ప్రభుత్వ పాఠశాలలలో కొంతమంది విద్యార్థులు అడిగే ప్రశ్నలు గొప్ప గొప్ప శాస్త్ర వేత్తలని తలపిస్తాయి. అలా ఒక ఉపాధ్యాయుడి Service లో ఎదురైన సంఘటనల ఆధారంగా విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలు మీ ముందు:
చంద్రునిపై కాలుమోపడం నిజమే అని నేను నమ్మాను. అయిదో తరగతిలో ఈ వార్త చదివి విన్పిస్తే… పిల్లలంతా ఆశ్చర్యంగా నమ్మారు. ఒక్క.. సతీష్ గాడు తప్ప… నమ్మిన మిగతా పిల్లలందర్నీ జాలిగా చూసాడు . నన్నూ, పేపర్ లోని అమెరికా వాళ్లు దిగిన చంద్రమండలం బొమ్మని మార్చి మార్చి చూసాడు. కొంచెం సేపు వాడి చూపులు నన్ను కలవర పెట్టాయి.
‘నీ డౌట్ ఏంట్రా… అమెరికా వాళ్లు ఖచ్చితంగా చంద్రమండలానికి వెళ్లి వచ్చారు. అదే ఈ వార్త’ అన్నాను. “నేను నమ్మట్లేదు సార్…” అన్నాడు ధృడంగా… “ఎందుకురా… నువ్వేమైనా చూసొచ్చావా” అన్నాను కోపంగా. ప్రపంచమంతా ఒప్పుకుంటుంటే… వీడేంటి అన్న అసహనం పుట్టుకొచ్చింది. “ చంద్రమండలం మీద గాలి లేదన్నారు కదా సార్… మరి అమెరికా వాళ్ల జెండా ఎలా రెపరెపలాడుతుంది?” అన్నాడు. ఖంగుతిన్నాను…
వాడి ప్రశ్న వందలాది వేట కొడవళ్లు గా మారి… అమెరికా వైపు దూసుకెళ్తున్నట్టు… అగ్రరాజ్యాన్ని నిలదీస్తున్నట్టు… కలవర పెట్టింది. వాడి మొహంలో చిద్విలాసం.
నిజమే . ఇప్పుడు నాకూ నమ్మకం కలగట్లేదు…..
ఇరవై ఏళ్ల లో ఎన్ని బదిలీలైనా…. ఏ వూరికెళ్లినా ఆ ప్రశ్నలు వెంటాడుతాయి. ప్రశ్న వేసిన ఆ పిల్లల మొహాలు మర్చిపోలేనంతగా వేటాడుతాయి. పదేళ్లకింద చర్లపల్లె స్కూల్లో అలాంటి ప్రశ్నే ఎదురైంది…
నా ప్రశ్న వేసిన నాలుగో తరగతి చదివే రమేష్ గాడి మొహం ఇప్పటికీ మనసులోంచి చెక్కు చెదరలేదు.
అప్పట్లో నాలుగో తరగతి తెలుగు వాచకంలో ‘ ‘కల్పవృక్షం’ అనే పాఠం వుండేది. తాటిచెట్టు కల్పవృక్షం లాంటిది. తాటికమ్మలు గుడిసె వేసుకోవడానికి… తాటి ముంజలు తినడానికి… తాటి దోనెలు నీరు పారించుకోవడానికి… ఇలా తాటిచెట్టులోని ప్రతీది మనిషికి పనికొస్తుంది. ఇలా అడిగిందల్లా ఇస్తుంది కాబట్టి తాటిచెట్టును కల్పవృక్షంతో పోల్చారు… అంటూ పాఠాన్ని వివరించినప్పుడు… చెబుతున్నంత సేపూ… రమేష్ గాడి మొహం చిన్నబోయింది. వాడి కళ్ళల్లో తడి… నేను అబద్దం చెప్తున్నట్టు కోపం…
నాకేమి అర్ధం కాలేదు… “రమేష్… ఏమైందిరా…” అనడిగాను.
“మా అయ్య రోజూ తాటికల్లు తాగొచ్చి అమ్మనూ, నన్నూ, తమ్మున్ని బాగా కొడతాడు.. తాటిచెట్టు మంచిదెట్లయితది సార్…”
వాడి ప్రశ్నకి… షాక్ తిన్నాను. నన్నే కాదు… విద్యావ్యవస్థనే ప్రశ్నించినట్లుంది వాడి ప్రశ్న. నిజానికి తాటిచెట్టు పాఠంలో ‘కల్లు’ ప్రస్తావన ఎక్కడా రాలేదు. తాటిచెట్టు కల్పవృక్షంతో పోల్చదగిందేనా…
వాడికి నేను సమాధానం చెప్పాలి.
ఏం చెప్పాలి…???
