– పార్టీలో పెరుగుతున్న వాదనలు
– మంత్రి పదవి వద్దని సీనియర్ల సూచనలు
– బాబులా పార్టీపై పట్టు పెంచుకోవాలని సలహాలు
– బాబు సీఎం-లోకేష్ పార్టీ అధ్యక్షుడైతేనే మంచిదంటున్న సూచనలు
– కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో రాణించడం లేదా?
– బాబు అరెస్టు ఎపిసోడ్‌లో అంతా తానై నడిపిన లోకేష్
– ఆ సమయంలో జాతీయ నేతలతో చర్చలు
– హిందీ, ఇంగ్లీషు భాషలపై పట్టు అదనపు అర్హతలు
– పాదయాత్రతో యువనేతగా ముద్ర
– ప్రజానేతగా తీర్చిదిద్దిన యువగళం
– ప్రసంగాలతో రాణిస్తున్న వైనం
– సీనియర్లు-జూనియర్ల సమన్వయంలో పాస్
– బుద్దా వెంకన్న వాదనతో ఏకీభవిస్తున్న సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమయిందన్న సంకేతాలు వినిపిస్తున్న సమయంలో.. ఆ పార్టీలో కొత్త వాదనకు తెరలేచింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌కు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న వాదనకు ప్రాణం పోసింది. మాజీ ఎమ్మెల్సీ, బాబు కుటుంబానికి వీర విధేయుడు-విశ్వసనీయుడైన బుద్దా వెంకన్న ప్రాణం పోసిన ఈ చర్చకు, సీనియర్లు సైతం మద్దతునిస్తున్నారు. ఎన్నికల ముందు తన రక్తంతో జై చంద్రబాబు అని రాసిన బుద్దా వెంకన్న తెరలేపిన ఈ చర్చ ఆసక్తికరంగా మారింది.
నిజానికి దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీల అధినేతలయినా, వారి వారసులకే పార్టీ పగ్గాలందిస్తుంటారు. ఇందులో కొత్తదనమేదీ లేదు. బీఆర్‌ఎస్, డిఎంకె, బిజూజనతాదళ్, జనతాదళ్ సెక్యులర్, సమాజ్‌వాదీపార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, ఆర్జేడీ, నేషనలిస్టు కాంగ్రెస్, మజ్లిస్ వంటి ప్రాంతీయ పార్టీలన్నీ.. తమ వారసులను ఉత్తరాధికారులుగా ప్రకటించినవే. వీటిలో బీఆర్‌ఎస్, నేషనలిస్టు కాంగ్రెస్, మజ్లిస్, జనతాదళ్, సమాజ్‌వాదీపార్టీ, డీఎంకె పార్టీ అధినేతల వారసులు,కుటుంబసభ్యులంతా క్రియాశీల రాజకీయాల్లో కీకలపాత్ర పోషిస్తున్న వారే.
తెలంగాణలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడైన కేసీఆర్ కుమారుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బిడ్డ కవిత, మేనల్లుడు హరీష్‌రావు, షడ్డకుడి కొడుకు సంతోష్‌రావుతోపాటు.. మహారాష్ట్ర ఇన్చార్జిగా మరో బంధువు కీలకపాత్ర పోషిస్తున్నారు. కేటీఆర్-కవిత తొలుత కేటీఆర్ బిడ్డలుగానే తెరపైకి వచ్చినప్పటికీ, తర్వాతి కాలంలో వారి సొంత ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నారన్నది నిర్వివాదాంశం. ఇప్పడు తెలంగాణలో అద్భుతంగా మట్లాడే అతి కొద్దిమందిలో కేటీఆర్-కవిత ఒకరన్నది కాదనలేని నిజం. అలాగే వైఎస్ బిడ్డ షర్మిల కూడా తన ప్రసంగాలతో అందరినీ ఆకర్షిస్తున్నారు.
