-దారి పొడవునా నీరాజనాలు
-మువ్వన్నెల జెండాల రెపరెపలు
-రూ. 125 కోట్ల నజరానా
-సంబురంగా ‘విక్టరీ పరేడ్’
ముంబై: జగజ్జేతలుగా స్వదేశంలో అడుగు పెట్టిన భారత జట్టుకు అపూర్వ స్వాగతం లభిస్తోంది.. ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ కన్నుల పండువగా సాగుతోంది. అశేషమైన అభిమానులు దారి పొడవునా నీరాజనాలు పలుకుతూ.. ‘జయహో టీమిండియా’ నినాదాలతో భారత క్రికెటర్ల మీద అభినందల వర్షం కురుపిస్తున్నారు. మువ్వన్నెల జెండాలు చేతబూని ‘ఈ విజయం చారాత్రాత్మకం’ అంటూ రోహిత్ సేన ఘనతను కీర్తిస్తున్నారు.
అనుకున్న సమయం కంటే ఆలస్యంగా పరేడ్ మొదలైనా సరే.. కొంచెం కూడా అలసట లేకుండా ‘ఇండియా.. ఇండియా’.. ‘కోహ్లీ.. కోహ్లీ’.. ‘రోహిత్.. రోహిత్’.. నినాదాలతో మరైన్ డ్రైవ్‌కు జోష్ తెస్తున్నారు. అభిమానుల మద్దతు, ప్రేమకు ఫిదా అయిపోయిన భారత ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీని చూపిస్తూ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు.
ఇసుకేస్తే రాలనంత మంది జనంతో టీమిండియా విజయోత్సవ ర్యాలీ వాంఖడే స్టేడియం వైపు వెళ్తోంది. దారి కిరువైపులా సైన్యంలా నిలబడిన ఫ్యాన్స్ క్రికెటర్లను కెమెరాలో బంధిస్తూ.. సెల్ఫీలు దిగుతూ ఫ్యాన్స్ మురిసి పోతున్నారు. ముంబై పోలీసుల భారీ భద్రత నడుమ ర్యాలీ ప్రశాంతంగా సాగింది.
వాంఖడే స్టేడియానికి చేరుకున్నాక అక్కడ భారత క్రికెట్ బోర్డు (BCCI) వరల్డ్ కప్ విజేతలను ఘనంగా సత్కరించింది. అంతేకాదు, ఈ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జగజ్జేతలకు రూ. 125 కోట్ల నజరానా
టీ20 ప్రపంచ కప్ సాధించిన జగజ్జేతలకు ముంబయి సముద్ర తీరంలో క్రీడాభిమానులు నీరాజనాలు పలికారు. ఓపెన్ టాప్ బస్ పై ఆటగాళ్లు అభివాదం చేస్తూ ముందుకు సాగగా.. వారికి బ్రహ్మరథం పట్టారు. నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ పరేడ్ సాగింది. అనంతరం బీసీసీఐ క్రీడాకారులను సన్మానించి, రూ. 125 కోట్ల నజరానా అందించింది.