Suryaa.co.in

Andhra Pradesh

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఆగని ఆగ్రహ జ్వాల

• రెండో రోజూ టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
• పలాసలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం..చెదరగొట్టిన పోలీసులు
• విశాఖలో చేసిన నిరసనలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
• పాలకొల్లులో బస్సులో ప్రయాణిస్తూ భజన చేసిన రామానాయుడు
• నెల్లూరు రూరల్ లో రిక్షా తొక్కి నిరసన తెలిపిన అజీజ్
-బస్సుల్లో ప్రయాణిస్తూ..పెరిగిన ఛార్జీల వివరాలను తెలుసుకున్న నేతలు

పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను నిరసిస్తూ రెండవ రోజూ టీడీపీ ఆందోళనలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో కలిసి నేతలు బస్సుల్లో ప్రయాణించారు. పలుచోట్ల బస్సులను అడ్డగించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బస్సుల్లో ప్రయాణంచి చార్జీల పెంపుదల గురించి ప్రయాణికులను అడిగి అభిప్రాయాలు తెలసుకున్నారు. అనంతరం ప్రభుత్వం మోపిన భారాన్ని ప్రయాణికులకు వివరించారు. మరికొన్ని చోట్ల డిపోల ఎదుట ధర్నాలు చేపట్టారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ..టీడీపీ హయాంలో ఎటువంటి ఛార్జీలూ పెంచకపోయినా బాదుడే బాదుడు అంటూ జగన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ఇష్టానుసారంగా బాదుడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైకి డీజిల్ సెస్, సేఫ్టీ సెస్ అంటూ మభ్యపెడుతూ అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసుకుని ప్రయాణికుల చేబుకు చిల్లు పెడుతున్నారని విమర్శించారు. కిలో మీటరుకు రూ.10 నుండి రూ.20 పైసలు పెంచి దోచుకుంటున్నారని ఆరోపించారు.

రోడ్ల మరమ్మతులను ప్రభుత్వం గాలికొదిలేసిందని, ప్రయాణికుల భద్రతను పట్టించుకోని ప్రభుత్వానికి సేఫ్టీ సెస్ వసూలు చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు బాదడం మొదలు పెడితే పాతాళానికి పడిపోతుందని హెచ్చరించారు.
రెండో రోజూ చేపట్టిన నిరసన వివరాలు ఈవిధంగా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో…
• ఆర్టీసీ చార్జీలను పెంపును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు చేపట్టిన నిరసన పలాసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బస్సుకు అడ్డంగా పడుకుని నేతలు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వచ్చి చెదరగొట్టడంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
• శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. ఆమెతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
• పాతపట్నంలో కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో బస్సులను అడ్డుకోగా పోలీసులు ఈడ్చిపడేశారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకోవడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పార్వతీపురం మన్యం జిల్లాలో…
• టీడీపీ ఇంచార్జ్ తోయక జగదీశ్వరి కురుపాం నుండి తోటపల్లి వరకు బస్సులో ప్రయాణం చేసిన అనంతరం చార్జీలు తగ్గించాలిన డిమాండ్ చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
• పాలకొండలో నిమ్మక జయకృష్ణ, పార్వతీపురంలో బొబ్బిలి చిరంజీవులు పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్సుల్లో ప్రయాణించి, ప్రయాణికులు అభిప్రాయాలను తెలుసుకున్నారు.
• పొలిట్ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి సాలూరు నుండి మామిడిపల్లి వరకు బస్సులో ప్రయాణించారు. ప్రయాణికుల నుండి టికెట్లు తీసుకుని ప్రస్తుత చార్జీ, గత ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు.

అల్లూరి సీతారామరాజు
• మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు నుండి జీమాడుగుల వరకు బస్సులో ప్రయాణించారు. ఛార్జీలు ఎంతమోతున పెరిగాయో కండెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు.
• వంతల రాజేశ్వరి రంపచోడవరం నుండి ఐపోలవరం బస్సులో ప్రయాణించి, పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

విశాఖపట్నం జిల్లాలో…
• పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని విశాఖపట్నంలో చేపట్టిన నిరసనలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. తనే స్వయంగా టికెట్ తీసుకుని ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మద్దిలపాలెం వరకు ప్రయాణించారు. ఈయనతో పాటు విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

• వైజాగ్ సౌత్ నియోజకవర్గంలో ఇంచార్జ్ గండి బాబ్జీ కార్యకర్తలతో కలిసి బస్టాండ్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తర్వాత బస్సులో ప్రయాణించి పెరిగిన చార్జీలపై ప్రయాణికులను ఆరా తీశారు.
• భీమిలలో ఇంచార్జ్ కోరాడ రాజాబాబు నాయకులు, కార్యకర్తలతో కలసి రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. దీంతో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

కాకినాడ జిల్లాలో…
• జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు బస్టాండ్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. అనంతరం కొత్తపల్లి గ్రామం నుండి గోకవరం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
• పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ బస్సులను అడ్డుకుని ధర్నా చేశారు.
• కాకినాడ సిటీ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధర్నా చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో…
• రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆర్టీసీ కాంప్లెక్స్ లో నిరసన తెలిపారు. అనంతరం ప్రయాణికులతో కలసి బస్సులో ప్రయాణించి పెరిగిన ఛార్జీలపై జనంతో మాట్లాడారు. బస్సులో కరపత్రాలు పంపిణీ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో…
• ఉండిలో ఆర్టీసీ చార్జీల పెంపును నిసిస్తూ ఎమ్మెల్యే మంతెన రామరాజు వినూత్నంగా నిరసన తెలిపారు. కాళ్లూరు నుండి బీమవరం వరకు బస్సులో ప్రయాణించారు. ఎండల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కూల్ డ్రింకులు పంపిణీ చేసి, కరపత్రాల పంపిణీ చేశారు.

కోనసీమ జిల్లాలో…
• మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ ఎదుట ఆందోళ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో…
• పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డప్పులు కొట్టుకొంటూ కార్యకర్తలతో బస్టాండ్ చేరుకున్నారు. అనంతరం బస్సులో పాలకొల్లు నుండి ఇలపకర్రు వరకు ప్రయాణం చేశారు. ఛార్జీల పెంపును నిరసిస్తూ బస్సులో భజన చేశారు.
• తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీ బస్టాండ్ కు వచ్చే బస్సుల్లో పెరిగిన చార్జీల భారాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

ఎన్టీఆర్ జిల్లాలో…
• మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గొల్లపూడి నుండి మైలవరం చేరుకుని, మైలవరం నుండి మళ్లీ గొల్లపూడికి బస్సులోనే ప్రయాణం చేశారు. చార్జీల పెంపుపై కండెక్టర్, ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.
కృష్ణాజిల్లాలో…
• మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ నిరసన అనంతరం పోరంకి నుండి ఉయ్యూరు వరకు బస్సులో ప్రయాణించారు.

గుంటూరు జిల్లాలో…
• గుంటూరు నగరంలో ఎన్టీఆర్ బస్టాండ్ కూడలి వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బస్సు ఛార్జీలను తగ్గించాలని గుంటూరు వెస్ట్, ఈస్ట్ ఇంచార్జ్ లు కోవెలమూడి నాని, నసీర్ అహ్మద్ ఆద్వర్యంలో ఆందోళన చేపట్టారు.
బాపట్ల జిల్లాలో…
• బాపట్లలో ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ బస్టాండ్ ఎదుట కార్యకర్తలతో చప్పట్లు కొట్టి బాదడే..బాదుడు జగనన్న బాదుడు అంటూ నినాదాలు చేశారు.

నెల్లూరు జిల్లాలో…
• నెల్లూరులో పార్లమెంట్ అధ్యక్షులు జీజీజ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ 20 మందితో కలిసి రిక్షా తొక్కారు. అనంతరం బస్సులో ప్రయాణించి, చార్జీల పెంపును ప్రయాణికులకు వివరించారు.

తిరుపతి జిల్లాలో…
• గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ బస్సులో ప్రయాణించి కరపత్రాలు పంపిణీ చేశారు.
• వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బస్సులో ప్రయాణికులకు పెరిగిన చార్జీల గురించి వివరించారు.

సత్యసాయి జిల్లాలో..
• పెనుకొండలో మాజీ ఎమ్మెల్యే బీ.కే.పార్థసాధి పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం బస్సు ఎక్కి కరపత్రాలు పంపిణీ చేశారు.
• పుట్టపర్తిలో ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసగా కదిరి వెళ్లే బస్సులను అడ్డుకున్న టీడీపీ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.
కర్నూలు జిల్లాలో…
• పత్తికొండలో కె.ఇ.శ్యాంబాబు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

LEAVE A RESPONSE