భారత్‌-చైనా మధ్య అనుమానాలే అడ్డంకి: బిపిన్‌ రావత్‌

గువాహటి: భారత్‌-చైనా మధ్య అనేక అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని త్రిదళాధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలన్నింటినీ ఒకేలా చూడాలన్నారు. లద్దాఖ్‌, ఈశాన్య ప్రాంతంలోని సమస్యల్ని వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు.
‘‘2020లో ఇరుదేశాల మధ్య సమస్యలు నెలకొన్నాయి. అవన్నీ చర్చల ద్వారా సద్దుమణుగుతున్నాయి. సైనిక, దౌత్య, ప్రభుత్వాల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత వివాదాలన్నింటినీ పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. అవన్నీ పరిష్కారం అవుతాయని భారత్‌ విశ్వసిస్తోంది. గతంలోనూ సరిహద్దు సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ పరిష్కరించుకున్నాం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో సుమ్‌దొరోంగ్‌ చూ అనే ప్రాంతంలోనూ ఇదే తరహాలో గొడవలు జరిగాయి. వాటి పరిష్కారానికి చాలా సమయం పట్టింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు వేగంగా అడుగులు పడుతున్నాయి’’ అని రావత్‌ అన్నారు.
గత ఏడాది తూర్పు లద్దాఖ్‌లో దురాక్రమణలకు పాల్పడ్డ చైనా.. గల్వాన్‌ ఘర్షణలో తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరు పక్షాల మధ్య వివిధ స్థాయిల్లో పలు దఫాలు జరిగిన చర్చల ఫలితంగా కొన్ని నెలల పాటు ఇరు దేశాల సైన్యాలు కీలక వివాదాస్పద ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గాయి. కానీ, చైనా మాత్రం వక్రబుద్ధిని చాటుతూ సరిహద్దు వెంట వివిధ ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన చర్చలు విఫలమయ్యాయి. భారత్‌ సూచించిన పలు నిర్మాణాత్మక పరిష్కారాలకు చైనా విముఖత వ్యక్తం చేసినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.
కశ్మీర్‌కు అఫ్గాన్ల వలసలు పెరిగే అవకాశం..
అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు వలసలు పెరిగే అవకాశం ఉందని బిపిన్‌ రావత్‌ అన్నారు. దీనికి భారత్‌ సిద్ధంగా ఉండాల్సిన అసవరం ఉందన్నారు. సరిహద్దుల్ని మూసివేయాల్సి రావొచ్చన్నారు. ముమ్మర తనిఖీలు అవసరమన్నారు. బయటి నుంచి ఎవరు వస్తున్నారో నిఘా ఉంచాలన్నారు. సామాన్యులు, పర్యాటకులు భారీ తనిఖీలకు గురికావొచ్చన్నారు. దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. దేశ భద్రత ప్రతిఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. అలాగే దేశంలో అంతర్గతంగానూ శాంతిభద్రతలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply