Home » తెలంగాణలో తీవ్రవాదుల పాలన

తెలంగాణలో తీవ్రవాదుల పాలన

-రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖానే
-రేవంత్ రెడ్డిది టీడీపీ, సమైక్యాంధ్ర డీఎన్ఏ
-బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మార్చే ప్రసక్తే లేదు
-రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ కాంగ్రెస్ చేసిన ఫేక్ న్యూస్ పై మండిపాటు
-ఎస్సీలు, బీసీలను భయబ్రాంతులకు గురిచేసే కుట్ర
-కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానిస్తే.. భారతరత్నతో గౌరవించిన పార్టీ బీజేపీ
-ఓట్ల కోసం మతాలకు రిషర్వేషన్లు పెట్టిందే కాంగ్రెస్
-అమిత్ షా మాటలను వక్రీకరించిన కాంగ్రెస్ పై ఆగ్రహం
-ఎన్నికల వేళ కాంగ్రెస్ దుష్ప్రచారంపై నిప్పులు చెరిగిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ

హైదరాబాద్. ముఖ్యమంత్రి పదవి వస్తే అదృష్టంగా భావించాలి. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని ప్రజలు, భగవంతుడు ఆశీర్వదించినట్టుగా, రాష్ట్రాన్ని మరింత ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి, దేశంలో నెం.1 స్థానానికి తీసుకెళ్లేలా పని చేయాలి.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లుగా, మోదీ ప్రభుత్వ సహకారంతో తెలంగాణను కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని ఆశించినం. ఉద్యమ తెలంగాణలో గత పది సంవత్సరాలు నియంత, కుటంబ పాలన రాజ్యమేలింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి చేస్తరని ప్రజలు భావించారు. కానీ, తెలంగాణలో తీవ్రవాదుల పాలన వచ్చినట్టుగా ఉంది. అమిత్ షా సిద్దిపేటలో మాట్లాడిన మాటలను వక్రీకరించి తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన 15నిమిషాల తర్వాత డిలీట్ చేశారు. ఇలాంటి నీచమైన స్థితికి సీఎం రేవంత్ రెడ్డి దిగజారిండు. లేని మాటలను అన్నట్లుగా ఎస్సీ, బీసీలను భయబ్రాంతులకు గురి చేసి, విధ్వంసాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.

రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఓటమి భయంతో బండి సంజయ్ పై ఫేక్ ప్రచారం చేశారు. అమిత్ షా రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేస్తున్నారని ఒక వీడియో తయారు చేశారు. దీని పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారు…? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లుగా రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖానే.. రేవంత్ రెడ్డి వ్యవహారం కోతికి కొబ్బరి చిప్ప దొరికనట్లుగా ఉంది.

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల నుంచి అంబేద్కర్ గారి విషయంలో, రిజర్వేషన్ల విషయంలో పెద్దపీట వేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 54 సంవత్సరాలలో అంబేద్కర్ గారి గురించి కాంగ్రెస్ నాయకులు పార్లమెంటులో ఎప్పుడైనా గౌరవించారా..? వారి చిత్రపటాన్ని ఒక్కసారైనా పార్లమెంటు ఆవరణలో పెట్టే ఆలోచన కూడా చేయలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంటు ఆవరణలో పెట్టి గౌరవించినం.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా 27 మంది బీసీలకు, 8 మంది ఎస్టీలకు, 12 మంది ఎస్టీలకు, 12 మంది మహిళలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది బిజెపి. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏనాడు కూడా బీసీలు, ఎస్సీలకు సరైన అవకాశాలు ఇచ్చింది లేదు. అంబేద్కర్ గారికి భారతరత్నఇచ్చిన ఘనత బీజేపీది. పార్లమెంటులో రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ గారు మాట్లాడిన తర్వాత బలవంతంగా ఆయనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి పదవికి రాజీనామా చేయించారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడగొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటు. అంబేద్కర్ గారు మళ్లీ పుట్టి వచ్చి రిజర్వేషన్లను రద్దు చేద్దామంటే కూడా మేం రద్దు చేయమని ప్రధాని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు.

