందన్నది తెలియకపోయినా… తల్లి-చెల్లినే వెళ్లగొట్టిన జగన్‌, ఇక రాష్ట్రంలోని మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారంటూ టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపించారు. ఫలితంగా వైఎస్‌ కుటుంబంలో ఏదో జరుగుతోంది. అన్న-చెల్లికి పడటం లేదు. అందుకే చెల్లితో తల్లి హైదరాబాద్‌లో ఉంటోందన్న ప్రచారానికి, టీడీపీ నేతల విమర్శలు అవకాశం కల్పించాయి. ఆ తర్వాత తన అన్న జగన్‌కు మిత్రుడైన కేసీఆర్‌కు వ్యతిరేకంగా, చెల్లి షర్మిల వైఎస్సార్‌టీపీ స్థాపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

నిజానికి గత ఏడాదికాలంలో కేసీఆర్‌ను, కాంగ్రెస్‌-బీజేపీ నేతలు కూడా తిట్టనన్ని తిట్లు షర్మిల తిట్టారు. ఫలితంగా ఆమె చంచల్‌గూడ జైలుపాలయ్యారు. దానితో ఆమె అహం దెబ్బతిని, కేసీఆర్‌ ఓటమి లక్ష్యంగా.. తాను వద్దనుకున్న కాంగ్రెస్‌ను గెలిపించాలన్న కసి పెంచుకున్నారు. తర్వాత ఎన్నికల ముందే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధపడ్డారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి, తన తండ్రికి అత్యంత సన్నిహితుడైన డికె శివకుమార్‌, కెవిపితో చర్చలు కూడా జరిపారు.

అయితే తనకు పాలేరుతోపాటు, తన అనుచరులకు కొన్ని అెసెంబ్లీ సీట్లు ఇవ్వాలని షరతు విధించారు. దానిని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అడ్డుకున్నారు. షర్మిలను ఆంధ్రాకు పరిమితం చేస్తేనే పార్టీకి ఉపయోగమని స్పష్టం చేశారు. దానితో విలీన ప్రతిపాదన విరమించుకుని, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం వరకే షర్మిల పరిమితమయ్యారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి అంటే షర్మిలకు కోపం!

ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ షర్మిల సేవలను ఆంధ్రాలో వినియోగించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఆమె చేరిక ఇక లాంఛనమే. రాహుల్‌గాంధీ సైతం.. షర్మిల ఏపీ కాంగ్రెస్‌కు పనిచేస్తుందని తాజా సమావేశంలో స్పష్టం చేశారట. షర్మిల బాణాన్ని జగనన్నపై సంధించాలన్నది కాంగ్రెస్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. దానితోపాటు కాంగ్రెస్‌ నుంచి వైసీపీ స్వాధీనం చేసుకున్న, ఎస్సీ-ఎస్టీ ఓటు బ్యాంకును తిరిగి షర్మిల ద్వారా రాబట్టుకోవాలన్నది కాంగ్రెస్‌ అసలు వ్యూహం.

ఇక ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, విశాఖ ఉక్కు ఉద్యమాల ద్వారా ఆంధ్రాలో మళ్లీ కాంగ్రెస్‌ను బతికించాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌కు, షర్మిల ఆశాదీపంలా మారారు. వైసీపీలో టికెట్లు రాని సిట్టింగులందరినీ షర్మిల ద్వారా కాంగ్రెస్‌లో చేర్పిస్తే, ఓటు బ్యాంకు గణనీయంగా పెరగడంతో పాటు కనీసం కొన్ని సీట్లయినా వస్తాయన్నది కాంగ్రెస్‌ ప్రణాళికగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీతో కాంగ్రెస్‌ యుద్ధం అనివార్యంగా మారనుంది.