చివరకు “తాటికల్లు మంచిదేరా… కాకపోతే ఓ కప్పుగాని, అరకప్పు గాని తాగితే మంచిది… కాని మీ నాన్న కుండల కొద్దీ తాగుతాడు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు…” అంటూ ఇంకొంచెం విపులంగా చెప్పాను. అయినా నా సమాధానం వాన్ని సంతృప్తి పర్చలేదు. అంతకు మించి చెప్పడానికి నాక్కూడా ఏం తోచలేదు. వాడు అయిష్టంగానే కూచున్నాడు. వాడి ప్రశ్న ఇప్పటికీ ఇలా వెంటాడుతూనే వుంటుంది.
సుజాత టీచర్ ఓరోజు మూడో తరగతిలో బాతు బంగారు గుడ్డు పాఠం చెప్పింది. ఒక బాతు రోజూ బంగారు గుడ్లు పెడుతుంటే… ఆత్యాశతో దాన్ని కోసి…
యజమాని భంగపడ్డాడని అనే పాఠ్యాంశాన్ని చెప్పింది.
తీరా ఒక పిల్లాడు వేసిన ప్రశ్నకి ఆమెకు చిర్రెత్తుకొచ్చి వాడి వీపు బద్దలు చేసింది. ఇంతకీ వాడు అడిగింది ఏమిటంటే….
“ బాతుని కోస్తే తప్పేంటి టీచర్… బాతు కడుపులో గుడ్డు తయారవుతుంది కాని… బంగారం తయారు కాదు గదా… అందుకే బాతుని కోసి చూసాడేమో టీచర్… యజమాని తప్పేంటీ? కాదంటారా?” అనడిగాడు.
ఈ మధ్య మా స్కూళ్ళ లోI ‘నిజాయితీ పెట్టె’ లు పెట్టాలని విద్యాశాఖ సూచించింది. ఏ పిల్లవాడికైనా ఏదైనా దొరికితే దాంట్లో వేయాలి. టీచర్ దాన్ని తీసి అది పోగొట్టుకున్న పిల్లలకి అందజేస్తాడు. ఇది పిల్లల్లో నిజాయితీని పెంచుతుంది. పిల్లలు కూడా ఏవి దొరికినా ఉత్సాహంగా దాంట్లో వేస్తున్నారు. మొన్నీమధ్య ‘ తిరుపతి నా పెన్ను దొంగతనం చేసాడు సార్’ అంటూ రాధిక అనే అమ్మాయి నాకు కంప్లయింట్ చేసింది.
“అవును… వాడు పెన్ను దొంగతనం చేసాడు సార్..” అంటూ పిల్లలందరూ చెప్పారు.
తిరుపతి గాడిని పిలిచి అడిగితే మౌనంగా వుండిపోయాడు. వాడి బ్యాగ్ తీసి పుస్తకాలు బయట పడేసి వెతికినా దొరకలేదు. చివరికి గట్టిగా అడిగితే… నేనే తీసాను అని ఒప్పుకున్నాడు. “ఎక్కడ దాచావురా” అని అడిగితే… నిజాయితీ పెట్టిని చూపించాడు. నాకు ఆశ్చర్యమేసింది.
పెట్టెని తెరచి చూస్తే… రాధిక పెన్ను అందులో వుంది.
“దాంట్లో ఎందుకు వేసావురా?” అనడిగాను.
“రోజూ అందరికీ ఏవేవో దొరుకుతున్నాయి. పెట్టెలో వేస్తున్నారు. నాకేం దొరకట్లేదు… అందుకే పెన్ను తీసి అందులో వేసాను” అని చెప్పాడు. నాకు బుర్ర తిరిగిపోయింది.
పిల్లలందరిలోను ఒకటే ప్రశ్న…
తిరుపతి దొంగనా… నిజాయితీ పరుడా…
దొంగతనం చేసాడు కాబట్టి… దొంగే కదా సార్… అన్నారు కొందరు. పెట్టెలో వేసాడు కాబట్టి నిజాయితీ పరుడే కదాసార్… అని మరి కొందరు పిల్లలు వాదించారు.
చివరికి వాడు నిజాయితీ పరుడే అని వాళ్లని సమాధాన పర్చడానికి ఒక పీరియడ్ అయిపోయింది.
ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నలకి సమాధానం దొరక్క చాలా మంది టీచర్లు సహనం కోల్పోతారు.
ముఖ్యంగా తరగతి గదిలో దొంగతనం, కులం ఈ రెండు ఉద్రిక్తతని సృష్టిస్తాయి. అలాగే కులం ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాకు వేదవతి అనే పాప గుర్తిస్తుంది. శ్రీరాములపల్లె స్కూల్లో పని చేసేటప్పుడు… మధ్యాహ్న భోజనం సమయంలో ప్రతి మంగళవారం ఉడకబెట్టిన కోడిగుడ్డు పెట్టేవాళ్లం.
