– టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఎంవోయూ
దావోస్: హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధి చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ముందుకొచ్చింది. రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అమెరికాకు చెందిన ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఉన్నతాధికారులు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రెసిడెంట్ సచిత్ అహుజాతో ఈ ఒప్పందం చేసుకున్నారు. అధునాతన డిజిటల్ మౌలిక సదుపాయాల పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ప్రాముఖ్యాన్ని ఈ ఒప్పందం చాటి చెప్పింది. ఆర్టిఫిషియల్ ఆధారిత అప్లికేషన్‌లు, క్లౌడ్ సేవలు, డేటా ప్రాసెసింగ్కు ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది.
టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ తో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం హైదరాబాద్ స్థాయిని మరింత పెంచుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ అధ్యక్షుడు సచిత్ అహుజా మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు, దార్శనిక నాయకత్వం తమను ఆకట్టుకుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం పట్ల సంతోషం వ్యక్తపరిచారు.