రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలకు ఉన్న దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి పేరును ప్రభుత్వం తొలగించడంపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలో పుట్టి జాతీయ స్థాయికి ఎదిగి, దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరును తొలగించడం అవమానకరమని చంద్రబాబు అన్నారు. దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి పేరుతో ఉన్న గురుకులాల అభివృద్దికి మూడేళ్లలో రూపాయి కేటాయించకుండా పేర్లు మార్చి పబ్బం గుడుపుతున్నారు. రాష్ట్ర పథకాలకు అంబేద్కర్ పేరు పెట్టడంలో టిడిపికి ఎటువంటి అభ్యంతరం లేదు.
అయితే జగన్ పేరుతో, వైఎస్ పేరుతో ఉన్న కార్యక్రమాలకు ఆ పేరు తొలగించి అంబేద్కర్ పేరు పెట్టొచ్చు అని చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే…దానికి దళిత తేజం బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదు. నిజంగా జగన్ సర్కారుకు చిత్తశుద్ది ఉంటే కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు? తెలుగు జాతి గర్వపడే దళిత బిడ్డ బాలయోగి పేరును తొలగించడానికి కారణం…మీ స్వార్ధ రాజకీయ దురుద్దేశ్యం కాదా? లోక్ సభ స్పీకర్ గా ఎదిగి తెలుగు జాతికి పేరు తెచ్చిన బాలయోగి గారిని గౌరవించుకునే విషయంలో కూడా కుసంస్కారంతో ఆలోచన చెయ్యడం మంచిది కాదని చంద్రబాబు అన్నారు.