– అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు
– వారి మాట విన్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు
– వాళ్లు వెళ్లిపోతారు.. మేం లోకల్
– జనంలోకి తిరగలేకపోతున్నాం
-కుమారి ఆంటీకి మాదిరిగానే ఖైరతాబాద్ పేదలకూ ఆదేశాలివ్వండి
– ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఫుట్‌పాత్ తొలగింపుపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులకు దమ్ముంటే ముందు పాతబస్తీ నుంచి ఆ పనిచేయాలని ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సవాల్ చేశారు.
పాతబస్తీలో ఆక్రమణలు వదిలేసి, ఖైరతాబాద్‌లో తొలగించడంపై ఆయన శివాలెత్తారు. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా అధికారులు ఆయనను పట్టించుకోలేదు. సీఎం దావోస్ నుంచి వచ్చే వరకూ ఆగాలన్నా అధికారులు వినలేదు. ఈలోగా మజ్లిస్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినా అదే పరిస్థితి. అయితే షాపులను తొలగించుకునేందుకు కొంత సమయం ఇచ్చిన అధికారులు, సమయం ముగిసిన వెంటనే రోడ్డు క్లియరెన్స్ చేశారు.
అధికారులు ఒకచోట పనిచేస్తూ బదిలీలతో మరోచోటకి వెళ్తారు. కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారన్నారు. తాను పుట్టింది, పెరిగింది, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది హైదరాబాదే అని అన్నారు. ఫుట్‌పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు.కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాద్ కాబట్టి తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికే పరిమితం కాదని, హైదరాబాద్‌లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం ముందుంటాడని స్పష్టం చేశారు. గతంలో తాను హైడ్రా విషయంలో మాట్లాడినా, ఇప్పుడు ఫుట్‌పాత్‌ల విషయంలో మాట్లాడుతున్న అంటే అది ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దనేదే తన అభిప్రాయమని స్పష్టం చేశారు
మాదాపూర్‌లో ఫుట్‌పాత్‌లపై కుమారి ఆంటీని వేధిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, ఆమె జోలికి పోవొద్దని అధికారులకు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారో.. ఇప్పుడు ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేతల్లో కూడా ముఖ్యమంత్రి అదే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారన్నారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య తాము తిరగలేకపోతున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. పేదల ఇండ్లను అధికారులు తొలగించడం సరైంది కాదన్నారు. ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మొదలు పెడితే అక్కడి నుంచే తొలగింపులు చేయాలన్నారు. అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు.
జీహెచ్‌ఎంసీ అధికారులపై దానం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆపరేషన్ రోప్‌లో భాగంగా చింతల్‌బస్తీలో అక్రమ నిర్మాణాలను గుర్తించిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు, వాటిని కూల్చివేసే పనిలో పడ్డారు. ట్రాఫిక్ పోలీసులతో కలిసి అక్రమాలను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు.
జీహెచ్‌ఎంసీ అధికారుల వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే అక్కడకు చేరుకుని.. ఎక్కడి నుంచో ఇక్కడకు బతకడానికి వచ్చి.. ఇక్కడున్న తమను బతకనియ్యరా అంటూ మండిపడ్డారు.