– పరిశ్రమలు, వాణిజ్య వ్యాపారులపై అదనంగా ఏడాదికి రూ.2,300 కోట్ల భారం
– చిన్న వాణిజ్య వ్యాపారులపై రూ.322.33 కోట్ల భారం
– అదనంగా కొత్తగా 94 పైసలు భారం
– ఉత్తర్వులు విడుదల చేసిన విద్యుత్ శాఖ
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు మరో షాక్ ఇచ్చింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కరెంట్ కోతలను అమలు చేస్తోంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా విద్యుత్ సుంకం పెంచుతూ భారం మోపుతూ వారిని ఆందోళనకు గురిచేస్తుంది.
ప్రస్తుతం ఉన్న విద్యుత్ సుంకం 6 పైసలను రూపాయికి ప్రభుత్వం పెంచింది. ఇందుకు సంబంధించిన జిఓ 7ను ఇంధన శాఖ కార్యదర్శి బి శ్రీధర్ ఈ నెల 8వ తేదీన విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం యూనిట్‌కు అదనంగా కొత్తగా 94 పైసలు భారం పడనుంది.
గతేడాది ఫిక్స్‌డ్ ఛార్జీల భారాన్ని చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలపై విద్యుత్ సంస్థలు కొత్తగా మోపాయి. కొత్తగా ఫిక్స్‌డ్ ఛార్జీలు రూ.75 వసూలు చేస్తూ వారిపై ఇప్పటికే భారం మోపాయి.ఇప్పుడు విద్యుత్ సుంకాన్ని కూడా పెంచి వారిపై భారాన్ని మరింత పెంచాయి.
గతేడాది 75 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన చిన్న వ్యాపారవేత్త కస్టమర్ ఛార్జీలు, ఇతర ఛార్జీలు కలుపుకుని రూ.450 చెల్లిస్తే ప్రస్తుతం ఫిక్స్‌డ్ ఛార్జీలు, కొత్త సుంకంతో కలుపుకుని సుమారు రూ.590 చెల్లించాల్సి వస్తుంది. అంటే అదనంగా రూ.140 చెల్లించాల్సి వస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా ఈ నిర్ణయంతో పరిశ్రమలు, వాణిజ్య వ్యాపారులపై అదనంగా ఏడాదికి రూ.2,300 కోట్ల భారం పడుతుంది. 2022-23 విద్యుత్ టారిఫ్‌లో చిరు వాణిజ్య వ్యాపారులకు 3220.33 మిలియన్ యూనిట్లు (ఎంయు), చిన్న పరిశ్రమలకు 1663.77 ఎంయుల విద్యుత్ అమ్మేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి డిస్కమ్‌లకు అనుమతి ఇచ్చింది.
అదేవిధంగా పెద్ద వాణిజ్య వ్యాపారులకు 1601.81 ఎంయులు, పెద్ద పరిశ్రమలకు 17180.23 ఎంయుల విద్యుత్ అమ్మేందుకు డిస్కమ్‌లకు అనుమతిచ్చింది. చిన్న వాణిజ్య వ్యాపారులపై రూ.322.33 కోట్లు, చిన్న పరిశ్రమలపై రూ.166.37 కోట్లు మొత్తంగా రూ.488.4 కోట్లు అదనపు భారం పడనుంది.
పెద్ద పరిశ్రమలు, వాణిజ్య వ్యాపారులపై రూ.1800 కోట్ల భారం పడనుంది.
ఇప్పటికే కరెంట్ కోతలు వల్ల వ్యాపారం జరగడం లేదని వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఛార్జీలు పెంచడం సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.