మూడో తరగతి చదివే వేదవతి అనే పాప మాత్రం తన ప్లేటులో వేసిన గుడ్డుని టీచర్లు చూడకుండా వేరే పిల్లలకి ఇచ్చేది. ఓసారి అది గమనించిన నేను హెడ్ మాస్టర్ కి చెప్పాను. ఆయన పాపని పిలిచి గుడ్డు తింటే గుండెకు బలం వస్తుందని బుజ్జగించి మరీ మరీ చెప్పటంతో చాలా ఇష్టంగా కోడిగుడ్డు తింది.
ఆ తర్వాత వేదవతి నాల్రోజుల వరకూ పాఠశాలకు రాలేదు. అనుమానంతో నేనూ, హెచ్.ఎం. కల్సి వాళ్లింటికి వెళ్లాం. మమ్మల్ని చూడగానే వాళ్లమ్మ దాడి చేసినంత వేగంగా కయ్యానికి దిగింది.
“మేం బ్రాహ్మలం… మా పాపచేత కోడిగుడ్డు తినిపిస్తారా… మీ స్కూల్ కి నా బిడ్డని చస్తే పంపించం.” అంటూ గొడవ పడింది. గుడ్డు తిన్న పాపానికి వేదవతిని బాగా కొట్టినట్టుంది. జ్వరంతో పడుకుంది. మమ్మల్ని చూడగానే భయంగా…. నీరసంగా లేచి నిల్చుంది.
కోడిగుడ్డు శాఖాహారమే అంటూ మహాత్మగాంధీ చెప్పిన మాటలు కూడా ఆమె దగ్గర ఏం పని చెయ్యలేదు. చివరికి పాప చదువు పాడైపోతుందని, కోడి గుడ్డు తనకి పెట్టించమని మేం హామీ ఇచ్చాక గానీ బడికి పంపడానికి ఒప్పుకోలేదు.
వేదవతి జ్వరంతోనే మర్నాడు స్కూల్ కొచ్చింది. వేదవతి మెల్లిగా తలొంచుకొని నా దగ్గర కొచ్చింది.
“హోం వర్కు చేసావా?” అనడిగాను.
మాట్లాడలేదు… నిమిషం సేపు నిశ్శబ్దంగా నా కళ్లలోకి సూటిగా చూస్తూ… “ మేమెందుకు కోడిగుడ్డు తినకూడదు సార్?” అనడిగింది.
ఎవరో గుండెమీద సర్రున చరిచినట్లయింది నాకు… ఆ ప్రశ్నకు ఏ సమాధానం లేదు నా దగ్గర…
ఇంట్లో స్వేచ్చని చంపే ఆచారాలు బడిలో కూడా ఎంతగా ప్రభావం చూపిస్తాయో వేదవతి ప్రశ్న నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది.
“దానికి బదులు నీకు అరటిపండు తెప్పిస్తాను సరేనా” అని భుజం తట్టి పంపించాను.పిల్లల ప్రశ్నలకు మనసంతా నమ్మకం నిండేలా జవాబు చెప్పకపోతే ఏదో వెలితిగా వుంటుంది. వాళ్ల అనుమానంలోంచి పుట్టే ప్రశ్నకి రాగద్వేషాలుండవు.
సినారేకి జ్ఞానపీఠం అవార్డు వచ్చాక చాలామంది పండిత పామరులు రకరకాల ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేసారు. ఓసారి స్కూల్ పిల్లలు కూడా ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు.. మేధావులెవరూ అడగని ప్రశ్న ఒక పాప అడిగింది.
‘ మీ పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి కదా. మరి మీ పేరు ముందు ‘ఎస్’ రావాలిగాని సి’ ఎలా వస్తుంది?” అని.
ఆయన ఆశ్చర్యపోయారట… ఇప్పటివరకూ ఎవరూ అడగని ప్రశ్న… “పదో తరగతి మార్కుల మెమోలో ‘ఎస్’కి బదులు ‘సి’ అనీ పడిందమ్మా అప్పట్నించి సి. నారాయణరెడ్డి అనే పిలుస్తున్నారు’ అని నవ్వేసారట.
తరగతి గది లోపల పుట్టే ప్రశ్నలో నిజాయితీ వుంటుంది. సమాధానం కూడా అంతే నిజాయితీగా లేనప్పుడు రానురాను వాళ్లు ప్రశ్నలు వేయటం మానుకుంటారు. ప్రశ్నించే స్వేచ్చని పాఠశాలల్లో బాగా విస్తరిస్తే ప్రతి పాఠ్యాంశం గురించి మేమంతా హోంవర్క్ చేసుకోవాల్సిందే…
ఆలోచించు.
….. ఒక గురువు
శారద మాచిరాజు