తాజాగా ఏపీలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్‌ను పార్టీ ఉత్తరాధికారిని చేయాలన్న వాదనకు తెరలేచింది. ఇది ఆలస్యమేమీ కాకపోయినా, సరైన సమయమనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో బాబు కుటుంబం, రాష్ట్రం నలుమూలలా విడిపోయి పార్టీ కోసం పనిచేసింది. ఎప్పుడూ బయటకు రాని బాబు భార్య భువనేశ్వరి, ఈసారి నిజం గెలవాలి పేరుతో రాష్ట్రం చుట్టివచ్చారు. చంద్రబాబు జైల్లో ఉండగా, రాజమండ్రికి తరలివచ్చిన అభిమానులను ఆమె స్వయంగా ఓదార్చారు. బాబు అరెస్టు వార్తతో మృతి చెందిన వారి కుటుంబాల వ ద్దకు వెళ్లి స్వయంగా పరామర్శించారు. ఇక మొండిఘటమైన చంద్రబాబు.. మండుటెండలను కూడా లెక్కచేయకుండా 45 సెగల సెల్సియస్‌లో చొక్కాలు కూడా చెమటతో తడిసపోయి, చెమట చుక్కలు కళ్లలో పడుతున్నా ఖాతరు చేయకుండా ప్రచారం చేశారు.
రేపటి ఫలితాలు టీడీపీకే అనుకూలంగా ఉన్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ మేరకు జాతీయ, స్థానిక సర్వే సంస్థల వేళ్లు కూడా కూటమి వైపే చూపిస్తున్నాయి. ప్రధాని మోదీ-కేంద్రహోంమంత్రి అమిత్‌షా కూడా స్వయంగా జగన్ ఓడిపోతున్నాడని, బాబు సీఎం అవుతున్నారని జోస్యం చెప్పారు. ఇవన్నీ కూటమి ముందస్తు విజయదరహాసాలే. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు సీఎంగా ఉండి, లోకేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలన్న వాదన బుద్దా వెంకన్న రూపంలో తెరపైకి వచ్చింది.
నిజానికి ఈ భావన చాలాకాలం నుంచి పార్టీ శ్రేణుల్లో ఉన్నదే. కాకపోతే దానికి ఇదే తగిన సమయమన్నది వారి వాదన. ఎందుకంటే పార్టీ అధినేత చంద్రబాబు వయసు ఏడుపదులు దాటింది. యోగా-మితాహారం-కఠినమైన ఆరోగ్యనిబంధనలు పాటిస్తున్నందుకే బాబు ఇంత ఫిట్‌గా ఉండగలుగుతున్నారు. ఆయన వయసున్న జాతీయ నాయకులలో 80 శాతం కొడుకులకు పగ్గాలందించి, ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇప్పుడు పార్టీలో చాలామంది బాబు సహచరుల్లో సీనియర్లు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, రిటైరయ్యే దశకు చేరారు. కానీ చంద్రబాబు 45 డిగ్రీల సెగల సెల్సియస్‌లో కూడా ప్రచారం చేశారంటే, దానికి కారణం ఆయనలో సడలని మనోస్థ్యైరమే.
ఎంత ఆత్మస్థైర్యం లేకపోతే.. ఆ వయసులో 65 రోజులు జైల్లో ఉన్నప్పటికీ, మళ్లీ నవయువకుడిలా కార్యక్రమాల్లో ఎంతమంది పాల్గొనగలరు? ఒక్క చంద్రబాబు తప్ప! తిరుమల మెట్లు అలుపెరగకుండా కుర్రాడిలా చకచకా ఎక్కడం. బస్సు నిచ్చెనలుపట్టుకుని పైకి వెళ్లడం, పొలం గట్లను యువకుడి మాదిరిగా జంప్ చేయడం.. ఇవన్నీ ఈ వయసులో బాబుకు మాత్రమే సాధ్యం! అదే యువకుడైన జగన్ కిందకు వంగి కొబ్బరికాయ కూడా కొట్టలేకపోయిన వీడియాలను తెలుగు ప్రజలు తిలకించారు. ఎన్నికల్లో బాబు మండుటెండల్లో చెమటోడుస్తూ ప్రచారం చేస్తే, జగన్ ఏసీ బస్సు నుంచి ప్రచారం చేయడాన్ని విస్మరించకూడదు.
