Home » కేసీఆర్‌ హ్యాట్రిక్‌ పక్కా

కేసీఆర్‌ హ్యాట్రిక్‌ పక్కా

– నా హ్యాట్రిక్‌ ఖాయం
– నేను మీ బస్తీ బిడ్డను
– బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ధి
– నామినేషన్‌ తర్వాత మీడియాతో మంత్రి తలసాని
– తలసాని ర్యాలీలో జనప్రభంజనం
– తల్లి ఆశీర్వాదం తర్వాత నామినేషన్‌ వేసిన తలసాని

బ్రహ్మాండమైన మెజార్టీతో మూడోసారి విజయం సాధిస్తానని సనత్ నగర్ BRS MLA అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం సికింద్రాబాద్ లోని GHMC జోనల్ కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ముందుగా వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో వివిధ ఆలయాల పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం తన తల్లి తలసాని లలితాబాయి కాళ్ళకు మొక్కి ఆమె ఆశీర్వాదం పొందారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

అక్కడి నుండి బన్సీలాల్ పేట లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని అక్కడ డాక్టర్ BR అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి ఆయన వేలాది మంది BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి సిటీ లైట్ హోటల్, బాటా, ప్యాట్నీ, హరి హరహర కళా భవన్ ల మీదుగా నార్త్ జోన్ GHMC జోనల్ కమిషనర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. దారిపొడవునా కార్యకర్తల నినాదాలు, డప్పు చప్పుళ్ళతో ఎంతో కోలాహలం నెలకొన్నది. రెండు చోట్ల అభిమానులు గజమాలలను భారీ క్రేన్ సాయంతో మంత్రికి అలంకరించారు.

నామినేషన్ సమర్పించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్ళీ BRS ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ముఖ్యమంత్రి గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హ్యాట్రిక్ సాధిస్తారని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదిన్నర సంవత్సరాలలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో నే అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచు పెండ్లికి లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం, ఆసరా పెన్షన్ ల క్రింద ప్రతినెల ఆర్ధిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

దళిత బంధు, BC బందు, ఇండ్లు లేని పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఇప్పటికే GHMC పరిధిలో 70 వేల మంది అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వడం జరిగిందని, 30 వేల ఇండ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. మరో లక్ష ఇండ్లను నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రారంభించిన అన్ని కార్యక్రమాలను యధావిధిగా కొనసాగిస్తామని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ కోలన్ లక్ష్మి బాల్ రెడ్డి, కుర్మ హేమలత లక్ష్మీపతి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, డివిజన్ BRS అద్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, వెంకటేషన్ రాజు, కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు , శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply