Home » బియ్యం కొనుగోలులో తెలంగాణ సర్కారు పూటకో నాటకం:విజయశాంతి

బియ్యం కొనుగోలులో తెలంగాణ సర్కారు పూటకో నాటకం:విజయశాంతి

బియ్యం కొనుగోలు విషయంలో తెలంగాణ సర్కారు పూటకో నాటకం ఆడుతూ కేంద్రంపైనా… బీజేపీ నాయకత్వం పైనా నిందలు వెయ్యడమే పనిగా పెట్టుకుంది. ముఖ్యంగా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) కొనుగోలు అంశంలో కేంద్రంపై టీఆరెస్ నేతలు, మంత్రులు దుష్ప్రచారం చేస్తునే ఉన్నారు. పలు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉన్నందున సూక్ష్మ పోషకాలు (ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ – ఎఫ్ఆర్‌కే) కలిపిన ఉప్పుడు బియ్యాన్ని నెలకు 5 లక్షల టన్నులు ఇచ్చినా కొంటామని ఎఫ్‌సీఐ తెలంగాణ జీఎం స్పష్టం చేసినప్పటికీ తెలంగాణ సర్కారులో ఆశించిన కదలిక లేదు.
అక్టోబర్ నెలాఖరు నాటికి ఉన్న పరిస్థితి గమనిస్తే… మొత్తం 44.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి పంపాల్సి ఉండగా అందులో సగమే పంపారు. ఎఫ్‌సీఐ ఈ ప్రకటన వచ్చి 3 వారాలు దాటింది. ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరాకు తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలేంటో గణాంకాలతో సహా చెప్పాలి. మరోవైపు దేశంలోని బడుల్లో మధ్యాహ్న భోజన పథకానికి… అంగన్వాడీలు, రేషన్ షాపుల్లో పూర్తిగా ఫోర్టిఫైడ్ రైస్ వాడకం, సరఫరాకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది.
ముఖ్యంగా 2019-20 నుంచి ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాల్లో ఫోర్టిఫైడ్ రైస్ వాడకం దిశగా కేంద్రం దేశవ్యాప్తంగా 112 జిల్లాలను మూడేళ్ళ కాలానికి పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేస్తే… దక్షిణాదిలో పలు రాష్ట్రాలు ఈ సదవకాశాన్ని వినియోగించుకునేందుకు ముందుకొచ్చాయి కానీ తెలంగాణ నుంచి సరైన స్పందన లేదు. ఈ సూక్ష్మపోషకాల బియ్యాన్ని ఉపయోగించుకోవాలని, ఎఫ్‌సీఐకి సరఫరా చెయ్యాలని… కేంద్ర విద్యాశాఖ లేఖ రాసినా తెలంగాణ పాలకులు సైలెంట్. ఒకవైపు ఇన్ని అవకాశాలున్నప్పటికీ వినియోగించుకోకుండా కేంద్రాన్ని దోషిగా చూపే తెలంగాణ పాలకుల దుర్నీతిలోని లోగుట్టు ప్రజలకు తెలియంది కాదు.

Leave a Reply