-ప్రివిలేజ్ ఫీజు రద్దు వల్ల రూ. 1300 కోట్లు నష్టం అనేది అబద్దం
-ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో తప్పు జరిగితే అధికారులను వదిలేసి సీఎంపై కేసు ఎలా పెడతారు?
-టీడీపీ హయాంలో మద్యంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు
సీఎం జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల నుంచి అభివృద్ది, సంక్షేమం గాలికొదిలి ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడమే ద్వేయంగా పనిచేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరావు మండి పడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….టీడీపీ హయాంలో జరిగిన విధాన పరమైన మద్యం పాలసీపై చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటు. కోర్టులు ఎన్ని సార్లు చివాట్లు పెట్టినా సిగ్గులేకుండా అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు.
ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయటం వలన ప్రభుత్వానికి రూ. 1300 కోట్లు నష్టం వచ్చిందని విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జే గ్యాంగ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 2015- 16 సంవత్సరానికి సంబందించి మద్యం పాలసీని రూపొందించేటపుడు 3 సార్లు క్యాబినెట్ మీటింగులు నిర్వహించి క్షుణ్టంగా అధ్యయనం చేసిన తర్వాతే పాలసీని రూపొందించారు. 2015-16 సంవత్సరానికి మద్యం విధానం నిర్ణయం కోసం అప్పటి కమిషనర్ శ్రీ నరేష్ మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం కలిసి ప్రభుత్వానికి నోట్ పంపించారు.
అందులో వారు చెప్పిన విషయాలు
1. తెలంగాణలో షాపుల సంఖ్యను పెంచుతున్నారు. 10వేల జనాభాకు ఒక షాపు పెడుతున్నారు. 2. ఆ రాష్ట్రంలో మద్యం ధరలను క్వార్టర్ రూ.30 నుండి రూ.40 తగ్గించారు. 3. గత మూడు సంవత్సరాలుగా వినియోగం తగ్గుముఖంలో ఉంది. 4. ఆంధ్రప్రదేశ్‌కు 6 పొరుగు రాష్ట్రాల నుండి మద్యం అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పాలసీ నిర్ణయం చేయవలసినదిగా వారు కోరారు. మద్యం విధానంపై కేబినెట్ మూడు సమావేశాల్లో చర్చించింది. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నాలుగో సమావేశంలో విధివిధానాలను రూపొందించారు. (22.05.2015, 01.06.2015, 08.06.2015 మరియు 17.06.2015) ప్రస్తుతం డెప్యుటేషన్‌లో హోదాకు మించిన ఉద్యోగాన్ని చేస్తున్న వాసుదేవ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో కేబినెట్లో చర్చించకుండా ఆ విషయాలపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా మద్యం షాపులపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారని ఆరోపణ చేశారు.
ఈయన స్థాయికి కేబినెట్ సమావేశాల మీద ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫిర్యాదు ఏమిటనేది ప్రజలు గమనించాలి. ఆయన చెప్పిన విధంగానే కేబినెట్ తీర్మానంలో స్థూల విషయాలను మాత్రమే ప్రస్తావించారు. షాపులను ఫిక్స్‌డ్ అద్దెకు లాటరీ పద్దతిలో కేటాయించాలని, పొరుగు రాష్ట్రాల నుండి మద్యం రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ మద్యాన్ని అరికట్టాలని విధాన నిర్ణయాలు మాట్లాడారు. ఈ కేబినెట్ తీర్మానంపై అప్పటి ప్రధాన కార్యదర్శి 22.06.2015న సంతకం చేశారు. విశేషం ఏమిటంటే అదే రోజు ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీ అజేయ కల్లాం రెడ్డి గారు తానే సంతకం చేసి జీవో నెం.216, తేది.22.06.2015 మరియు జీవో నెం.217, తేది. 22.06.2015లను విడుదల చేశారు.
ఈ జీవోల ద్వారా ఆయన ఎక్సైజ్ రూల్స్ కు సవరణలు చేసి అనేక నిర్ణయాలను ప్రకటించారు. అందులో ముఖ్యమైనవి.. షాపులకు సంబంధించి అప్పటి వరకు అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజు విధానాన్ని ఆయన రద్దు చేస్తున్నట్లు ఆదేశాలిచ్చారు. ఏదైనా ఒక షాపు నిర్దేశించిన లైసెన్సు ఫీజుపై ఆరు రెట్లకు మించి వ్యాపారం చేస్తే అధనపు అమ్మకాలపై 8% పన్ను, వ్యాట్ చెల్లించాలి. దీని వలన కొన్ని షాపుల వారు ఎం.ఆర్.పిని మించి అమ్మడం, వేరే షాపులపై ఆర్డరు పెట్టి ఇక్కడ అమ్ముకోవడం లాంటి అవకతవకలకు పాల్పడేవారు. దీనిని అరికట్టడం కోసమే ఈ ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయడం జరిగింది.
దానిపై అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర గారు గానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు గానీ సంతకమే చేయలేదు. కేవలం ముఖ్యకార్యదర్శి అజేయ కల్లాం గారు మాత్రమే నిర్ణయం తీసుకుని ఆ జీవోను విడుదల చేశారు. కానీ చంద్రబాబు, కొల్లు రవీంద్ర దానిపై సంతకాలు చేశారని విజయసాయిరెడ్డి, సజ్జల మాట్లాడటం సిగ్గుచేటు. నాడు అజేయ కల్లం ఎక్సైజ్ ప్రిన్పిఫల్ సెక్రటరీగా దానిపై సంతకాలు చేశారు. విధాన పరమైన నిర్ణయాలను తప్పు పడుతూ అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటు. తర్వాత బార్ పాలసీని నిర్ణయించడం కోసం అప్పటి కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాంకి కొన్ని సూచనలు చేస్తూ నోట్ పంపించారు.