సూటిగా చెప్పాలంటే.. జగన్‌పై షర్మిల చేసే ప్రత్యక్ష రాజకీయ యుద్ధం అన్నమాట! ఆ క్రమంలో తల్లి విజయమ్మ, ఎవరి వైపు ఉంటుందన్న ప్రశ్న.. వైసీపీ శ్రేణులు, వైఎస్‌ అభిమానుల్లో సహజంగానే ఉత్కంఠకు తెరలేపింది. షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించిన తర్వాత.. కుటుంబవిబేధాలతో కొడుకు జగన్‌ను విడిచి, కూతురు షర్మిల వద్ద ఉంటున్న విజయమ్మ, తన కూతురుకు అండగా నిలిచారు.

పోలీసులు తమను అరెస్టు చేసే సమయంలో, వారిని విజయమ్మ ధైర్యంగా ఎదుర్కొన్నారు. తమను హౌస్‌ అరెస్టు ఎలా చేస్తాదరని వాదించారు. కూతురును కేసీఆర్‌ సర్కారు అరెస్టు చేసి జైల్లో పెట్టిన సందర్భంలో, కేసీఆర్‌ సర్కారుపై విజయమ్మ నిప్పులు కురిపించారు. షర్మిలతోపాటు కొన్ని సభల్లో కూడా విజయమ్మ పాల్గొన్నారు. తెలంగాణలో షర్మిల పాదయాత్రకు ఆర్ధికసాయం చేయాలని ఆమె నెల్లూరు జిల్లాకకు చెందిన ఓ వైసీపీ ప్రజాప్రతినిధిని కోరారు.

అందుకు అంగీకరించిన సదరు ప్రజాప్రతినిధి విషయం జగన్‌కు తెలియడం… ఆయనను పిలిచి మందలించి, ఎలాంటి ఆర్ధికసాయం చేయవద్దని హెచ్చరించడం.. దానితో సదరు ప్రజాప్రతినిధి తన నిస్సహాయతను విజయమ్మకు చెప్పడం జరిగిపోయాయి. ఇవన్నీ అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వచ్చినవే. అయితే ఇదంతా తెలంగాణకు సంబంధించిన వ్యవహారాలు కాబట్టి, అప్పటిదాకా ఎవరికీ ఎవరితో ఇబ్బందులు రాలేదు. అంటే జగన్‌కు వారితో ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదు.

ఇప్పుడు కూతురు షర్మిల నేరుగా, కొడుకు జగన్‌తో ప్రత్యక్ష రాజకీయ యుద్ధానికి దిగబోతున్న నేపథ్యంలో… తల్లి విజయమ్మ ఎవరి పక్షాన నిలుస్తారన్న ఉత్కంఠ సహజం. ఆమె ఇప్పటిదాకా కొడుకుకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆస్తి పంపకాల విషయంలోనే విబేధాలు వచ్చాయన్న వార్తలు గుప్పుమన్నప్పుడు కూడా ఆమె పెదవి విప్పలేదు. సందర్భం వచ్చినప్పుడు కొడుకును కలుస్తూనే ఉన్నారు. చివరకు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపైనా స్పందించలేదు. ఎటొచ్చీ కూతురు షర్మిల ఒక్కరే, అన్న జగన్‌తో జగడమాడుతున్నారు. బాబాయ్‌ వివేకానంద హత్య కేసులో సోదరి సునీతకు షర్మిల దన్నుగా నిలిచారు.

అయితే ప్రాణం ఉన్నంతవరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగిన భర్త వైఎస్‌ ఉన్న కాంగ్రెస్‌లో, కూతురు షర్మిల చేరబోతున్నారు. కాబట్టి విజయమ్మ సహజంగా.. భర్త పార్టీలో చేరే కూతురు షర్మిల వైపే ఉంటారన్నది, వైసీపీలో కొందరి వాదన. కానీ కొడుకును సీఎంగా చూడాలన్న తన కోరిక కొనసాగాలంటే, జగన్‌ వైపే విజయమ్మ ఉంటారని మరికొందరి వాదన. మరి ‘అమ్మ’ ఎటువైపో చూడాలి!

Leave a Reply