October 3, 2026

సుఖాల ముఖారి – బాలమురళీకృష్ణ గానంగా

ముఖారి… కర్ణాటక సంగీత రాగాలలో ఒక రాగం ముఖారి
ముఖారి రాగం శోక రాగం అన్న చింతనను త్యాగయ్య గారే పూర్వపక్షం చేసేశారు

మన తెలుగు ‘గాన-జ్ఞానం’ శ్రీమాన్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆ ముఖారిని సుఖాల ముఖారిగా తన గాత్రంతో, గాన మేధతో మనకు అందించారు. బాలమురళి తెలుగు జాతి సంగీత సౌభాగ్యం.

కర్ణాటక సంగీతం పునాది తమిళ్ష్ సంగ సాహిత్యంలో ఉంది. కర్ణాటక సంగీతం పరిణామం కన్నడం వల్ల. కర్ణాటక సంగీతం ప్రాభవం తెలుగు హృదయం, మేధ. త్యాగయ్య, శ్యామశాస్త్రి అన్న తెలుగు మహానుభావులు కర్ణాటక సంగీతం జవ సత్వాలు. అదృష్టవశాత్తు ఈ ఇద్దరు మహనీయులు తమిళ్ష్ మట్టిపై పుట్టి, పరిణమించారు. వారు తెలుగు మట్టిపై పుట్టి జీవించి ఉంటే మట్టికొట్టుకుపొయేవారేమో?

బాలమురళీకృష్ణ కూడా తమిళ్ష్ మట్టి మీదే ఒక కర్ణాటక సంగీత వెల్లువ అయ్యారు. తెలుగు మట్టి మీదే ఉండుంటే ఆయన కూడా మట్టికొట్టుకుపొయేవారా?

గానం, గాత్రం, సంగీతజ్ఞత వీటి నాణ్యత, మేలిమి అన్నవి సినిమా, లలిత, శాస్త్రీయ వంటి విభాగాలకు అతీతం. ఆ తెలివిడి ఆనుగుణ్యంగా సాంకేతికంగా బాలమురళీకృష్ణ ఎంతో గొప్పవారు. తెలుగు జాతి చేసుకున్న పుణ్యం బాలమురళి .

మన తెలుగులో కొంత మంది ఇంకా, ఈ 2026 కూడా గానం, గాత్రం అంటే ఘంటసాలే అన్న పిచ్చితనంలో, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ తెలుగుతనం వల్లే తెలుగు సంగీతం (సినిమా, లలిత సంగీతం వంటివి వాటితో సహా) దెబ్బతింది. కచ్చితంగా, చదువు పరంగా, సాంకేతికంగా ఘంటసాల గానం, గాత్రం పరంగా బాలమురళీ అంత గాయకుడు కాదు. అసలు గాత్రం, గానం పరంగా అంశాల వారీగా ఘంటసాల గొప్ప కానేకాదు.

బాలమురళీకృష్ణ ఒక రాగాన్ని పాడేడప్పుడు ఆయనకు ఆ రాగం దర్శనమిస్తుంది. బాలమురళి ఒక రాగాన్ని దర్శిస్తూ పాడతారు! అందుకే ఆయన రాగ గానంలో ‘మనోధర్మ సంగీతం’ విశేషంగానూ, విశిష్టంగానూ ఉంటుంది. (ఇక్కడ మనోధర్మం అంటే సినిమా, లలిత గానాల్లోని mood కాదు) నిజమైన పురుషగాత్రంతో బాలమురళీకృష్ణ ముఖారిని సంగీత సుఖాల ముఖారిగా పాడిపెట్టారు. సంగీత ప్రసాదంగా దాన్ని అస్వాదిద్దాం.

  • రోచిష్మాన్
    9444012279
Total Visitors: 2,855,284