తెదేపా అనుభవం, జనసేన యువరక్తం కలిస్తే అద్భుత పరిపాలనన్న పవన్ కళ్యాణ్
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై 20201 డిసెంబర్ 9వ తేదీన ఎఫ్ ఐ ఆర్ నమోదు
ఆ ఎఫ్ ఐ ఆర్ ప్రకారమే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు
ఎప్పుడు జరిగిందన్నదే ముఖ్యమనుకొని… కేసు ఎప్పుడు పెట్టారో పట్టించుకోక…
సుప్రీంకోర్టు తీర్పులు చూసి నాలిక కర్చుకుని ఇప్పుడు కోర్టు ముందు కొత్త కహానీలు చెప్పే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ తరపు న్యాయవాదులు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెడన బహిరంగ సభలో చెప్పిన రూపాయ పావలా కథ మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు విమర్శించారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తన చిన్నతనంలో నెల్లూరులో వీధిలో బొమ్మలను విక్రయించే ఓ బొమ్మల వ్యాపారి… ఏ బొమ్మ కొనుగోలు చేసినా రూపాయ పావులానే అని చెప్పడం తో, ఆ మాటలు విన్న చిన్నారి పవన్ కళ్యాణ్ , తన తల్లి వద్ద వెళ్లి రూపాయి పావలా అడుక్కొని బొమ్మలు విక్రయించే వ్యక్తి వద్దకు వెళ్ళాడట..అందులోనున్న పెద్ద బొమ్మను చూపించగా, అది ఇవ్వాలని కోరగా ఆ బొమ్మ నాలుగు రూపాయలని సదరు వ్యాపారి చెప్పడంతో అవాక్కైన పవన్ కళ్యాణ్.. అదేంటి ఏ బొమ్మైనా రూపాయ పావలానే అని అన్నావు కదా అని ప్రశ్నించారట .
సదరు వ్యాపారి అవును బాబు… నేను రూపాయ పావలా అని అనకపోయి ఉంటే… నువ్వు వచ్చి ఉండేవాడివి కాదు కదా? అంటూ పవన్ కళ్యాణ్ ను ఎదురు ప్రశ్నించారట. తన తండ్రి ముఖ్యమంత్రిగా కొనసాగిన హయాంలో 43 వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాలు పాల్పడి జైలు జీవితాన్ని గడిపిన జగన్మోహన్ రెడ్డి, తాను ముఖ్యమంత్రి అయ్యాక లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అందరూ ఆరోపిస్తుంటే ఆయన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ రూపాయ పావలా ముఖ్యమంత్రి అని అన్నారంటే దాని వెనుక ఎంతో పరమార్థం ఉంటుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి నాలుగు దఫాలలో మద్యనిషేధం అమలు చేస్తానని చెప్పి… ఇప్పుడు మధ్య నిషేధం గురించి ప్రశ్నిస్తే నేను అలా చెప్పి ఉండకపోతే, మీరు ఓటు వేసి ఉండేవారు కాదు కదా? అని పవన్ కళ్యాణ్ చెప్పిన రూపాయ పావలా కథను గుర్తు చేస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు. ఇలా మహిళలను మోసగించిన జగన్మోహన్ రెడ్డి, వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మూడు నుంచి నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులను వారి కుటుంబ సభ్యులను మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నారు.
ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన రూపాయల స్టోరీ మాదిరిగానే ఉంది. తాత్కాలిక ఉద్యోగులు ఏమైనా తక్కువ పని చేస్తున్నారా?, అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని పర్మినెంట్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం అచ్చం పవన్ కళ్యాణ్ చెప్పిన రూపాయల స్టోరీ లాగే ఉంది. ఆడపడుచులకు 30 లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఆ తరువాత మీరే కట్టుకోండి అని అన్నారు.
కట్టుకోకపోతే ఇచ్చిన సైట్ లాగేసుకుంటామని చెప్పారు. 30 లక్షల ఇండ్లు కాదు కదా మూడు వేల ఇండ్లు కూడా రాష్ట్రంలో నిర్మించలేదు. ఈ విషయం నేను చెప్పడం కాదు. గత ఆరు నెలల క్రితం పార్లమెంటులోనే ఏపీ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది కేవలం 2000 ఇండ్లు మాత్రమేనని ప్రకటించడం జరిగింది. రాజమండ్రిలో ఇళ్ల స్థలాల కేటాయింపులో స్థానిక నాయకులు 120 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. తాటి చెట్టు అంత లోతైన భూముల్లో ఇళ్ల స్థలాలను కేటాయించి, వాటిని పూడ్చడానికి మరో 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడాలని చూస్తున్నారు.
