– ఎన్నికల బడ్జెట్ పై తలోదారి
కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఎవరెవరు వ్యతిరేకిస్తారు?
టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి…పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ…ఇంకా… కాంగ్రెస్, తెలుగుదేశం… సమాజ్ వాది… రాష్ట్రీయ జనతాదళ్… జనతా… జనతాదళ్… ఇత్యాది పార్టీలన్నీ బడ్జెట్ బాగులేదని పెదవి విరిచేవే.
దీని మర్మం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడో…లేక ఒకట్రెండు పార్టీలు విడిగానో…మొత్తానికి బిజెపికి వ్యతిరేకంగా పోటీ చేయనున్నాయని…ఇప్పటి పరిస్థితుల మేరకు ఇది నిక్కం. అయితే ఇన్ని పార్టీల “కప్పల తక్కెడని” ఒక చోట చేర్చి, కుదురుగా ఉంచే కీలకమైన బాధ్యత ఎవరు చేపడతారు?
వాస్తవానికి బిజెపి 2014లో తన సొంత బలంపై అధికారంలోకి వచ్చిందేమో గాని, 2019 ఎన్నికల్లో మాత్రం, విపక్షాల బలహీనతలే ప్రధాన బలంగా గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటికీ ఇప్పటికీ బిజెపి ప్రతిష్ట ఇంకాస్త మసకబారినా, అంతకుమించి ప్రతిపక్షాలు నీరసం అయిపోయాయన్నది అంతే నిజం.
ఇకపోతే ఇప్పటివరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను, ఒక త్రాటిపైకి తెచ్చే ప్రయత్నాలు కూడా సరైన నాయకుడెవరూ చేస్తున్న దాఖలాలు లేవు. వ్యక్తిగతంగా చూసుకుంటే ఈ మధ్యనే పశ్చిమ బెంగాల్
ఎన్నికల్లో, ఒంటి చేత్తో కమలం పార్టీకి ఝలక్ ఇచ్చిన మమతా బెనర్జీ ఒక్కరే తన వైఖరిని ఇంతవరకు స్పష్టం చేసినట్టు కనిపిస్తోంది.
అప్పుడప్పుడు కేసీఆర్ కూడా బయటపడుతున్నా గాని, ఆయన వైఖరిలో స్థిరత్వం…ధృఢత్వం కనిపించడం లేదు. మొన్న బడ్జెట్ విషయంలో మాత్రం, టిఆర్ఎస్ అధినేత గొంతులో కొంత బిజెపి
వ్యతిరేక ధోరణి స్పష్టంగా వినిపించింది.రేపు రానున్న ఎన్నికల్లో ఇటు టీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఖచ్చితంగా బిజెపికి వ్యతిరేకంగానే ముందుకు వెళ్ళబోతున్నాయనేది ఇప్పటివరకు నమ్మబుల్.అయితే ఇక్కడే ఉంది అసలు చిక్కు. “కేసీఆర్”- “మమత జి” ఇద్దరూ ప్రధాని పదవిపై కన్నేసిన వారే.
ఈ ఇద్దరూ మాత్రమే గాక , అవకాశం వస్తే లాలూ…శరద్ పవార్…నవీన్ పట్నాయక్…ఎవరికి వారే పెద్ద పదవి రేసులో ముందుండడానికి ఉబలాటపడిపోయే వారే. కానీ…పిల్లి మెడలో గంట కట్టే శక్తి ఎవరికి ఉందో, ఆ అంచనా వారిలో వారికే లేదన్నది వాస్తవం.
ఇదిలా ఉంటే ఇన్ని పార్టీలు కూటమిగా ఏర్పడడం అంత సులువైన విషయం కాదు.ఒకరంటే ఒకరికి నప్పదు. ఒకరుంటే ఒకరు ఉండకపోవచ్చు. ఉదాహరణకు ఇప్పటికీ దేశం మొత్తంమీద, అతి పెద్ద పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్ కూటమిలో ఉంటే చాలా పార్టీలకు నప్పకపోవచ్చు.
