దశ,దిశా లేని బడ్జెట్:తలసాని శ్రీనివాస్ యాదవ్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దశ, దిశా లేని బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు నిరాశ ను మిగిల్చిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం లో అన్ని అసత్యాలు, అంకెల గారడీ తప్ప ఏ వర్గానికి మేలు చేసేలా కేటాయింపు లు చేయలేదని పేర్కొన్నారు. నూతన బడ్జెట్ లో కేటాయింపు లు పెంచక పోగా గతంలో ఉన్న వాటిలో కోతలు విధించడం దుర్మార్గం అన్నారు. GDP విషయంలోకూడా తప్పుడు లెక్కలు చూపుతూ దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

జాతీయస్థాయిలో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో, ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. మాటల గారడీతో గడచిన గత 8 సంవత్సరాల నుండి దేశ ప్రజలను మోసగిస్తూ వస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, కార్మికులు, బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి బడ్జెట్ లో మొండిచేయి చూపిందని విమర్శించారు. ఆయా రంగాల అభివృద్దికి విఘాతం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు ఉన్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఇచ్చిన హామీలతో సహా దాదాపు 35 అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనలు చేసింది.

కానీ ఏదీ కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించలేదని పేర్కొన్నారు. దేశం మొత్తం కరోనా మహమ్మారి తో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు నిధుల కేటాయింపును ప్రస్తావించకపోవడం ప్రజల ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో రుజువు చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని తెలిపారు.

ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనే విధంగా అన్ని హాస్పిటల్స్ లలో అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. దేశానికి పట్టుకోమ్ములు గా చెప్పుకొనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కులవ్రుత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆ దిశగా ఎలాంటి నిధులు కేటాయించపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. దేశ జనాభాలో అత్యధిక మంది వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమ రంగం, జీవాల పెంపకం, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు.

అలాంటి పశుసంవర్ధక శాఖ కు కూడా నిధుల కేటాయింపు లో వివక్ష కనబర్చారని ఆరోపించారు. ఉపాధి కోసం హైదరాబాద్ మహానగరానికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారు లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు వెళ్ళడానికి అనేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వందల కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ సమయంలోను రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును నిలిపివేయలేదన్న విషయాన్ని గుర్తుచేశారు.

దేశంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి లో ఎంతో ముందున్నదని, అలాంటి నగర అభివృద్దికి కేంద్రం బడ్జెట్ లో నిధులను కేటాయించక పోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 40 కోట్ల మంది SC, ST లకు బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం 12,800 కేటాయిస్తే, ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం SC, ST ల సంక్షేమం, అభివృద్ధి కోసం 33,611 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని వివరించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఎరువుల పై సబ్సిడీ ని 35 వేల కోట్ల రూపాయలు తగ్గించి పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

నల్లచట్టాలు తీసుకొచ్చి 750 మంది రైతుల చావుకు కేంద్ర ప్రభుత్వం కారణమైందని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, రైతుల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు రావడాన్ని హేళనగా మాట్లాడి రాష్ట్ర రైతులను అవమానించినది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాలలో అనేకమంది కి ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకం కు నిధులు పెంచాల్సింది పోయి ప్రస్తుత బడ్జెట్ లో 25 వేల కోట్ల రూపాయలను తగ్గించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

దేశంలో 15 లక్షల వరకు ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఈ బడ్జెట్ లో నిరుద్యోగ సమస్య ఊసే లేకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న తెలంగాణ BJP నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Leave a Reply