ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉంది

4

-వైసిపి అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలపై అణచివేత
-యువనేత నారా లోకేష్‌ ను కలిసిన ఎస్సీ, ఎస్టీ ఇన్నోవా కార్ల లబ్ధిదారుల సంఘం

పాదయాత్ర దారిలో పులిచర్ల వద్ద ఎస్సీ, ఎస్టీ ఇన్నోవా కార్ల లబ్ధిదారుల సంఘం ప్రతినిధులు యువనేతను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. టిడిపి హయాంలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఎన్ఎస్ ఎఫ్ డిసి ద్వారా ఇన్నోవా కార్లను సబ్సిడీపై తీసుకున్నాం.అప్పటినుంచి వాటిపై ఆధారపడి జీవిస్తున్నాం. ట్రావెల్స్ రంగంలో పోటీపెరగడంతో మా కార్లకు ఆశించినంతగా వ్యాపారం లేదు.వైట్ బోర్డు కలిగిన వాహానాలు ఎటువంటి పర్మిట్లు లేకుండానే కిరాయికి తిప్పుతుండటంతో మా వాహనాలకు గిరాకీ లేకుండా పోయింది. దీనివల్ల మాకు ఇబ్బంది ఏర్పడుతోంది. పర్మిట్లు, ట్యాక్సులు క్రమం తప్పకుండా చెల్లించడం భారంగా మారింది.కార్పొరేషన్ అధికారుల వత్తిడి భరించలేక, ఈఎంఐ కట్టలేకపోతున్నాం. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. టిడిపి అధికారంలోకి వచ్చాక 3నెలలకు ఒకసారి కడుతున్న ట్యాక్స్ ను రద్దుచేయాలి. సౌత్ జోన్ పర్మిట్ ను కల్పించాలి. వైట్ బోర్డు టాక్సీలను అరికట్టాలి. కరోనా సమయంలో రెండేళ్లు ఎటువంటి వ్యాపారం లేదు. అప్పటినుంచి ఈఎంఐలు కట్టాలని కార్పొరేషన్ అధికారులు వత్తిడి తెస్తున్నారు. ఇన్నోవా కార్లపై ఉన్న బకాయిలను రద్దుచేసి ఆదుకోవాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…
ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులు సొంత కాళ్లపై నిలబడి ఉపాధి పొందాలనే ఉద్దేశంతో టిడిపి ప్రభుత్వ హయాంలో ఇన్నోవా కార్లను సబ్సిడీపై అందజేశాం.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని రద్దుచేయడమేగాక లబ్ధిదారులను ఏదోవిధంగా ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో వివిధ విభాగాలకు అవసరమైన వాహనాలను ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల నుంచే అద్దెకు పెట్టేలా చర్యలు తీసుకుంటాం.రవాణాశాఖ నుంచి ఎటువంటి వేధింపులు లేకుండా చూస్తాం. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉంది. తిరిగి చంద్రన్నను గెలిపించేందుకు మీ వంతు సహకారం అందించండి.