షాదీ ముబారక్, కళ్యాణమస్తు పేరిట గత ప్రభుత్వ హయాంలో పెళ్లి చేసుకున్న కొత్త జంటకు 50 వేల రూపాయలు వెంటనే అందజేసేవారు. కానీ 50 వేల రూపాయల్లో పెళ్లి ఎలా చేసుకుంటారని, లక్ష రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్ల వరకు పత్తా లేకుండా పోయారు. నాలుగేళ్ల తర్వాత పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి పెళ్లికూతురు, కుమారుడు పదవ తరగతి ఉత్తీర్ణులయితేనే వారికి కళ్యాణమస్తు, షాదీ ముబారక్ పథకాల ద్వారా లక్ష రూపాయల లబ్ధి చేకూరుతుందని కొత్త కండిషన్ పెట్టారు.
తన మంత్రివర్గంలో ఐదు, ఆరవ తరగతి చదివిన వారిని మంత్రులుగా చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి, పదవ తరగతి పాస్ అయితేనే, ప్రభుత్వ పథకాన్ని అందజేస్తామని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. పెడనలో స్థానిక ఎమ్మెల్యేకు పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరిక చేశారు. తప్పులు చేస్తున్నావు… మా ప్రభుత్వం వచ్చాక ఉపేక్షించేది లేదని గట్టి డోస్ ఇచ్చారు. అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టిడిపి, జనసేన కూటమి అవసరం ఎంతో ఉంది.
జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవలసిన ఆవశ్యకత ఉందన్న పవన్ కళ్యాణ్, టిడిపికి ఎంతో అనుభవం ఉంది. జనసేనకు యువ రక్తం ఉంది. అనుభవం, యువరక్తం కలిస్తే అద్భుత పరిపాలన వస్తుందన్న పవన్ కళ్యాణ్ మాటలు అక్షర సత్యాలని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. టిడిపి, జనసేన కూటమి రానున్న ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని నేను గత ఏడాదిన్నరగా చెబుతూ వస్తున్నాను.
ఈ రెండు పార్టీలతో కలిసి మూడవ పార్టీ కూడా వస్తుందని చెప్పాను. కానీ మా పార్టీ నాయకులు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని… అది మేనేజ్ చేశాం, ఇది మేనేజ్ చేశామని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు వారికి తగిన శాస్తి జరగబోతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
నోటుకు ఓటును విక్రయించడం నేరం…
ఎన్నికల సమయంలో వెయ్యి రూపాయలు తీసుకొని ఓటును అమ్ముకోవడం… తిరిగి రాజకీయ నాయకులు నిజాయితీగా ఉండాలని కోరుకోవడం సరైన విధానం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు నిజాయితీగా ఉన్నప్పుడే, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు వెలుగులోకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి దోచేసిన సొమ్ముతో ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేస్తారు.
జగన్మోహన్ రెడ్డి మాదిరిగా నేను డబ్బులు పంచలేను. ప్రజలు విశ్వసించి ఓట్లు వేసి ఆశీర్వదిస్తే మా కూటమి బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తుందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తనకెంతో నచ్చాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. నేను కూడా గతంలో ఎన్నోసార్లు ఇదే విషయాన్ని చెప్పాను. నోటుకు ఓటు అమ్ముకోవడం నేరం. ఈ నేరానికి ప్రజలు పాల్పడవద్దని కోరుతున్నాను. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటుకు 2000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తాడు. నరసాపురం పార్లమెంటరీ స్థానంలో ఓటుకు 5000 రూపాయలు కూడా ఇస్తాడేమో.
ఎందుకంటే నన్ను, జగన్మోహన్ రెడ్డి తన ప్రధాన శత్రువుగా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్ద నుంచి దోచుకున్న సొమ్ము ఇస్తే తీసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ డబ్బులు తీసుకొని ఓటు వేయడం నేరం. 2000 తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే… మీ ఐదేళ్ల జీవిత కాలానికి మీరిచ్చుకునే విలువ అంతేనా ? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో నాసిరకమైన మద్యం విక్రయించడం వల్ల ఒక కుటుంబం ఏడాదికి రెండున్నర లక్షల రూపాయలు నష్టపోతుంది. ఎంతోమంది మగవలు విధవలు అవుతున్నారు.
నాసిరకమైన మద్యం సేవించి మద్యపాన ప్రియులు అవయవాలు చెడిపోయి ఆస్పత్రి పాలవుతున్నారు. ఆరోగ్యశ్రీ ఎప్పటికి వస్తుందో తెలియదు. ఆసుపత్రుల ఖర్చే లక్షల రూపాయలు భరించాల్సి వస్తుంది. నాసిరకమైన మద్యం కాకుండా నాణ్యమైన మద్యాన్ని అందించడం ద్వారా మద్యపాన ప్రియుల ఆయురార్ధం మరో 15 ఏళ్ల పాటు పెంచే ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. మీ జీవితానికి మీ రిచ్చుకునే విలువ 2000, నరసాపురం పార్లమెంటరీ ప్రజలైతే ఐదు వేలేనా?, సమిష్టిగా ప్రజల నుంచి ఈ దుష్ట పాలకులు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారో గ్రహించాలి.
