Suryaa.co.in

Andhra Pradesh

ఆదర్శ గ్రామంగా తాళ్లపూడి

– రూ. 15 కోట్లతో అభివృద్ధి పనులు
-స్వగ్రామంలో‌ పర్యటించి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి

ముత్తుకూరు/ నెల్లూరు, అక్టోబర్ 11 : తన స్వగ్రాంమ తాళ్లపూడి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నట్లు రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తితో కలిసి ఎంపీ విజయసాయి రెడ్డి పర్యటించారు.

తొలుత గ్రామానికి విచ్చేసిన విజయసాయి రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలకగా, స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తదుపరి గ్రామంలోని చెరువును పరిశీలించి మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామ సమీపంలోని స్మశానవాటికను పరిశీలించారు. అనంతరం తాళ్లపూడి గ్రామంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో ఎంపీ విజయసాయి రెడ్డి చర్చించారు.

ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తన స్వగ్రామమైన తాళ్లపూడి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఐదు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, మరో 15 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు ఆయన చెప్పారు.

గ్రామంలో ఇరిగేషన్ కాలువల అభివృద్ధి పనులు, రోడ్లు, సైడ్ కాలవలు, గ్రామ కొలనుల వద్ద వాకింగ్ ట్రాక్, గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా సోలార్ విద్యుత్తు లైట్లు, వివాహాది శుభకార్యములకు కన్వెన్షన్ సెంటర్, సాయిబాబా గుడిని అభివృద్ధి చేసి దేవాదాయ శాఖకు అప్పగించడం, మాతమ్మ గుడి వద్ద కమ్యూనిటీ హాలు నిర్మాణం, సున్నపుగుంట చెరువు అభివృద్ధి వంటి మొదలైన అభివృద్ధి పనులను మరో ఆరు నెలల్లో పూర్తిచేసేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గ్రామంలోని స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మించామని, అన్ని వసతులతో మహాప్రస్థానం లాగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.

అలాగే గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. గ్రామంలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయని చెప్పారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఆయనకు ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీగురుమూర్తి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాళ్లపూడి గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులను ఎంపీ నిధుల ద్వారా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.అనంతరం గ్రామంలో పలు ప్రాంతాలను సందర్శించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ తో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై త్వరగా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు ,ఎలక్ట్రికల్ ఎస్ఈలు, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE