అగ్నిపథ్ స్కీం నిరుద్యోగుల ఆశలను వమ్ముచేసింది

-దత్తపుత్రులైన అంబానీ-అదానీలకు దోచిపెడుతున్న మోదీ-అమిత్‌షా
-మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆగ్రహం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దనే కాక దేశంలో పలు ప్రాంతాల్లో అగ్నిపథ్ పథకంపై తీవ్రంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి,ఆ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకొనడం దురదృష్టక‌రం.ఏటా రెండు కోట్ల ఉద్యోగావకాశాలు కల్పించెదనని ప్రజలకు వాగ్దానం చేసి ఎనిమిది సంవత్సరాలుగా కొద్ది లక్షల ఉద్యోగాలు కొత్తవి యివ్వకపోగా లక్షలాది వున్న ఉద్యోగాలు మోడీ పుణ్యాన ఊడిపోయాయి.

తాజాగా అగ్నిపథ్ స్కీం నిరుద్యోగుల ఆశలను వమ్ముచేసింది.ఫలితమే నిరసనలు.భారత రక్షణ పాటవాన్ని పెంచేందుకు ఈ స్కీం తెచ్చామని అధికారవర్గాలు చెప్పటంలో నిజం లేదు. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు సంఖ్యను తగ్గించడమేకాక, థరను అడ్డగోలుగా పెంచడమేకాక,దివాలా తీసినట్లు స్వయంగా కోర్టుకు తెలియపరచిన అనిల్ అంబానీ కి రక్షణ ఉత్పత్తుల తయారీ లో అనుభవం లేకపోయినా, ఆ రాఫేల్ ఒప్పందం అప్ సెట్ క్లాజ్ ద్వారా లబ్ధి చేకూర్చిన ఘనత మోడీది.

మోడీ -అమిత్ షా ద్వయం నిస్సిగ్గుగా క్రోని కాపిటలిజంను అమలు చేస్తూ దత్త పుత్రుడు గౌతం అదానికి దశాబ్దాలుగా ప్రజల పన్నులు,బ్యాంకుల రుణాలతో లక్షలాది శ్రామికుల స్వేదంతో అభివృద్ధి చేయబడిన సంస్థలను కారుచౌకగా కట్టబెట్టడాన్ని ప్రజలు ముఖ్యంగా విద్యావంతులు, నిరుద్యోగులు గమనిస్తూ వున్నదాని పర్యవసానం ఈ నిరసన పరిణామం.పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడటంలేదని భావించినట్లే కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.రైతులకు ఒక్క రూపాయి రుణ మాఫీ చేయని మోడీ బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయడం సిగ్గు చేటు.