ఓటు విలువను తెలుసుకోవాలని ఎన్నికల కమిషన్ పదేపదే చెబుతుంటే… కొంతమంది ఓటుకు రేటు ఎంత అని అనుకుంటున్నారు. ఓటు విలువ అంటే ప్రజలు తీసుకునే నిర్ణయం వల్ల రాష్ట్ర భవిష్యత్తు తో పాటు తమ పిల్లల, వారి పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండాలని కోరుకోవాలని దానర్థమని రఘురామ కృష్ణంరాజు చెప్పారు . ప్రజల నుంచి డబ్బులు కొట్టేసిన వ్యక్తులు రానున్న ఎన్నికల్లో ఓటుకు రెండు వేల రూపాయలు, నరసాపురం పార్లమెంటరీ పరిధిలో ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేసే ప్రయత్నాన్ని చేస్తారని, కానీ ఓటును అమ్ముకోవద్దని ప్రజలకు పవన్ కళ్యాణ్ చక్కటి సందేశాన్ని ఇచ్చారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఆ స్థానాన్ని ఏ పార్టీకి కేటాయిస్తే, ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తెలిపారు.
ఏసీబీ న్యాయస్థానంలోనే చంద్రబాబు నాయుడుకి ఉపశమనం లభిస్తుందన్న ఆశాభావం నాకుంది
ఏసీబీ న్యాయస్థానంలోనే తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి ఉపశమనం లభిస్తుందన్న ఆశాభావం తనకు ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఏసీబీ న్యాయస్థానంలో ఉపశమనం లభించకపోతే, ఈనెల 9వ తేదీన సుప్రీం కోర్టులో అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన ప్రకారం కచ్చితంగా ఉపశమనం లభించి తీరుతుందని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు పై మోపిన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులలో ఆయనకు ఒకటి రెండు రోజుల వ్యవధిలో ముందస్తు బెయిల్ లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ రెండు కేసులలో నిందితులుగా పేర్కొన్న ఇతర వ్యక్తులకు ఇప్పటికే న్యాయస్థానాలు ముందస్తు బెయిల్ మంజూరు చేశాయని గుర్తు చేశారు. న్యాయాన్ని చంపాలని ఎంతగా ప్రయత్నించినా, ఆలస్యం జరగవచ్చు కానీ న్యాయం బ్రతికే ఉంటుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . లేని ఇన్నర్ రింగురోడ్ అలైన్మెంట్ మార్చారని చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేశారు సరే…ఉన్న రాజధాని అమరావతిని లేపేసిన వ్యక్తిపై కేసులు ఉండవా? అంటూ నా స్నేహితుడు ఒకరు ప్రశ్నించారు.
అవును… ఇది నిజమే కదా అని నాకు అనిపించింది. ఈ విషయాన్ని విజ్ఞులైన ప్రజలు తమ స్నేహితులు, బంధువులతో చర్చించి ఒక నిర్ణయానికి రావాలి. విశాఖపట్నం పాలెగాని గా గతం లో వ్యవహరించిన మా పార్టీలో నెంబర్ 2నో, A2 నో తెలియదు కానీ సదరు వ్యక్తి విశాఖలో అనేక భూములను కబ్జా చేశారు. కొన్ని బలవంతంగా కొనుగోలు చేశారు. ఇంత చేసి ఇప్పుడు విశాఖపట్నం రాజధాని అని అంటున్నారు. మరి ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందే కేసు నమోదన్నారు… కానీ 2021 డిసెంబర్ 12వ తేదీన ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు
స్కిల్ డెవలప్మెంట్ స్కీం కేసును అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందే నమోదు చేయడం జరిగిందని సుప్రీంకోర్టులో సిఐడి తరఫున వాదనలను వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, సెషన్ కోర్టులో వాదనలను వినిపిస్తున్న ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెబుతున్నారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2021 డిసెంబర్ 9వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఎఫ్ ఐ ఆర్ ప్రకారమే తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న కే. అజయ్ రెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 29/2021 ని డిసెంబర్ 9వ తేదీ 12 గంటలకు నమోదు చేశారని సందర్భంగా ఎఫ్ఐఆర్ కాపీని ఆయన మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు.