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిన బుడ్డర్ ఖాన్ రేవంత్ రెడ్డి లాగా మోదీ గారు అబద్దాలు చెప్పే నాయకుడు కాదు. ఆగస్టు 15న రుణమాఫీ అని రేవంత్ రెడ్డి కొత్త మాట చెప్తున్నడు. ఎంపీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత అడిగేవారుండని కొత్త మాట చెప్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ల లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం, ఎన్నికల్లో ప్రజలు ఆరు గ్యారంటీలను అడుగుతరని మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు న్యాయబద్దంగా వచ్చే రిజర్వేషన్లలో 4శాతం రిజర్వేషన్లను తీసేసి ముస్లింలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.

మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాస్తే, గౌరవ సుప్రీంకోర్డు తీర్పు చెప్పినా కూడా..దానిని ధిక్కరించి మతపరమైన రిజర్వేషన్లను అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2011లో యూపీఏ ప్రభుత్వంలో మతహింస చట్టాన్ని తీసుకొద్దామని సోనియాగాంధీ ప్రయత్నం చేశారు. బీజేపీ అడ్డుపడకపోతే ఆ మతహింస బిల్లు కూడా పాస్ అయ్యేది. ఓట్ల కోసం మతాలకు రిషర్వేషన్లు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ.

జీఎచ్ఎంసీ లో మతపరమైన రిజర్వేషన్ల వల్ల చాలా మంది బీసీ నాయకులు అవకాశాలు కోల్పోయారు. ఈ విషయం రేవంత్ రెడ్డి కి తెలియదా..?. రేవంత్ రెడ్డిది టీడీపీ, సమైక్యాంధ్ర డీఎన్ఏ. భూములు కొనాలే..అమ్మాలే. గుంపు మేస్త్రీ పదవి వస్తే రాష్ట్రాన్ని పరిపాలించొచ్చని ఎన్నికల ముందు చెప్పిన రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందాలే చేస్తున్నడు.

మత రిజర్వేషన్లను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డికి తెలియదు. ఓట్ల కోసం తీవ్రవాదులకు మద్దతు తెలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టే. పాతబస్తీలో తీవ్రవాదుల డెడ్ బాడీలను ఊరేగిస్తే రేవంత్ రెడ్డి రైట్ హాండ్ షబ్బీర్ అలీ పాల్గొన్నడు.

కాంగ్రెస్ హయాంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కాసు కృష్ణా రెడ్డి పాతబస్తీలోకి వెళ్తే తన పర్మిషన్ లేకుండా ఎలా వస్తరని ఒవైసీ లాఠీలు పట్టుకుని తరిమిండు. అవన్నీ రేవంత్ రెడ్డి యాదిపెట్టుకోవాలి. కేసీఆర్ కు ప్రజలు రెండు సార్లు అవకాశం ఇస్తే.. తాను, తన కుటుంబమనే అహంకారంతో వ్యవహరించారు. అందుకే అధికారం నుంచి ప్రజలు దించేశారు. 4 నెలల్లోనే రేవంత్ రెడ్డి అహంకారం ప్రజలకు తెలిసింది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రజల వెంటనే ఉంటది. మీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందింది. ఇప్పుడేమో రిజర్వేషన్ల పేరుతో పార్లమెంటు ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తున్నరు. వాళ్ల సోషల్ మీడియా, అంటగాగిన వార్త పత్రికల ద్వారా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నరు.

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ తెలంగాణకు ముఖ్యమంత్రి అయితడని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు అంటున్నడు. పని గట్టుకొని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న ఫేక్ న్యూస్ ప్రచారాలను ప్రజలకు అర్ధమయ్యేలా వివరించి, కాంగ్రెస్ వ్యవహారాన్ని ప్రజల సాక్షిగా ఎండగడ్తామని హెచ్చరిస్తున్నాం.

Leave a Reply