శ్రీ కాళహస్తి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డులకు మోక్షం లేదా పరమేశ్వరా?

శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఇటీవల అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలను శ్రీకాళహస్తి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ లుగా ప్రకటించారు ఆ తర్వాత పక్కన పెట్టారు ఆ “లోగుట్టు” పరమేశ్వరునికే ఎరుక?

రాష్ట్ర ప్రభుత్వం,దేవాదాయ శాఖ, జిల్లా ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ వారికి ఆలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్ బాధ్యతలు అప్పగించకుండా గత 3 సంవత్సరాలుగా కాలయాపన చేయడంలోని ఆంతర్యం ఏమిటి?ఏపీ లో అధికార పార్టీ గెలుపు కోసం పని చేసిన స్థానిక కీలక నేతలు సమర్థవంతంగా ట్రస్టు బోర్డు చైర్మన్ బాధ్యతలు నిర్వహించలేరని జిల్లాలో పగ్గాలు చేపట్టిన ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారా??

దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 1987 ప్రకారం 2 లక్షల హుండీ ఆదాయం వచ్చే ప్రతి ఆలయానికి స్థానిక అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో దేవాదాయశాఖ కమిషనర్ ద్వారా అలాగే 1 కోటి రూపాయల పైబడి హుండీ ఆదాయం వచ్చే ప్రతి దేవాలయానికి ముఖ్యమంత్రి కార్యాలయం సిఫార్సుతో ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులను నియమించడం ఆనవాయితీ!

దేవాదాయ శాఖ ఆలయ ట్రస్ట్ బోర్డ్ లు అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తూ ఆలయ అధికారులు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెడుతూ, దేవాలయాల నిధులు దుర్వినియోగం కాకుండా,ఆదాయ మార్గాలపై దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు !

టీటీడీ ధర్మకర్తల మండలిని మాత్రం రెండోసారి పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాళహస్తి శ్రీశైలం దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డులపై సవతి తల్లి ప్రేమ చూపించడం ధర్మమా?
చిత్తూరు జిల్లాలో “దక్షిణ కాశీగా” విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిలోని స్వయంభు శ్రీ వాయులింగేశ్వర జ్ఞానప్రసూనాంబదేవి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియామకానికి,శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియామకానికి అడ్డుపుల్ల వేస్తున్నది జిల్లా అధికార పార్టీ నాయకులే అని ఆ పార్టీ వారే బహిరంగంగా చెబుతున్నారు!
శ్రీకాళహస్తి కి గత 5 సం” లుగా ధర్మకర్తల మండలి లేకపోవడం దేవాదాయ శాఖ అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి,ఆలయ ఆదాయం సైతం గణనీయంగా తగ్గింది!
శ్రీకాళహస్తి దేవాలయానికి హుండీ ద్వారా,రాహుకేతు పూజల ద్వారా అలాగే శ్రీశైలం ఆలయానికి వాణిజ్య వసతి సముదాయాల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఆలయ అధికారులు బడ్జెట్ ప్రకారమే నిధులు ఖర్చు చేస్తున్నారా లేక అదనంగా ఓచర్ల ద్వారా ఖర్చు చేస్తున్నారా అన్నదానిపై భక్తులకు తెలిసేలా శ్వేతపత్రం విడుదల చేయాలి!

ముక్కంటి ఆలయ ఆదాయానికి గండి కొట్టే విధంగా పూజా ద్రవ్యాల కొనుగోళ్లలో, సెక్యూరిటీ సిబ్బంది నియామకాల టెండర్లలో,గోశాలకు అవసరమైన దానా సరఫరాలో, జీఎస్టీ ముసుగులో జరుగుతున్న అక్రమాలపై దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి విచారణకు ఆదేశించాలి!
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు స్థానికులతో పాటు వివిధ రాష్ట్రాల లోని శివ భక్తులు ఇస్తున్న విరాళాలకు జవాబుదారి ఎవరు?పారదర్శకంగా సద్వినియోగం చేస్తున్నారా? అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి!

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యుల నియామకాలను అధికారికంగా ప్రకటించి పర్వదినాలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార పార్టీ నాయకులు సత్వర చర్యలు చేపట్టాలని ఓ భక్తునిగా డిమాండ్ చేస్తున్నాను.
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ

– నవీన్ కుమార్ రెడ్డి

Leave a Reply