– సత్యవేడు సిహెచ్సిలో చికిత్స పొందుతున్న 36 మంది విద్యార్థులు
– ఇప్పటికే 20 మంది విద్యార్థులకు చికిత్స అందించి ఇళ్లకు పంపించిన అధికారులు
– ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్
– గంటకోసారి నివేదిక ఇవ్వాలని స్పెషల్ సియస్ కృష్ణ బాబుకు మంత్రి ఆదేశం
అమరావతి: తిరుపతి జిల్లా సత్యవేడులోని గురుకుల పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురవ్వడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్… తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ , సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి , డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనందమూర్తితో ఫోన్ లో మాట్లాడి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను సత్యవేడు సిహెచ్సి 50 పడకల ఆసుపత్రిలో అధికారులు చేర్చారు. వీరిలో 14 మంది జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం 36 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. 20 మంది విద్యార్థులకు ఇప్పటికే చికిత్స అందించి వారివారి ఇళ్లకు అధికారులు. పంపించారు.
ఆసుపత్రిలో చేరిన విద్యార్థులందరికీ ఎమ్పీ, ఎన్ఎస్1, సీబీసీ, సీఆర్పీ, సీరం బిలిరుబిన్, వైడల్ పరీక్షలు నిర్వహించామని, అయితే ఫలితాలు సాధారణంగా ఉన్నట్లు నివేదికలో తేలిందని వైద్యులు వివరించారు. వీరందర్నీ పరిశీలనలో ఉంచినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీహరి తెలిపారు. డ్యూటీ వైద్యులు, శిశు వైద్య నిపుణుడు, అలాగే జనరల్ మెడిసిన్ విభాగ సిబ్బంది అంతా 24 గంటలూ పర్యవేక్షించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పిల్లలందరికీ ఆహారం, నీటి సౌకర్యం కల్పించారు. వైద్య సిబ్బంది, హాస్టల్ ఇంఛార్జి, ఇంకా స్థానిక రాజకీయ నాయకులు ఈ అత్యవసర పరిస్థితుల్లో తమ సహకారాన్ని అందిస్తున్నారు. రిమోట్ ఏరియా కావడంతో అత్యవసర పరిస్థితుల్లో సేవల కోసం 108 వాహనాన్ని అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓకు కలెక్టర్ ఆదేశించారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు లైన్ లిస్ట్‌ను, రోగులను రెఫరల్ చెయ్యాల్సిన ఆసుపత్రుల వివరాలను ఫాలోఅప్ చేస్తామని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తామని అధికారులు మంత్రి కి తెలిపారు.
అధికారులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య స్థితి గురించి తెలుసుకున్న మంత్రి సత్యకుమార్ యాదవ్… పరిస్థితిని పర్యవేక్షించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబును ఆదేశించారు. గంటకోసారి నివేదిక ఇవ్వాలని కోరారు.