తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో డీసీపీ అడ్మిన్ అనసూయ, ఐపీ్ఎస్., జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ముందుగా సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు సుదీర్ఘ పోరాటం ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటు జరిగిందని, రజాకార్లు నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగిందని అమరుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల ప్రత్యేక సంస్కృతి, గుర్తింపు వచ్చాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ అభివృద్ధిలో మనవంతు పాత్ర ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కృషి, క్రమశిక్షణతో మన భావితరాలకు మార్గానిర్దేశకత్వం చేసిన వారమావుతామన్నారు. పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలంగాణ పోలీసులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం నీతి నిజాయితీతో పారదర్శకతతో ధనిక, పేద తేడా లేకుండా పోలీస్ సేవలు అందించాలన్నారు.
పోలీసులు నిరంతరం శాంతిభద్రతలు కాపాడటంలో ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడటం లో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో వీర జవాన్లు.. ఉగ్రవాదులు, తీవ్రవాదులు మరియు ఇతర సంఘ విద్రోహ శక్తులతో పోరాడి వారి ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా పేరొందిందన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ కవిత, ఐపీఎస్., ఏడీసీపీలు రవికుమార్, వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఏఓ అకౌంట్స్ చంద్రకళ, సీఏఓ అడ్మిన్ గీత, ఏసీపీలు మట్టయ్య, ధనలక్ష్మి, కిషోర్, సీసీఅర్బీ ఏసీపీ రవిచంద్ర, ఇన్ స్పెక్టర్లు, సెక్షన్ల సుపరింటెండెంట్లు, మినిస్టీరియల్ స్టాఫ్, ఐటీ, ఏఆర్ సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.