Suryaa.co.in

Andhra Pradesh

బాబు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం

– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభంపై రాష్ట్ర్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు.

ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా రాజధాని నిర్మాణంపై ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ… సీఎం చంద్రబాబునాయుడు అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి చర్యలు తీసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో ఆనందం నెలకొందన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల ముందు అమరావతి రాజధానిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, శనివారం రాజధాని పనులకు శ్రీకారం చేట్టారన్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలు ఉండడంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు.

రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో, రాజధాని నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టడడంపై మంత్రి హర్షం వ్యక్తంచేస్తూ…ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. మరో వైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,800 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. త్వరలోనే పోలవరం పనులు కూడా ప్రారంభం కానున్నాయన్నారు.

అమరావతి రాజధాని, పోలవరం పనులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్…దేశంలోనే అగ్రస్థానంలో ఉండడం ఖాయమన్నారు. గడిచిన అయిదేళ్ల జగన్ పాలన ఏపీ వాసులకు పీడకలగా మారిందన్నారు. కేవలం బటన్ నొక్కడం తప్ప మరే ఇతర అభివృద్ధి పనులు చేపట్టకుండా, రాష్ట్రాన్ని అథోగతి పాల్జేశారని మండిపడ్డారు. అసమర్థ జగన్ పాలన ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కిమళ్లిందన్నారు.

సీఎం చంద్రబాబునాయుడు మరోసారి అధికారం చేపట్టడం వల్ల ఏపీకి పూర్వవైభవం వచ్చిందన్నారు, అభివృద్ధిని, సంక్షేమానికి జోడు గుర్రాళ్ల మాదిరిగా సీఎం చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారని మంత్రి సవిత ఆ ప్రకటనలో కొనియాడారు.

LEAVE A RESPONSE