అప్పుడు కాంగ్రెస్ ఒంటిగా లేదా, ఒకటో రెండో పార్టీలను కలుపుకుని పోటీ చేసి….. మిగిలిన పార్టీలన్నీ ఐక్యంగా, మొత్తాని కి బిజెపికి ఎదురెళ్లి పోటీ చేసినా… “అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు” చీలి అది మళ్లీ కమలం పార్టీకే అనుకూలం అవుతుంది.
అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి మిగిలిన పార్టీలు ముందుకు వెళ్ళినా మొదటగా అది కొన్ని పార్టీలకు నచ్చకపోవచ్చు. ఆపై ఖచ్చితంగా కాంగ్రెస్ కే నాయకత్వం ఇవ్వాల్సి ఉంటుంది.ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులు, అంతటి డిమాండ్ విపక్షాల ముందు పెట్టే సీన్ లేదు.కనుక “”కప్పల తక్కెడని”” నిర్వహించడం చాలా క్లిష్టమైన వ్యవహారమే.
ఆడ్ మాన్ అవుట్…
ఇదిలా ఉంటే ఇంత ఆటలో అరటిపండులా కనిపిస్తున్నది ఎవరో తెలుసా…
ఇంకెవరు? సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన రెడ్డి గారే.
ఆయన ఓ పట్టాన ఏదీ తేల్చరు. ముంచరు. అసలు తన మనసులో ఏముందో బయటపెట్టరు. అంతెందుకు…మొన్న బడ్జెట్ విషయలో కూడా ఆయన నోరు మెదపనే లేదు. బాగుందో…బాగులేదో……ఏదీ చెప్పలేదు.గోడ మీద పిల్లి వాటం.
అఫ్కోర్స్…ఆయన ఇరకాటాలు, ఆలోచనలు ఆయనకు ఉన్నాయనుకున్నా, ఒకరాష్ట్రానికి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా వివక్షకు గురవుతున్న ఒక రాష్ట్రానికి, ముఖ్యమంత్రిగా… బలమైన ఓ పార్టీకి
అధినేతగా… లోక్ సభలో గణనీయమైన సంఖ్యాబలం కలిగిన పార్టీ అధిపతిగా… ఆయన వైఖరి ఏమిటో దేశానికి… కనీసం ఆయన నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ప్రజలకైనా, తెలియాల్సిన అవసరం ఉంది.
అలా కాకుండా కేవలం తన వ్యక్తిగత ఇరకాటాలనే దృష్టిలో పెట్టుకొని, జగన్ వ్యవహరిస్తున్నారన్నది కొందరి ఆలోచన. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారు అంత త్వరగా బయట పడతారన్నది అత్యాశ.ఇప్పుడు జగన్ ఉన్న పరిస్థితిలో, ఆయన బిజెపి వైపు మొగ్గు చూపడానికే ఉత్సాహపడే అవకాశం ఉంది.
అయితే బిజెపి ఎలా స్పందిస్తుందో… ఇప్పటికే పవన్ జనసేనతో కలిసి ముందుకు వెళ్తున్న బిజెపి, వేరే ఆలోచన చేసే అవకాశాలు ఉండకపోవచ్చు.అంత అవసరం వస్తే పవన్ తో
పాటుగా, చంద్రబాబును కూడా కలుపుకుని వెళ్లే ఆలోచన చెయ్యవచ్చేమో. అలా కలిసేందుకు కమలనాధులు, సీబీన్, పవన్ మొగ్గు చూపవచ్చు… చూపకపోవచ్చు…
స్టాలిన్ సంగతేంటో…!?
నిన్న గాక మొన్న తమిళనాడులో విజయఢంకా మోగించి,వర్తమాన పరిస్థితుల్లో దేశంలోని ముఖ్యమంత్రుల అందర్లో ముందు వరసలోకి దూసుకు వెళ్తున్న స్టాలిన్ స్టాండ్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఇప్పుడే
అంచనా కట్టలేని విషయం.ఆయన ఎటువైపు వెళ్తే అటు కొంత మేర, త్రాసు మొగ్గు చూపుతుందన్నది నిర్వివాదం!
– నాగేష్ & రవీంద్ర