మహిళల్ని అడ్డుపెట్టుకుని నీచరాజకీయాలు తగవు: ‘మహిళా కమిషన్’ హితవు

– వైఎస్ భారతిపై సోషల్ మీడియా కథనాల తొలగింపునకు చర్యలు: వాసిరెడ్డి పద్మ
– ‘వాసిరెడ్డి పద్మ’కు మహిళా సంఘాల వినతుల వెల్లువ

అమరావతి: మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేయటం తగదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రధాన ప్రతిపక్ష టీడీపీకి హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతిపై సోషల్ మీడియాలో ఉద్దేశ పూర్వకంగా వాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె బుధవారం డీజీపీని కలిసి లేఖను అందజేయడం తెలిసిందే.

గురువారం ఈ విషయం తెలిసి రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అభినందించేందుకు మహిళా కమిషన్ కు తరలివచ్చారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన మహిళా సంఘాలు వాసిరెడ్డి పద్మను దుశ్శాలువాతో సత్కరించి బొకే అందించారు. మిగతా ప్రాంతాలనుంచి పలువురు మహిళలు ఇదే వ్యవహారం పై వినతిపత్రాలు సమర్పించారు. ఎవరికి వారు విడివిడిగా సంతకాలతో వినతిపత్రాలు వాసిరెడ్డి పద్మకి అందించగా, వాటిని ఆమె డీజీపీ కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ..

ముఖ్యమంత్రి సతీమణి భారతి గత ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలు వక్రీకరించి ఒక వర్గం సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన ఆధారాలు డీజీపీకి సమర్పించామన్నారు. భారతిపై నిరాధారమైన ఆరోపణలు చేసి ముఖ్యమంత్రిని మానసికంగా కుంగతీయాలనే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారని ఆమె ఆరోపించారు. మహిళలను లక్ష్యంగా పెట్టుకుని మెట్టమెదటిసారిగా నాడు జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలోని మహిళలపై రాజకీయ దాడి చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆమె గుర్తు చేశారు. ముఖ్యమంత్రితో తేల్చుకోవాల్సిన విషయాలను ఆయనతో తేల్చుకోలేక ఆయన భార్యపై బురద చల్లాలనుకోవటం నీచమైన సంస్కృతి అని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవారికి కఠినమైన సంకేతాలు పంపుతామని, వైఎస్ భారతిపై సోషల్ మీడియా కథనాల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Leave a Reply