– బతుకమ్మ కేవలం ఒక పండుగ కాదు .. తెలంగాణ ఆత్మ గీతం
– మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్: తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. తెలంగాణను భారతదేశంలో అత్యంత ఇష్టపడే గమ్యస్థానంగా నిలపడమే నూతన పర్యాటక విధాన ప్రధాన లక్ష్యం. వచ్చే ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం. కనీసం మూడు లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పించడం.
దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడంలో దేశంలో తొలి ఐదు స్థానాల్లో తెలంగాణను నిలపడం. రాష్ట్ర ఆదాయంలో 10 శాతం, అంతకంటే ఎక్కువగా టూరిజం నుంచి వచ్చేలా చూడటం ఈ లక్ష్యాల్లో భాగం. పర్యాటకం – తెలంగాణ సంస్కృతి ఈ రెండింటి మేళవింపుగా మిస్ వరల్డ్ ఈవెంట్ ను విజయవంతంగా నిర్వహించాం.
రాష్ట్రంలో నిర్వహించే పండగల విశిష్టత, మన సంస్కృతి అంతర్జాతీయ పర్యాటకులకూ తెలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. వారిని ఆకర్షించాలనే ప్రత్యేక కార్యచరణతో ముందుకువెళ్తున్నాం. ప్రకృతిని గొప్పగా ఆరాధించే ఉత్సవం బతుకమ్మ.. రకరకాల పూలను ఒక్కచోట అలంకరించి బతుకమ్మగా కొలువడం మన ప్రత్యేకత.
పూలతో చేసే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడా లేని ప్రత్యేకత. బతుకమ్మ కేవలం ఒక పండుగ కాదు – ఇది తెలంగాణ ఆత్మ గీతం. మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండే, సమాజాన్ని, కుటుంబాలను కలిపే పండుగ ఇది. ప్రకృతి, పర్యావరణం, పూలతో మన బంధాన్ని ప్రతిబింబించేలా సంబరాలు. ప్రతి తెలంగాణవాసి గుండెల్లో పూల పరిమళంలా నిలిచేలా ఉత్సవం.
రియో కార్నివల్ బ్రెజిల్ గర్వంగా నిలిచినట్లే, బతుకమ్మ తెలంగాణ గర్వంగా నిలుస్తుంది. ఉద్యమ స్ఫూర్తిని పెంచిన బతుకమ్మ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. ఉద్యమ నాయకుల్లో స్ఫూర్తిని పెంచారు.
ప్రకృతిని మన సంస్కృతిలో భాగస్వామ్యం చేసుకుంటూ నిర్వహించే ఈ వేడుక ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. తెలంగాణ బతుకమ్మ పండగ ఎంతో ఖ్యాతి పొందింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహించి, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పబోతున్నాం
బ్రెజిల్లో ఏటా ఘనంగా నిర్వహించే ‘రియో కార్నివాల్’ తరహా కార్యక్రమాలను తెలంగాణలోనూ చేపట్టాలనే ప్రణాళికను రూపొందించాం. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ పండగను నిర్వహించబోతున్నాం. ఈ పండుగ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 9 రోజుల పాటు 9 వేడుకలు, కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
రియో కార్నివల్ ప్రపంచాన్ని ఆకర్షించినట్లే, బతుకమ్మను కూడా తెలంగాణ సంస్కృతి–సంప్రదాయాల ప్రతీకగా, ప్రపంచ స్థాయి ఉత్సవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రియో కార్నివల్ ఎలా బ్రెజిల్ పర్యాటక రంగానికి గ్లోబల్ ఐడెంటిటీ ఇచ్చిందో, బతుకమ్మ కూడా తెలంగాణ టూరిజానికి అలాంటి బ్రాండ్ ఐడెంటిటీ ఇస్తుందని ఆశిస్తున్నాం.