అయితే ఆహార నియమాలు ఎంత కఠినంగా పాటించినప్పటికీ, ప్రకృతి ధర్మం అనేది ఒకటుంటుంది. దానికి ఎవరూ మినహాయింపు కాదు. పైగా రేపు బాబు సీఎం అయితే ఆయనపై తలకుమించిన పనిభారం-బాధ్యత ఉంటుంది. అన్ని రంగాల్లో భ్రష్ఠుపట్టిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి, ఇచ్చిన హామీలు నెరవేర్చి, మళ్లీ ఆంధ్రాను అగ్రస్థానంలో నిలబెట్టడం తలకు మించిన భారమే. అదే సమయంలో పార్టీని కూడా నిర్వహించాలంటే అది పెనుభారమే అవుతుంది. ఇప్పటివరకూ సీఎం-పార్టీ అధినేత బాధ్యతలు నిర్వహించడం ఒక ఎత్తు. రేపు రెండూ నిర్వహించడం మరో ఎత్తు. ఆ ఒత్తిళ్లు తట్టుకోవాలంటే, చంద్రబాబు వయసు సహకరించదన్నది నిష్ఠుర నిజం.
పైగా చంద్రబాబు సీఎం-పార్టీ అధ్యక్షుడైతే ఈ సమయంలో, దేనికీ న్యాయం చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బాబు సీఎంగా ఉండగా, అధికారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ నేతలకు ఆ స్థాయిలో సమయం కేటాయించలేదు. సూటు-బూటు వేసుకున్న వారికే ఎక్కువ సమయం కేటాయించేవారన్న విమర్శలుండేవి. ఇప్పుడు ఐదేళ్లపాటు వైసీపీని ఎదిరించి, పార్టీని బతికించిన వారికి న్యాయం చేయడం ఒక బాధ్యత. గతంలో మాదిరిగా దానిని విస్మరిస్తే, అది ప్రత్యర్థి పార్టీకి అవకాశంగా మారడం ఖాయం.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు దన్నుగా నిలిచారన్న అంశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా, మళ్లీ పాతవైఖరి ప్రదర్శిస్తే అది పార్టీకే నష్టం. నిజానికి పార్టీ అధికారం కోల్పోయి, పార్టీ ఆఫీసుపై దాడి చేసే వరకూ.. పదవులు అనుభవించిన చాలామంది నేతలు అడ్రసు లేరు. హైదరాబాద్-బెంగళూరు-చెన్నైలో వ్యాపారాలకు పరిమితమయ్యారు. ఆ సమయంలో నియోజకవర్గ ఇన్చార్జిలు ఇస్తామన్నా మాకొద్దని తప్పించకున్నారు. ఇప్పుడు అలాంటి వారితోపాటు, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు బాబు వద్దకు బొకేలు పట్టుకురావడం.. పార్టీ జెండాను పుండ్లు పడేలా మోసిన వారి మనోభావాలు దెబ్బతినేందుకు కారణమవుతున్నాయి. పార్టీ సోషల్‌మీడియా గ్రూపుల్లో అప్పుడే తరహా వ్యాఖ్యలు మొదలయ్యాయి.
అందుకే లోకేష్‌కు పార్టీ పట్టాభిషేకం చేయాలన్నది పార్టీ శ్రేణుల వాదన. ఇందులో నిజం లేకపోలేదు. అయితే లోకేష్ మంత్రివర్గంలో ఉండకుండా, పార్టీ అధ్యక్షుడికే పరిమితమైతేనే అద్భుత ఫలితాలు వస్తాయి. అది పార్టీకి కూడా శ్రేయస్కరమన్నది సీనియర్ల మనోగతం. నిజానికి గత ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసి తప్పుచేశారని, అదే ఆయన పోటీ చేయకుండా ఎన్నికల సమన్వయం చేసి ఉంటే, ఫలితాలు మరోలా ఉండేవన్నది ఇప్పటికీ కొందరు సీనియర్ల వాదన. బాబు ఎన్నికల ప్రచారంలో ఉంటే, లోకేష్ సమన్వయం చేసి ఉండేవారని, అప్పుడు ఫలితాలు మరోలా ఉండేవన్నది వారి మనోగతం. ఇద్దరూ పోటీ చేయడం వల్ల సమన్వయం దెబ్బతిందన్నది సీనియర్ల విశ్లేషణ.
