పసుపు రైతులకు అండగా టిడిపి

– రైతుల రిలే నిరాహారదీక్షకు డాక్టర్ పెమ్మసాని మద్దతు

మంగళగిరి:నష్టపోయిన పసుపు రైతుకు మార్కెట్ రేటు, ప్రస్తుత రేటుకు ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపై ఉందని గుంటూరు టీడీపి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దుగ్గిరాల తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నిరవధికంగా ఆరో రోజుకు చేరిన క్రమంలో గురువారం దీక్షా శిబిరం వద్దకు వెళ్లి రైతులను పెమ్మసాని కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపును నమ్మిన రైతులు తమ పంటను నిల్వ ఉంచుకొని, ధర ఎక్కువ పలికిననాడు అమ్ముకుంటూ ఉంటారన్నారు. ఈ క్రమంలో కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన పసుపు బస్తాలు అగ్ని ప్రమాదానికి గురై నెల గడిచినా స్పందించని ఈ ప్రభుత్వ తీరును ఆయన దుయ్యబట్టారు.

రైతులకు అందాల్సిన బీమాను సంబంధిత కలెక్టర్, ప్రభుత్వం ముందుగా అంచనా వేయాల్సి ఉన్నా ప్రభుత్వం నేటికీ పట్టించుకోలేదన్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ, తహసిల్దార్ గాని ఏం జరిగిందని పలకరించకపోవడం విచారకరమన్నారు. కోల్డ్ స్టోరేజ్ ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

అనంతరం రైతులను కలుసుకొని ఘటనపై వివరాలను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 380 మంది రైతులకు చెందిన 1.40 లక్షల బస్తాల పసుపు కాలిపోయిందని, ఇప్పటివరకు కనీసం ఈ ప్రభుత్వం బీమాకు సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయిందని వాపోయారు.

తమ ఎమ్మెల్యే అయితే రెండు నెలలుగా కనిపించకుండా పోయారని, ప్రభుత్వంతో ఆయనకు పనులు ఉంటేనే ప్రజలకు కనిపిస్తారా? అని ఈ సందర్భంగా రైతులు స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెమ్మసానికి తమ బాధను వెళ్ళబోసుకున్న వారిలో స్థానిక రైతులు పేర్ని రవి, కళ్ళం రామకృష్ణారెడ్డి, వేములపల్లి వెంకటరామయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply