Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీతోనే బీసీల ఆత్మ గౌరవం పెంపు

– బీసీ సంక్షేమ శాఖ మంత్ర సవిత

అమరావతి : వెనుబడిన తరగతుల ఆత్మగౌరవం పెంపొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీలు గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించే భిక్షాటన చేసేవారు అనే పదాన్ని తొలగింపు హర్షం వ్యక్తంచేస్తూ, మంత్రి సవితకు దాసరి సామాజిక వర్గీయులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను దాసరి రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు కలిశారు. ఇటీవల బీసీ-ఏ కేటగిరిలోని దాసరి సామాజిక వర్గానికి జారీచేసే కుల ధ్రువీకరణ పత్రంలో భిక్షాటన చేసేవారు అనే పదాన్ని తొలగించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భవించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్న ఎన్టీఆర్, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వాలు బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా బీసీల ఆత్మగౌరవానికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు.

దీనిలో భాగంగా బీసీ-ఏ కేటగిరిలో ఉన్న దాసరి కులస్తుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా కుల ధ్రువీకరణ పత్రాల్లో మార్పులు చేశామన్నారు. దాసరి పక్కన బ్రాకెట్లో భిక్షాటన చేసేవారు అనే పదాన్ని రాసేవారని, ఆ పదాన్ని తొలగిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు పి.రవి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE