చంద్రబాబుకు టిడిపి నిజనిర్థారణ కమిటీ నివేదిక

-పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్యపై చంద్రబాబుకు టిడిపి నిజనిర్థారణ కమిటీ నివేదిక
-ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ విధానాల వల్లనే కాశం పద్మనాభం కుటుంబం ఆత్మహత్య పాల్పడినట్లు నివేదిక

అమరావతి: కృష్ణా జిల్లాలో చేనేత కుటుంబం ఆత్మహత్యపై టిడిపి నిజ నిర్థారణ కమిటీ తన నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు అందజేసింది. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని పెడన మున్సిపాలిటీలోని 17వ వార్డులో చేనేత కుటుంబం 31-01-2022 వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. భార్య నాగ లీలావతి(45), కుమారుడు రాజా నాగేంద్ర(24) తో కలిసి కాశం పద్మనాభం(52) ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి నిజానిజాలను తెలుసుకునేందుకు టీడీపీ తరపున ఐదుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు.

ఆర్థికంగా చితికి పోవడంతో పాటు…..తమ కుటుంబం ఆధారపడిన చేనేత వృత్తి కి ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. స్థానికంగా కొందరి వద్ద రెండు లక్షలు అప్పు చెయ్యగా…వడ్డీతో కలిపి ఆ అప్పు 4.5 లక్షలకు చేరిందని….ఆమొత్తం కట్టాలని ఒత్తిడి చేశారు.ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక తీవ్ర మనోవేధనతో పద్మనాభం కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య కు పాల్పడ్డారు. చనిపోయిన పద్మనాభం మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తి, కళాకారుడు.ప్రభుత్వం నుండి మగ్గాలకు సబ్సీడీలు, వడ్డీ లేని రుణాలు అందకపోవడంతో అప్పులు పెరిగి ఆత్మహత్య చేసుకున్నారని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకునే చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని నివేదికలో స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో చేనేత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు కమిటీ అభిప్రాయ పడింది. టిడిపి నిజనిర్థారణ కమిటీలో పార్టీ నేతలు అనగాని సత్య ప్రసాద్, అంగర రామ్మోహన్ రావు, గంజి చిరంజీవి, ఎంఎస్ రాజు, వావిలాల సరళాదేవి ఉన్నారు.

Leave a Reply