ఆ ఫైలుపై అజేయ కల్లాం ఇప్పటికే ఈ విషయాలను మంత్రి, ముఖ్యమంత్రితో చర్చించానని, కేవలం లాంఛనంగా మాత్రమే వారి సంతకాలకు పంపుతున్నానని స్పష్టంగా రాశారు. ఆ తర్వాత ఆఫైలుపై అజేయ కల్లాం సూచించిన విధంగా మంత్రి, ముఖ్యమంత్రి సంతకాలు చేశారు. వాసుదేవ రెడ్డికి ఇందులో ఏదో కుంభకోణం ఉందని అర్ధమైపోయిందట. ఆయన దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేయడం, వారు షరామామూలుగా కేసు నమోదు చేసి భయంకరమైన వాదనలు చేయడం హాస్యాస్పదం. ఈ ప్రివిలేజ్ ఫీజు రద్దు వల్ల రూ.1299 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చిందన్నది పచ్చి అబద్దం. ఈ కేసు సందర్భంగా సీఐడీ వారే స్వయంగా ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఒక పత్రాన్ని మీడియాకు విడుదల చేస్తున్నాం.
దీని ప్రకారం ప్రివిలేజ్ ఫీజు రద్దు వలన 9 నెలలకు గాను వాటిల్లిన నష్టం కేవలం రూ.11.32 కోట్లు. అంటే సుమారుగా సంవత్సరానికి రూ.15 కోట్లు. అదే ఆదేశాల్లో తిరిగి ఇవ్వని దరఖాస్తు ఫీజును రూ.5000 నుండి రూ.2 లక్షలకు పెంచారు. దాని వల్ల వచ్చిన ఆదాయం రూ.40 కోట్లు. ఇది ఎందుకు సీఐడీకి కనిపించటం లేదు? ఒక విధాన నిర్ణయానికి వక్రభాష్యం చెప్పడమంటే ఇలానే ఉంటుంది. ఈ విషయాన్ని 2016 కాగ్ నివేదికలో ప్రస్తావించి ప్రివిలేజ్ ఫీజు రద్దు వలన మద్యం అమ్మకాలు బాగా పెరిగాయని, అక్రమ మద్యం, పొరుగు రాష్ట్రాల నుండి మద్యం రవాణా అరికట్టబడ్డాయని, ఈ చర్య సమర్ధనీయమని పేర్కొన్నారు.
కానీ, 2014-15 నుండి 2018-19 వరకు ఐదు సంవత్సరాల పర్ఫార్మెన్స్ ఆడిట్ చేస్తున్నప్పుడు డ్రాఫ్ట్ రిపోర్టులో కాగ్ వారు ప్రివిలేజ్ ఫీజు గురించి ప్రస్తావించి, ప్రివిలేజ్ ఫీజును అన్ని షాపుల నుండి వసూల్ చేస్తే రూ.1299 కోట్లు వచ్చి ఉండేదని తప్పుగా వ్యాఖ్యానించారు. ఇది కేవలం డ్రాఫ్ట్ నివేదిక మాత్రమే. అదే అధికారులు దీనిని మళ్లీ పరిశీలించి తుది నివేదికలో ఈ విషయాన్ని పూర్తిగా తొలగించారు. ఆడిట్‌లో సంతృప్తి చెందిన తర్వాత విషయాన్ని తొలగించడం అనేది సాధారణమైన విషయం. ఈ డ్రాఫ్ట్ నివేదికలోని అంశాన్ని పట్టుకుని హైకోర్టు వరకు వ్యాజ్యాలను ప్రజల సొమ్ముతో రాజకీయ ప్రయోజనాల కోసం నడుపుతున్నారు.
జీవో నెం.216, జీవోనెం.2017 తేది.22.06.2015లను స్వయంగా మంత్రి, ముఖ్యమంత్రి సంతకం లేకుండా విడుదల చేసి షాపులపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసిన అజేయ కల్లాంపై కేసు నమోదు చేసి రూ.1299 కోట్లు ఆయన నుండి వసూలు చేస్తారా? సీఐడీ సమాధానం చెప్పాల్సి ఉంది. లేదా అది తప్పుడు అంచనా అని అజేయ కల్లాం తన అధికారాల మేరకు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆ నిర్ణయం తీసుకున్నారని భావించి వాసుదేవ రెడ్డిపై చర్యలు తీసుకుని, తప్పుడు కేసులు పెట్టినందుకు అరెస్టు చేస్తారా అని ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులు, వారికి ఆదేశాలిచ్చిన వారు భవిష్యత్ లో మూల్యం చెల్లించక తప్పదు.
నేడు జగన్ రెడ్డి నాసికరం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. టీడీపీ హయాం కంటే నేడు 400 శాతం రేట్లు పెంచి నాసిరకం మద్యం అమ్ముతున్నారు. మద్యం షాపుల్లో ఎక్కడా డిజిటల్ ఫేమెంట్స్ లేవు. ఈ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తోంది. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో మద్యంలో లక్ష కోట్లు దోచేశారని టీడీపీ హయాంలో మద్యంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.