Suryaa.co.in

Andhra Pradesh

పని చేయని వారిని ఉపేక్షించేది లేదు

– వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలు, నియోజకవర్గ సమస్యలపై స్థానిక పోరాటాలు
– జగన్ పాలనలో ప్రజలు పేదలయ్యారు….వైసీపీ వాళ్లు ధనికులయ్యారు
– సమర్థ నేతలను వదులుకునేది లేదు…పని చెయ్యని వారిని ఉపేక్షించేది లేదు
– పార్టీ ఇంచార్జ్ లు, ముఖ్యనేతలతో సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబు దిశానిర్థేశం

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నుంచి స్థానిక సమస్యలపై పోరాటం ఉద్ధృతం చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. వైసిపి ఎమ్మెల్యేల, నేతల అక్రమాలపై గట్టిగా పోరాడాలని నేతలకు సూచించారు. స్థానిక, నియోజకవర్గ సమస్యలపై స్థానికంగానే పోరాటాలు చేయాలని అన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచిపోయినా….ఒక్క సమస్యను పరిష్కరించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారని అన్నారు.

ప్రజా సమస్యలపై ఇక మరింత ప్రభావవంతంగా నేతలు బరిలోకి దిగాల్సిందే అని నేతలకు చంద్రబాబు తేల్చి చెప్పారు. గెలిచే వారిని, సమర్థులను వదులుకునేది లేదని….ఇదే సమయంలో పార్టీ కోసం, ప్రజల కోసం పనిచెయ్యని నేతలను ఇక మోసేది లేదని అన్నారు. కొందరు నాయకుల కారణంగా కార్యకర్తలను ఇబ్బందుల్లోకి నెట్టలేమని చంద్రబాబు సమావేశంలో స్పష్టం చేశారు. కొత్తగా ఇంచార్జ్ లను నియమించిన మాచర్ల, పుగనూరు నియోజకవర్గాల్లో క్యాడర్ కు ఆత్మస్థైర్యం ఇచ్చేలా అక్కడ నాయకత్వం పని చేస్తుందని అన్నారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి డైయిరీలో లీటర్ పాలకు కేవలం రూ.18 మాత్రమే చెల్లించే పరిస్థితి ఉండేదని……దీనిపై టీడీపీ నిలదీయడంతో ఫిబ్రవరి నుంచి ధర పెంచి ఇస్తున్నారని అన్నారు. క్యాసినో వ్యవహారంలో బూతుల మంత్రి కొడాలి నానిని ఎండగట్టడంలో…..ప్రభుత్వాన్ని ఫిక్స్ చెయ్యడంలో పార్టీ నేతలు బాగా పని చేశారని చంద్రబాబు అన్నారు.

మండల, నియోజవర్గ స్థాయిలో వైసీపీ నేతల వసూళ్లు, భూ కబ్జాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయని నేతలు సమావేశంలో వివరించారు. దీనితో పాటు….. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియాపై పోరాటం చెయ్యాలని చంద్రబాబు సూచించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే….మరోవైపు మళ్లీ విద్యుత్ చార్జీల పెంపు, రకరకాల పన్నులతో ప్రజలను పీల్చుకుతినేందుకు సిద్దం అయ్యారని…..దీనిపై ప్రజల్లో తీవ్ర నిరసన ఉందని వివరించారు.

జిల్లాల పునర్విభజన విషయంలో ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయని నేతలు చెప్పారు. సమస్యలను పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, నిర్ణయాలతో రాష్ట్రంలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని నేతలు అన్నారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై తమ తమ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులను నేతలు వివరించారు. రాజకీయం కోసం కాకుండా….ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చెయ్యాలని సమావేశం డిమాండ్ చేసింది.

మార్చి నాటికి తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం జరిగి 40 ఏళ్లు పూర్తి అవుతుందని….ఈ సందర్భంగా ఘనంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అదే విధంగా మహానాడుతో పాటు…..ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ పేరుతో తెలుగు దేశం పెట్టిన 14 పథకాలను తొలగించి…పేర్లు తీసి వేసిన జగన్ ప్రభుత్వం……ఇప్పుడు జిల్లాకు పేరు పెట్టి…..గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుందని నేతలు అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలను, రాజకీయ ఉద్దేశాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE