– రాష్ట్ర పురపాలక శాఖ 9 ఏళ్ల నివేదికను విడుదలలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : పట్టణాల కోసం నిబద్దతతో పనిచేశాం కాబట్టే కేంద్రం కూడా గుర్తిచాల్సిన పరిస్థితి కల్పించామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్‌లో బుధవారం ఆయన రాష్ట్ర పురపాలక శాఖ 9 ఏళ్ల నివేదికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందువల్లే అనేక అవార్డుల, ప్రశంసలను ప్రత్యర్ధి అయిన కేంద్రంలోని ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి వచ్చిందన్నారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌కు చెక్ పెడుతూ ప్రజలకు భద్రత కల్పించేందుకు స్కై వేలు, ఫ్లైఓవర్లు నిర్మించేందుకు తాము రక్షణ శాఖ భూములను అడిగిన కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో సుమారు 45 నుంచి 50 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకే హైదరాబాద్ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో ప్రజారవాణాను మెరుగుపర్చడం, మెట్రో విస్తరణ, బస్సుల ఎలక్ర్టిఫికేషన్, పాతబస్తికీ మెట్రో కనెక్టివిటీ, భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా, నాలాల మరమత్తు కార్యక్రమాల వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. పాతబస్తీ మెట్రో రైల్ కోసం కేంద్రాన్ని నిధులను అడిగామని, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.