ఎఫ్ఐఆర్ కాపీని ఏసీబీ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకపోతే, సుప్రీం కోర్టు కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ 2016 -17 లో అమలు జరిగింది కాబట్టి, ఎప్పుడు జరిగిందనేది పాయింట్ తప్ప… ఎప్పుడు కేసు పెట్టామన్నది పాయింట్ కాదని వారు అనుకొని ఉంటారు . సుప్రీం కోర్టు తీర్పులను పరిశీలించాక నాలుక కరుచుకొని ఇప్పుడు అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందే కేసులు పెట్టామని కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో సిబిఐ సూచనల మేరకు ఏసీబీ అధికారులు నిర్వహించిన ప్రాథమిక విచారణ నివేదిక కూడా అందిందని చెబుతున్నారు. అయితే, సుప్రీంకోర్టు ధర్మాసనం లలిత కుమారి కేసు లో ఇచ్చిన తీర్పు ప్రకారం వారం రోజులలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. వారం కాకపోతే మూడు వారాలలోనైనా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి ఉండాలి కదా?. మూడు వారాలు కాదు మూడేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటే కుదరదు. ఒకవేళ అప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉంటే, విచారణ ఆలస్యం అయ్యిందేమోనని భావించే అవకాశం ఉండేదన్నారు.
ఎన్టీవీ, టీవీ9పై చర్యలు ఉండవా… సుధా? కేవలం టీవీ 5, ఏబీఎన్ పైనే చర్యలా?
ఏసీబీ న్యాయస్థానంలో సిఐడి తరఫున వాదనలను వినిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పదే పదే చెప్పిన విషయమే చెబుతుంటే, న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసి ఉండవచ్చునని రఘురామకృష్ణం రాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే, దాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయమేనని పేర్కొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసి ఉండవచ్చు.
ఇదే విషయం తొలుత ఎన్టీవీ, టీవీ9 లో స్క్రోలింగ్ వేశారు. ఆ తరువాత అదే విషయాన్ని టీవీ5, ఏబీఎన్ లో కూడా స్క్రోలింగ్ వేశారు. టీవీ5, ఏబీఎన్ లో వచ్చిన స్క్రోలింగ్ చూసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియా ఎదుట స్పందించిన వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, జగ్గయ్య, కమల్ హాసన్, తమిళంలో శివాజీ గణేషన్ వంటి ఎంతోమంది మహానటులను నేను చూశాను.
90 సెకండ్ల వ్యవధిలో సుధాకర్ రెడ్డి వీరందరినీ మరిపించే విధంగా నటించారు. ఒక్కొక్క పదం పలకడంలో జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీఆర్ ను తలపించగా, స్టైలిష్ గా మాట్లాడడంలో ఏఎన్ఆర్ ను గుర్తు చేశారు. పెడ బొబ్బలు వేయడంలో శివాజీ గణేషన్ ను, జగ్గయ్యను గుర్తు చేస్తే… వాగ్దాటిలో ఎస్వీఆర్ ను మరిపించారు. రేపో మాపో ఈ ఈ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోవడం ఖాయం.
అప్పుడు సుధాకర్ రెడ్డి కి ఎవరు బిజినెస్ ఇస్తారని భావిస్తున్న తరుణంలో, తనలోని నటుడిని టీజర్ ద్వారా దర్శక నిర్మాతలకు పరిచయం చేశారు. తెలుగు చిత్ర రంగంలో జయప్రకాశ్ రెడ్డి మరణం తరువాత ఆయన స్థానం భర్తీ చేసే నటుడు లేకుండా పోయారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆస్థానాన్ని చక్కగా భర్తీ చేయగలరు. జగన్మోహన్ రెడ్డి జీవిత గాధ ఆధారంగా రాంగోపాల్ వర్మ వ్యూహం, శపథం అనే చిత్రాలను రూపొందిస్తున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి జీవిత గాధ ఆధారంగా ప్లీడర్ పొన్నవోలు, సొలిసేటర్ సుధాకర్ అని రెండు పార్ట్లుగా సినిమా తీయవచ్చు.
గతంలో సుధా, సంజులు వీధి ప్రదర్శనలు చేశారు. వారి వీధి ప్రదర్శన అదిరిపోయింది. గతంలో నాపై కేసు నమోదు చేసినప్పుడు ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో పిచ్చిపిచ్చిగా మాట్లాడితే, న్యాయమూర్తి హెచ్చరికలు చేసిన మాట నిజం కాదా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. గతంలో సుధాకర్ రెడ్డి ని న్యాయమూర్తి హెచ్చరించగా పత్రికల్లో అచ్చయిన వార్తా కథనాన్ని ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు.
న్యాయస్థానంలో జరిగిన విషయాన్ని ఎన్టీవీ, టీవీ9 తొలుతకు స్క్రోలింగ్ వేయగా, కేవలం టీవీ 5 ఏబీఎన్ పైనే చర్యలు తీసుకుంటానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2018లో నే స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కామ్ పై కేసు నమోదు చేసినట్లయితే , ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదని… ఇదే విషయంపై సాక్షితోపాటు ఇతర బ్లూ చానల్స్ లో సుధాకర్ రెడ్డి తో డిబేట్ తాను సిద్ధమని రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు.