– స్వచ్ఛందంగా కేసును స్వీకరించిన కమిషన్
– నివేదిక సమర్పించాల్సిందిగా సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశం
కర్నూలు నవంబర్ 10 : అందరూ ఉన్నా అనాధగా.. వృద్ధురాలిని రోడ్డున పడేసిన కుమారులు అంటూ సాక్షి దినపత్రిక జిల్లా ఎడిషన్ లో బుధవారం ప్రచురితమైన వార్త పై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్పందించింది. వివరాల్లోకి వెళితే..ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని దేవరాయపురం కాలనీకి చెందిన వృద్ధురాలు పిచ్చి కత్తుల ఓలమ్మ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు . ఆమె భర్త తిరుపాలు 25 ఏళ్ల క్రితం మృతి చెందారు. ఆమెకు వయస్సు పైబడినా తనపని చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉండేది అయితే ఇటీవల పక్షవాతానికి గురి కావడంతో అప్పటి నుంచి కొడుకులు, కోడళ్ళు, కుమార్తెలు పట్టించుకోవడం లేదు .
ఈ క్రమంలో వృద్ధురాలు గ్రామ నాయకుల వద్దకు వెళ్లి తనకున్న మూడెకరాల పొలం తిరిగి ఇప్పిస్తే తనను చూసుకునే వారికి రాసిస్తానని మొరపెట్టుకుంది. పెద్దమనుషులు చెప్పినా కొడుకులు ససేమిరా అనడంతో ఆమె పట్టణ పోలీసులను ఆశ్రయించింది. అక్కడ వారు కూడా మేము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. రోడ్డున పడిన వృద్ధురాలికి ఎవరైనా దయతలిచి ముద్ద అన్నం పెడితే ఆకలి తీర్చుకుని కాలం వెళ్లదీస్తోందని బుధవారం నాటి సాక్షి దినపత్రికలో అందరూ ఉన్నా అనాధగా అంటూ వార్త ప్రచురితం అయింది.
ఈ వార్తను చూసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మెన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి , జుడిషియల్ సభ్యులు డి సుబ్రహ్మణ్యం , నాన్ జుడీషియల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత వెంటనే స్పందించి స్వచ్ఛందంగా కేసును స్వీకరించి, తల్లిదండ్రుల సంరక్షణ చట్టం ప్రకారం పరిశీలన చేసి తగు నివేదిక సమర్పించాల్సిందిగా సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ సెక్షన్ ఆఫీసర్ బొగ్గరం తారక నరసింహ కుమార్ తెలిపారు.