Home » అదే అసలైన ఆధ్యాత్మిక సాధన

అదే అసలైన ఆధ్యాత్మిక సాధన

వాయువు చేతనే మేఘం రావించబడి మరల వాయువు చేతనే తొలగింప(కొనిపో) బడుచున్నది. అలాగే, మనసు చేతనే బంధం, మోక్షం కల్పించబడుతున్నాయి’. మనసు సత్తరజస్తమో గుణాత్మకం. మనసు రజోగుణంతో ఉన్నప్పుడు కర్మలను ప్రేరేపిస్తుంది. ఇంద్రియభోగాలలో ఆసక్తిని కలిగిస్తుంది.

ఫలితంగా రాగద్వేషాలు కలుగుతాయి. ఇంద్రియ విషయాలు అనుకూలంగా ఉన్నప్పుడు ‘సుఖం’, అనుకూలంగా లేనప్పుడు ‘దుఃఖం’ భావనలను కలిగిస్తుంది. మనసు తమోగుణంతో ఉన్నప్పుడు నిద్ర, సోమరితనం మొదలైనవి ప్రేరేపితమై వ్యర్థచేష్టలకు కారణమవుతుంది. మోహాన్ని కల్పించి మానవుని వివేకహీనుని చేస్తుంది. అదే మనసు నిర్మలం, వికార రహితమైనప్పుడు శుద్ధసత్త గుణంతో జ్ఞాన, వైరాగ్యాలను కల్పించి మోక్షానికి కారణమవుతుంది.

ఈ మనసే ఇంద్రియాల ద్వారా విషయాలను సేకరిస్తూ ‘భోగాల’ను అనుభవిస్తుంటుంది. ‘నేను, నాది’ అనే భావనలను కల్పిస్తుంది. కర్మలు చేయిస్తూ, వాటి ఫలాలను అనుభవింపజేస్తుంది. అందువల్ల, మనసును వశంలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ‘మనసు అనే పెద్దపులి విషయాలనే అరణ్యభూములలో తిరుగుతున్నది.

మోక్షాపేక్షగల ఓ సాధుజనులారా! అటువైపు వెళ్లకండి (వివేక చూడామణి)’ అన్నారు శంకరులు.’ శబ్ద, స్పర్శ, రూప, రస (రుచి), గంధము (వాసన)లు- అన్నవి చెవులు, చర్మం (శరీరం), కళ్లు, నాలుక, ముక్కు అనే అయిదు ఇంద్రియాలకు చెందిన విషయాలు. వీటిపట్ల వ్యామోహంతో మనిషి వివేకహీనుడై పతనం చెందుతాడు. జింక వేణుగానాని (శబ్దం)కి వశపడి బోయవానికి చిక్కుతుంది. మగ ఏనుగు ఆడ ఏనుగు స్పర్శ(శరీరం) కోసం కందకంలో పడిపోతుంది. మిడుత అగ్నిజ్వాలను చూసి (రూపం) దానిని మింగాలని ప్రయత్నించి, ఆ అగ్నిలోనే పడి మరణిస్తుంది.

ఎరలకు (రుచి) ఆశ పడి చేప గాలానికి చిక్కుతుంది. ఇదే విధంగా, తుమ్మెద పువ్వు పరిమళాన్ని (వాసన) ఆశించి దానిలోనే చిక్కు పడుతుంది. ఇలా- జింక, ఏనుగు, మిడుత, చేప, తుమ్మెద అనే అయిదు ప్రాణులు ఒక్కొక్క ఇంద్రియ విషయంలోని ఆసక్తిచేత నశించి పోతుండగా, పంచేంద్రియాల పట్లా ఆసక్తితో మనిషి భ్రష్టుడవుతున్నాడు. అందువల్ల ఇంద్రియ వ్యామోహాన్ని (మోక్షానికి) ఆటంకంగా గుర్తించి, వాటిని మనసుద్వారా నియంత్రించుకోవాలి.

రాగం, ద్వేషం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, అసూయ, దంభం, దర్పం, అహంకారం, ఇచ్ఛ, భక్తి, శ్రద్ధ.. ఈ 16 మనసుకు చెందిన వృత్తులు. వీటిలో ‘శ్రద్ధ, భక్తి’ మినహా మిగిలిన 14 మలిన (అశుద్ధ) వృత్తులు. ఇవి మనిషిని పాపకర్మలవైపు ప్రోత్సహిస్తాయి. ఏ ప్రయత్నం లేకుండగానే మరల మరల ఏర్పడుతుంటాయి. వీటితోనే మనిషి పతనమవుతాడు. ప్రయత్నపూర్వకంగా ఈ అశుద్ధ వృత్తులను నిరోధించి, శుద్ధ వృత్తులైన భక్తి, శ్రద్ధలను అలవరచుకోవాలి. భక్తి, శ్రద్ధలతో కర్మలు చేసేవారికి క్రమక్రమంగా సంసారబంధ విముక్తి కలుగుతుంది.

ఆకలి, దప్పిక, విసర్జనాది కర్మలు విడువదగినవి కావు. రాగాది విషయాలు కూడా ‘నేను, నాది’ అనే అభిమానం చేతనే ఏర్పడతాయి. అభిమానం ఉన్నంతవరకు కర్మలపట్ల ప్రవృత్తి (ఆసక్తి) ఏర్పడుతుంది. ఈ అభిమానం అజ్ఞానం (అవివేకం) చేత కలుగుతుంది. వాస్తవమైన దానిని గుర్తించలేక పోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానానికి ‘ఆది లేదు’ కానీ, అంతం వుంది. జ్ఞానం వల్లే అజ్ఞానం నశిస్తుంది. ఈ జ్ఞానం నిర్మలమైన మనసులోనే కలుగుతుంది. అందువల్ల, ఇంద్రియాలను, మనసును, బుద్ధిని వశం చేసుకొని అంతరంగ శుద్ధిని ఏర్పరచుకోవాలి. అదే అసలైన ఆధ్యాత్మిక సాధన!

సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

Leave a Reply