నిజానికి చంద్రబాబు కూడా తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శిగానే తన ప్రతిభ కనబరిచారు. ఆగస్టు సంక్షోభంలో బీజేపీతోపాటు, అన్ని పార్టీలనూ ఏకం చేసి ఎన్టీఆర్‌ను తిరిగి గద్దెనెక్కించడంలో కీలక పాత్ర ఆయనదే. తొలుత కేవలం ఎన్టీఆర్ ఆకర్షణపై అధికారంలోకి వచ్చిన టీడీపీని, శిక్షణా తరగతులు-సభ్యత్వాలు-కంప్యూటరీకరణతో, కార్యకర్తల పార్టీగా తీర్చిదిద్దిన ఘనత బాబుదే. ఎన్టీఆర్ పార్టీకి జీవం పోస్తే,చంద్రబాబు దానిని కార్యకర్తల పార్టీగా మలిచారు. ఆగస్టు సంక్షోభంలో బాబు ప్రతిభ బయట ప్రపంచానికి తెలిస్తే.. ఆయన అరెస్టు సమయంలో లోకేష్ పాత్ర కార్యకర్తలకు తెలిసింది. అమిత్‌షా నుంచి జాతీయ నేతలతో సమన్వయం-న్యాయవాదులతో చర్చలు-పార్టీ క్యాడర్‌తో భేటీలన్నీ లోకేష్ ఏకకాలంలో చేసినవే.
సూటిగా చెప్పాలంటే.. బాబుకు భిన్నమైన వైఖరి లోకేష్‌ది. ఆయన గంటలపాటు మాట్లాడరు. వచ్చిన వారిని ఎక్కువ సేపు వెయిట్ చేయించరు. చేయగలిగింది మాత్రమే చెప్పే ఖచ్చితత్వం. ఈ తరం రాజకీయాలకు అదే సరైనది. ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. నిజానికి రెండేళ్ల క్రితం వరకూ లోకేష్ నాయకత్వాన్ని, చాలామంది సీనియర్లు ఇష్టపడలేదు. కానీ మారిన ఆయన తీరు చూసి.. ఈ పార్టీకి లోకేష్ కరెక్టన్న అభిప్రాయానికి వచ్చారు. అంటే లోకేష్ తనను తాను మలచుకున్నట్లే లెక్క.
కాకపొతే లోకేష్ మంత్రివర్గంలో చేరకుండా, పార్టీ అధ్యక్షుడి వరకూ పరిమితమైతే బాగుంటుందన్నది సీనియర్ల సలహా. ఎందుకంటే ఈ ఐదేళ్లలో క్షేత్రస్థాయిలో వైసీపీతో పోరాటాలు చేసిన కార్యకర్తలు అన్ని విధాలా నష్టపోయారు. నియోజకవర్గ స్థాయి నేతలదీ అదే పరిస్థితి. పైగా వైసీపీకి 60-65 స్థానాలు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అంటే ఆ పార్టీకి 40 శాతం ఓట్లు సాధిస్తే, మళ్లీ యుద్ధవాతావరణమే ఉంటుంది. ఈ ఐదేళ్లలో వైసీపీ ఆర్ధికంగా బాగా స్థిరపడినందున, వచ్చే ఐదేళ్లూ ఆర్ధిక వనరులు వెచ్చించేందుకు వెనుకాడదు. కాబట్టి ఎక్కువకాలం పార్టీపైనే దృష్టి సారించవలసి ఉంటుంది.
ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో లోకేష్ చెప్పిన రెడ్‌బుక్ అమలుపై శ్రేణులు ఎదురుచూస్తున్నారు. వీటికి మించి.. బాబు చేతికి పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాత, వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. మళ్లీ ఐదు-పదేళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి. భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకుండా, బెంగాల్‌లో జ్యోతిబసులా వరసగా అధికారంలో ఉండాలంటే పార్టీని తీర్చిదిద్దాలి. అందుకు మంత్రి పదవి అడ్డంకే అవుతుందన్నది సీనియర్ల విశ్లేషణ.