Home » ఎంఎల్ఏ,ఎంఎల్సి నివాస సముదాయ భవనాలను పరిశీలించిన స్పీకర్

ఎంఎల్ఏ,ఎంఎల్సి నివాస సముదాయ భవనాలను పరిశీలించిన స్పీకర్

• గత ప్రభుత్వ నిర్వాకం వల్ల భవనాలు పూర్తి చేయాలంటే అదనంగా రూ.300 కోట్లు
• 9 మాసాల్లో నిర్మాణాలను పూర్తి చేయాలని సీఆర్డీఏ అధికారులకు స్పీకర్ ఆదేశం

అమరావతి,5 జూలై:అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస సముదాయ భవనాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఆర్డిఏ,అసెంబ్లీ అధికారులతో కలిసి పరిశీలించారు.

అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శాసన సభ,శాసన మండలి సభ్యులందరికీ కలిపి 288 నివాసాలు కల్పించేందుకు రాయపూడి వద్ద 12 అంతస్తులతో కూడిన 12 టవర్ల నిర్మాణాన్ని గత టిడిపి ప్రభుత్వం హయాంలో చేపట్టగా 2019 నాటికి 77 శాతం పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిలిపి వేసి నిర్లక్ష్యం చేయడంతో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోవడం జరిగిందని అన్నారు.

గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల ఆయా పనులన్నిటినీ తిరిగి ప్రారంభించి పూర్తి చేసేందుకు అంచనా వ్యయం భారీగా పెరగడంతో పాటు గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస సముదాయ భవనాలను పూర్తి చేసేందుకే అదనంగా 300 కోట్ల రూ.లు ఖర్చు కానుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు.

గత ఐదేళ్ళుగా పనులు నిలిపి వేయడంతో చాలా వరకూ నిర్మాణ సామాగ్రి తుప్పు పట్టడం,కొంత మెటీరియల్ అపహరణకు గురికావడం వంటి సంఘటనలు జరిగాయని శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు మీడియాకు వివరించారు. అమరావతి రాజధానిలో ఎంఎల్ఏ, ఎంఎల్సిలకు,ఇతర ఉన్నతాధికారులు, సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలు హైదరాబాదులో కూడా లేవని అన్నారు.

ఈభవన సముదాయానికి సంబంధించిన ఫినిషింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి 9 మాసాల్లోగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సిఆర్డిఏ అధికారులను కోరడం జరిగిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. అంతకు ముందు ఎంఎల్ఏ,ఎంఎల్సి నివాస సముదాయంలో వివిధ గదులను శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు పరిశీలించారు.

ఈకార్యక్రమంలో సీఆర్డీఏ కమీషనర్ కాటమనేని భాస్కర్,అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పిపికె రామాచార్యులు, ఎంఎల్ఏలు విష్ణు కుమార్ రాజు, టి.శ్రావణ్ కుమార్, సిఆర్డిఏ, అసెంబ్లీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply