Suryaa.co.in

Telangana

జీవాల పెంపకం దారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలి

– మంత్రి తలసాని

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవాల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాలను జీవాల పెంపకం దారులు సద్వినియోగం చేసుకొనేలా చూడాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద నాన్ గెజిటెడ్ వెటరినేరియర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డెయిరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవాల పెంపకంపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని అన్నారు.

జీవాల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల మందులను అన్ని ప్రభుత్వ పశువైద్య శాలల్లో అందుబాటులో ఉంచిందని, జీవాల వద్దకు వైద్య సేవలు తీసుకెళ్ళే లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సంచార పశువైద్య శాలల ద్వారా వైద్య సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా రైతుల మెప్పు పొందాలని, తద్వారా పశుసంవర్ధక శాఖ కు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాన్ గెజిటెడ్ వెటరినేరియర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ గౌడ్, కోశాధికారి సుదర్శన్, గణేష్ రెడ్డి, జ్ఞానేశ్వర్, అజీమోద్దిన్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE