Suryaa.co.in

Telangana

బీ ఆర్ ఎస్ కు మద్దతు తెలపండి, సంక్షేమం, అభివృద్దికి బాటలు వేయండి

– డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు
– తార్నాక లో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు

తార్నాక : సికింద్రాబాద్ ను అభివృద్ధి పధంలో నడుపుతున్నామని, ప్రభుత్వం నుంచి పుష్కలంగా నిధులు సాధించి వివిధ కీలక ప్రాజెక్టులను కుడా చేపట్టామని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పాదయాత్రలో భాగంగా మంగళవారం తార్నాక డివిజను పరిధిలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తో కలిసి వివిధ కాలనీలు, బస్తీ ల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచార పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ సందర్బంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు ఉపకరించే సంక్షేమ పధకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆసరా పెన్షన్ల మొత్తాన్ని దశల వారీగా పెంచేలా, మేనిఫెస్టో లో చేసిన ప్రకటనతో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. అదే విధంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో లో పొందుపరచిన వివిధ అంశాలకు ప్రజల నుంచి సానుకూలత లభిస్తోందని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపదుతున్నామని పద్మారావు గౌడ్ అన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా సితాఫలమండీ లో సికింద్రాబాద్ ప్రజలకు ఉపకరించే జూనియర్, డిగ్రీ కాలేజీ లను నెలకొల్పామని, తుకారాం గేట్ ఆర్ యు బీ నిర్మించామని, సితాఫలమండీ, అడ్డగుట్ట, లాలాపేట లలో ఆసుపత్రుల నిర్మాణ చేపట్టామని తెలిపారు. తార్నాక ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులను తాము చేపట్టామని, తార్నాక లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, లాలాపేట లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం, లాలాపేట రోడ్డు విస్తరణ వంటి పనులు చేపట్టామని తెలిపారు. అభివృద్దిని చూసి ఒటేయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ, రాసురి సునీత లతో పాటు బీరాస సీనియర్ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. తార్నాక, చింతల్, కీమ్తీ కాలనీ, నాగార్జున నగర్, ఓల్డ్ డైరీ, హనుమాన్ నగర్, తదితర ప్రాంతాల్లో పద్మారావు పాదయాత్ర సాగింది. డైరి ఫార్మ్ కార్మిక సంఘం నేతలు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో సమావేశమై ఆయనకు మద్దతు తెలిపారు.

LEAVE A RESPONSE